Saturday, July 27, 2024
HomeTrending NewsIndendents: స్వతంత్రుల ప్రచారం...గులాబీ నేతలకు నష్టం

Indendents: స్వతంత్రుల ప్రచారం…గులాబీ నేతలకు నష్టం

సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల పోటీ చేయటం ఎప్పుడు జరుగుతున్నదే. తెలంగాణలో జరుగుతున్న మూడో దఫా ఎన్నికల్లో కూడా వివిధ నియోజకవర్గాల్లో కొందరు స్వతంత్రులు బరిలోకి దిగారు.

గతంలో ఓ నియోజకవర్గం వరకే ఆ ప్రభావం ఉండేది. మీడియా, సోషల్ మీడియా ప్రభావంతో ఇప్పుడు సమస్యల సాధన కోసం పోటీ చేసేవారికి అధికంగా ప్రాచుర్యం వస్తోంది. సోషల్ మీడియాలో మొదలవుతున్న చర్చ ఏ నలుగురు కలిసినా చర్చించే స్థాయికి చేరుకుంటోంది.

కొల్లాపూర్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిరీష@బర్రేలక్క గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిరుద్యోగం మీద వీడియో చేయటం..ఆమెపై కేసు..ఇబ్బందులు ఎదుర్కొన్న శిరీష శాసనసభ ఎన్నికల్లో పోటీకి దిగింది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీషకు విజిల్ గుర్తు కేటాయించారు.

నిరుద్యోగుల గొంతుకనై చట్టసభల్లో వాణి వినిపిస్తానని ప్రచారం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె సోదరునిపై దాడి చేయగా ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు ఆమెకు అండగా నిలిచాయి. మాజీ మంత్రి మల్లాది కృష్ణ రావు లక్ష రూపాయలు ఎన్నికల విరాళం ఇవ్వటం… విశ్వవిద్యాలయాల నుంచి నిరుద్యోగులు వెళ్లి ప్రచారం…ఇలా కొల్లాపూర్ లో శిరీష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కామారెడ్డి నుంచి మంగిలపల్లి భార్గవి పోటీలో ఉన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ తో పరీక్షా రాసి ఎంపిక అయ్యాక ఒద్యోగం ఇవ్వటం లేదని తన లాంటి వారు అనేకమంత్రి ఉన్నారని భార్గవి తెలిపింది. ఉద్యోగాల్లో న్యాయామైన వాటా కోసం తెలంగాణ తెచ్చుకుంటే…ఇప్పుడు నోటిఫికేషన్ల కోసం ధర్నాలు, పరీక్షా నిర్వహణ కోసం ధర్నాలు ఇలా ప్రతి దానికి స్వరాష్ట్రంలో నిరసనలు తెలపాల్సిన దుస్థితి వచ్చిందని భార్గవ్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

courtesy- ManaToli velugu 

సోషల్ మీడియా ద్వారా సెలెబ్రిటీ అయిన గుంటి నాగరాజు ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నాడు. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం కోయచెలక గ్రామానికి చెందిన గుంటి నాగరాజు.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గుంటి నాగరాజుకు ఎన్నికల అధికారులు విజిల్ గుర్తు కేటాయించగా.. తాను వెరైటీగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. తన ద్విచక్రవాహనానికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని.. మైక్ ద్వారా గ్రామ గ్రామాలు తిరుగుతూ ప్రాచరం చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

డిగ్రీ చదివిన గుంటి నాగరాజు.. చదివిన చదువుకు ఉద్యోగం రాకపోవటంతో.. వ్యవసాయంలోనే స్థిరపడినట్టు చెప్పుకొచ్చారు. తాను చేసే వ్యవసాయ పనులను వీడియో తీసి.. ఫేమస్ అయ్యానని చెప్పుకొచ్చాడు. నామినేషన్ ఉపసంహరించుకోమని ఈయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రైతు సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చేందుకు పోటీ చేస్తున్నట్టు వెల్లడించాడు.

గల్ఫ్ సమస్యల పరిష్కారం కోసం వేములవాడ, కోరుట్ల,నిర్మల్,ధర్మపురి నుంచి పోటీలో నిలిచారు. వీరంతా ఫార్వార్డ్ బ్లాక్ తరపున సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఐదు స్థానాల్లో పోటీలో ఉన్న గల్ఫ్ సంఘాల నాయకులకు ఓటు వేసి గెలిపించాలని సౌదీ అరేబియా, యూఏఈ (దుబాయి), ఓమాన్ (మస్కట్), కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ దేశాలతో పాటు సింగపూర్, మలేసియా తదితర దేశాల నుంచి గ్రామాల్లోని తమ కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, జూమ్, బోటిమ్, ఐఎంఓ లాంటి యాప్ లతో ఆడియో, వీడియో కాల్స్ చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో 15 లక్షల మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు పనిచేస్తున్నారు. గత పదేళ్లలో గల్ఫ్ నుంచి వాపస్ వచ్చి గ్రామాల్లో నివసిస్తున్న మరో 15 లక్షల మంది గల్ఫ్ రిటనీలున్నారు.

తెలంగాణలోని 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ఆర్ఐ కుటుంబాల ప్రభావం ఎక్కువగా ఉంది. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న ముధోల్, ఖానాపూర్ (ఎస్టీ), చొప్పదండి (ఎస్సీ), బాల్కొండ, ఆర్మూర్, జగిత్యాల, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో గల్ఫ్ వలసలున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు (ఎస్సీ), నిజామాబాద్ అర్బన్, బోధన్, పెద్దపల్లి, దేవరకద్ర, మక్తల్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, పరిగి లలో గల్ఫ్ ఓటు బ్యాంకు ఓ మోస్తరుగా ఉంది. వీరు ఏ రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనేది చర్చ నడుస్తోంది.

గజ్వేల్, మేడ్చల్ నియోజకవర్గాల్లో భూ భాదితులు పోటీ చేస్తున్నారు. పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని ఎన్నికలకు వెళుతున్నారు. ఈ విధంగా అనేక మంది బరిలో ఉన్నారు. వీరు పోటీ చేస్తున్న స్థానాల్లో అభ్యర్థులను ఓడించటం పక్కనపెడితే…రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పాలన వైఫల్యమనే కోణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటర్లు జతకడుతున్నారు.

స్వతంత్ర అభ్యర్థుల్లో గల్ఫ్ బాధితులు, బర్రెలక్క,గుంటి నాగరాజు, మంగిలిపల్లి భార్గవిల గొంతు ప్రచార రూపంలో బలంగా వినపడుతోంది. వీరితో కొంత మేర అధికారపార్టీకి నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి. డబ్బు ,అధికారం, ఎత్తులు జిత్తులు, కుట్రలు, కార్పొరేట్ ప్రచారాల మధ్య వీరి గెలుపు ఓటములు ఏమైనప్పటికీ… నిరుద్యోగ యువకుల అక్రందనల గొంతుకగా శ్రామిక వర్గ ప్రజల మనసుల్లో నిలిచారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్