Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్లంకతో సిరీస్: తొలి టి20 ఇండియాదే

లంకతో సిరీస్: తొలి టి20 ఇండియాదే

India Won 1st T20: ఇండియా- శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టి20 మ్యాచ్ లో ఇండియా ఘనవిజయం సాధించింది. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ లు బ్యాటింగ్ లో సత్తా చాటగా, బౌలర్లు సమిష్టిగా రాణించి లంకను కట్టడి చేయడంతో 62 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. మూడు టి 20లు, రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడేందుకు శ్రీలంక జట్టు ఇండియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు రోహిత్ శర్మ- ఇషాన్ కిషన్ లు 111 పరుగులు జోడించారు.  రోహిత్ 32 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్ తో 44;  ఇషాన్ కిషన్ 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులతో అజేయంగా నిలిచాడు. లంక బౌలర్లలో లాహిరు కుమార, దాసున శనక చెరో వికెట్ పడగొట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక పరుగుల ఖాతా తెరవక ముందే ఓపెనర్ పాశుమ్ నిశాంక వికెట్ కోల్పోయింది, భువీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. భువీ తన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ కామిల్ మిశార ను కూడా అవుట్ చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన జనిత్ లియనాగే ను వెంకటేష్ అయ్యర్ అవుట్ చేశాడు. చరిత్ అసలంక 47 బంతుల్లో 5 ఫోర్లతో 53; దుష్మంత చమీర 14 బంతుల్లో 2ఫోర్లు, ఒక సిక్సర్ తో 24 పరుగులతో అజేయంగా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేయగలిగింది. ఇండియా బౌలర్లలో భువీ, వెంకటేష్ అయ్యర్ చెరో రెండు; యజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

ఇషాన్ కిషన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఇండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. తరువాతి రెండు టి 20 మ్యాచ్ లు ధర్మశాల స్టేడియంలో 26,27 తేదీల్లో జరగనున్నాయి.

Also Read : చివరి వన్డేలో ఇండియా మహిళల గెలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్