Friday, March 29, 2024
HomeTrending Newsభారత ఆర్థిక వృద్ధికి అదే పెద్ద ముప్పు

భారత ఆర్థిక వృద్ధికి అదే పెద్ద ముప్పు

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే భారతదేశ ఆర్థిక వృద్ధికి పొంచి ఉన్న ప్రధాన ముప్పని ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సభ్యుడు జయంత్‌ ఆర్‌ వర్మ తెలిపారు. ముఖ్యంగా ఉద్రిక్తతలు ఆసియాకు విస్తరిస్తే పరిస్థితులు ఆందోళకరంగా మారతాయని ఢిల్లీలో పేర్కొన్నారు. ధరలు క్రమంగా కిందకు దిగొస్తున్నాయని.. భారత్‌లో అధిక ద్రవ్యోల్బణం ప్రామాణికం అయ్యే అవకాశం లేదని ధీమా వ్యక్తం చేశారు. వృద్ధి విషయంలో రాజీపడకుండా..ద్రవ్యోల్బణం 4 శాతం లోపునకు తీసుకురావాలని ఆర్‌బీఐ కృతనిశ్చయంతో ఉందని వెల్లడించారు. మరికొన్ని త్రైమాసికాల పాటు ద్రవ్యోల్బణం అధికంగానే ఉంటుందని తెలిపారు. అయితే, ధరల విషయంలో మాత్రం ఇప్పటికే దుర్భర పరిస్థితులు ముగిశాయనడానికి సరైన కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో ఉత్పత్తి, సేవా సంస్థల తయారీ సామర్థ్యం క్రమంగా పెరుగుతోందని వర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ మూలధన వ్యయాన్ని పెంచి విస్తరణకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత ఎగుమతులు గతంలో ఉన్న స్థాయికి చేరే అవకాశం లేదని వర్మ తెలిపారు. ఎగుమతులు నెమ్మదించడం ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. కరోనా నుంచి కోలుకుంటున్న భారత వృద్ధి రేటుకు ద్రవ్యోల్బణం రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని తెలిపారు. అయితే, ఈ రెండింటినీ సమర్థంగా ఎదుర్కోవడంలో ఆర్‌బీఐ పరపతి విధానం మెరుగైన ఫలితాలనిచ్చిందని పేర్కొన్నారు.
రూపాయి బలహీనత అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని వర్మ తెలిపారు. దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డాలర్‌ సూచీ 2.9 శాతం పెరిగితే.. రూపాయి 1.9 శాతం మాత్రమే పతనాన్ని చవిచూసిందని గుర్తుచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్