Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమంచిర్యాలను మంచిగ రాయండి సారూ!

మంచిర్యాలను మంచిగ రాయండి సారూ!

దేశంలో హిందీ జాతీయ భాష అవునా? కాదా? అన్న వాదోపవాదాల్లో ప్రాంతీయ భాషల అస్తిత్వాల మీద ధ్యాస పెరగడం శుభ పరిణామం.

హిందీ జాతీయ భాష కానే కాదు. ఈ దేశంలో అధికారికంగా గుర్తింపు పొందిన 22 భాషల్లో హిందీ కూడా ఒకటి- అంతే. కాకపోతే దేశ జనాభాలో 43 శాతం మంది హిందీ మాట్లాడేవారున్నారు కాబట్టి…హిందీ జాతీయ భాష అని చాలా మంది పొరబడుతూ ఉంటారు. హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాషలు వరుసగా బెంగాలీ, మరాఠీ, తెలుగు.

ఏ భాష దానికదిగా గొప్పది కాదు; అలాగే తక్కువదీ కాదు. ఆ భాషలో ఉన్న గ్రంథాలు, భాషా చరిత్ర, అనేక ప్రక్రియలకు అనువుగా ఉండడం లాంటి ఎన్నెన్నో అంశాలతో భాష గొప్పతనాన్ని బేరీజు వేయడం సాధారణం. అత్యధిక మంది వాడే భాష సహజంగా గొప్పది అనుకుంటాం. భారతీయ రైల్వేకు హిందీ అంటే చచ్చేంత ప్రేమ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ- బీ జె పి కి హిందీమీద ఉన్న ప్రేమను కొలవడానికి కూడా తూనికరాళ్ళు సరిపోవు. హిందీని జాతీయ భాషగా అధికారికంగా ప్రకటించి…దేశమంతా బలవంతంగానైనా హిందీని రుద్దాలని బీ జె పి మనసులో ఉన్నట్లు ప్రతిపక్షాలు అప్పుడప్పుడు ఆరోపిస్తున్నా…బి జె పి దాన్ని కాదనదు. అలా ప్రతిపక్షాలు హిందీని వ్యతిరేకిస్తూ ఎంత గట్టిగా అరిస్తే హిందీసీమల్లో బీ జె పి కి రాజకీయంగా అంత లాభం సిద్ధిస్తుందని కూడా ఒక పరిశీలన.

తాజాగా తెలంగాణ మంచిర్యాల రైల్వే స్టేషన్ విస్తరణకు, సుందరీకరణకు ఇరవై కోట్లా 49 లక్షల రూపాయలు కేటాయించినట్లు సామాజిక మాధ్యమాల్లో కేంద్రమంత్రి ప్రకటించారు. ఆ నిధులతో మారబోయే మంచిర్యాల స్టేషన్ ఎలా ఉంటుందో ఒక ఊహా చిత్రాన్ని కూడా జతచేశారు. అందులో “మంచిర్యాల”ను “మంచిర్ యాల్” అని రాశారు. “తెలుగులో ఊరిపేరును కూడా సరిగ్గా రాయలేరా?” అని కిషన్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ తెలుగు భాషాభిమానులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ పతాకానికి ఎదురుగా పెద్ద అక్షరాల్లో హిందీ నేమ్ బోర్డు పైన పెట్టి…కొంచెం చిన్న అక్షరాల్లో కింద అటుఇటు తెలుగులో, ఇంగ్లీషులో బోర్డులు పెడతారా? అని మరికొందరు అడుగుతున్నారు. ఇది ఊహాచిత్రమే కాబట్టి ద గ్రేట్ హిందీతో పాటు తెలుగుకు కూడా సమాన స్థాయి, సమాన సైజ్ ఇవ్వచ్చు- కిషన్ రెడ్డి అనుకుంటే. మధ్యలో కీలకంగా తప్పుల్లేకుండా తెలుగు బోర్డు ఉండి…పక్కన ఇంగ్లిష్, హిందీ బోర్డులు పెట్టచ్చు కదా అన్న తెలుగు ప్రేమికుల డిమాండులో తప్పు లేదు.

బీ జె పి వారు హిందీతో పాటు-
ప్రపంచ భజన సంప్రదాయాన్ని జనమార్గం పట్టించిన మరాఠీ అభంగాల అందచందాలను;
వేదాలతో సమానంగా నిలిచే తమిళ నయనారుల, ఆళ్వారుల పత్తికాలను;
భారతీయ సాహిత్యానికి మణిదీపాల వెలుగులను పంచిన మలయాళ మలయ మారుతాలను;
మరాఠీ భజనల కొనసాగింపుగా కన్నడలో జనసామాన్యులను చేరిన దాస సాహిత్యాన్ని;
అయోధ్య రాముడే మురిసిన రామదాసు, త్యాగయ్యల తెలుగు కీర్తనల గంగా ప్రవాహాలను;
పోతన పోతపోసిన కృష్ణతత్వాలను;
ప్రపంచం పట్టనంత బెంగాలీ సాహిత్యాన్ని;
సీతమ్మ పుట్టింటి మిథిలవాసులు మాట్లాడే మైథిలీ జానపదగాథలను;
లిపిలేకపోయినా మంగళూరు తీరంలో కోటి మందికి పైగా మాట్లాడుతున్న తుళు తళుకులను;
ఎగిరి గంతులేసే పంజాబీ యాసలను;
ఒద్దికైన ఒరియా అందాలను;
ఇంకా అనేకానేక భారతీయ భాషల అందచందాలను కూడా రుచి చూడాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది లేదు.

కొసమెరుపు:-
ప్రస్తుతం మంచిర్యాల స్టేషన్ బయట “మంచిర్యాల” అని తప్పుల్లేకుండా తెలుగు బోర్డు ఉన్నా…లోపల ప్లాట్ ఫామ్ మీద “మంచెరియాల్” అని తప్పు ఉందంటూ ఒక మిత్రుడు ఫోటోలు పంపుతూ…హిందీ, ఇంగ్లిష్ లో రాని తప్పులు తెలుగులోనే ఎందుకొస్తాయో? అని నిట్టూరుస్తున్నాడు!
(ఈ ఫోటోలు కొత్తవో! పాతవో! అక్కడ నిజంగా ఇలాగే ఉందో! లేదో! స్పష్టత రావాల్సి ఉంది)

ఎందుకంటే-
దేశభాషలందు తెలుగు లెస్సు కనుక!

ఇంతకూ మంచిర్యాలలో దిగాల్సిన తెలుగు ప్రయాణికులు-
“మంచిర్యాల”లో దిగాలా!
“మంచెరియాల్”లో దిగాలా!

తెలుగులో మంచి, మంచె ఒకటి కాదని; ఈ రెండు పదాలకు వేరు వేరు అర్థాలున్నాయని; పదాల మంచీచెడులు, వ్యుత్పత్తి అర్థాల గురించి ఏ శబ్దరత్నాకర నిఘంటు నిర్మాత బహుజనపల్లి సీతారామాచార్యులు మళ్ళీ పుట్టి చెప్పాలి ఈ హిందీ భూమి పుత్రులకు?

రైల్వే బోర్డుల్లో విలువలేని, నిలువనీడలేని తెలుగు అక్షరాలు తడబడుతున్నప్పుడు ఎక్కడ దిగితే ఏముంది? అన్న వైరాగ్యమే శ్రీరామరక్ష.

“నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు” అన్నాడొక కవి.
అలా- “నువ్ చదవాల్సిన రైలుకు జీవితకాలం చాలదు” అనుకుంటూ మంచిర్యాల రాగానే రైలు మంచె దిగి…తలదించుకుని వెళ్ళిపోవడమే మంచివారు చేయాల్సిన పని!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్