Silver Screen Sita: తెలుగు సినిమా తొలినాళ్లలో వెండితెరపై వెన్నెల పరిచిన కథానాయికలలో అంజలీదేవి ఒకరు. శ్రీరాముడు అనే పేరు వినగానే అందరి కళ్ల ముందు ఎన్టీ రామారావు రూపం ఎలా కదలాడుతుందో, సీతమ్మ తల్లి ప్రస్తావన రాగానే అంజలీదేవి రూపం అలా మనసు తెరపై మెదులుతుంది. కనురెప్పల వాకిళ్లలో కదులుతుంది. ‘పిలువకురా .. అలుగకురా’ అంటూ ‘సువర్ణ సుందరి’ సినిమాలో కలువల్లా విచ్చుకున్న కళ్లతో ఆమె చేసిన హావభావ విన్యాసం గుర్తుకువస్తుంది. తెలుగు తెరపై అడుగుపెట్టింది మొదలు చివరివరకూ తిరుగులేని ప్రయాణాన్ని కొనసాగించిన అతి తక్కువ మంది కథానాయికలలో ఆమె ఒకరు.
తూర్పు గోదావరిజిల్లాలోని ‘పెద్దాపురం’లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన అంజలీదేవి అసలు పేరు అంజనీ కుమారి. చిన్నప్పటి నుంచే అంజనీ కుమారి చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఆమె తండ్రికి నాటకాలపై ఆసక్తి ఎక్కువ. అందువలన తన కూతురిని నటింపజేయాలనే ఉత్సాహం ఉండేది. ఈ కారణంగానే ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా నాట్యం .. సంగీతం నేర్పించడం మొదలుపెట్టారు. తండ్రి ప్రోత్సాహంతో అంజనీకుమారి కాకినాడ కేంద్రంగా నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. అలా ఆమె నాటక ప్రదర్శనలు ఇస్తున్న సమయంలోనే ఆదినారాయణరావుగారితో పరిచయం కావడం .. అది ప్రేమగా మారడం .. పెళ్లికి దారితీయడం జరిగిపోయాయి.
అంజనీకుమారి ఒక నాటక ప్రదర్శనలో ఉండగా ఆమెని దర్శకులు సి.పుల్లయ్య చూశారు. ఆ సమయంలో ఆయన ‘గొల్లభామ’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఆ సినిమాలో ఆమెకి ఆయన అవకాశం ఇచ్చారు. ఈలపాటి రఘురామయ్య – కృష్ణవేణి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో అంజనీ కుమారి ‘మోహిని’ పాత్రను ధరించడం జరిగింది. సి.పుల్లయ్య ఆమె పేరును అంజలీదేవిగా మార్చడం జరిగింది. 1947లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అప్పటి నుంచి అంజలీదేవి కెరియర్ పరంగా వెనుదిరిగి చూసుకోలేదు.
అప్పట్లో సినిమాల్లో నటించడానికి స్త్రీలు ఎక్కువగా ఆసక్తిని కనబరిచేవారు కాదు. అందువలన అంజలీదేవిని వెతుక్కుంటూ చాలా అవకాశాలు వచ్చాయి. ఈ కారణంగా ఆమె వరుస సినిమాలతో దూసుకుపోయారు. ఎన్టీఆర్ – ఏఎన్నార్ ల సరసన ఆమె చేసిన సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. ఏఎన్నార్ సరసన ఆమె చేసిన ‘కీలుగుర్రం’ .. ఎన్టీఆర్ – ఏఎన్నార్ తొలిసారిగా కలిసి నటించిన ‘పల్లెటూరి పిల్ల’ సినిమా ఆమె కెరియర్ కి బాగా హెల్ప్ అయ్యాయి. ఇక ఏఎన్నార్ సరసన చేసిన ‘సువర్ణ సుందరి’ .. ఎన్టీఆర్ సరసన కథానాయికగా నటించిన ‘లవ కుశ’ ఆమె కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలుగా నిలిచాయి.
‘లవకుశ’లో అంజలీదేవి పోషించిన సీత పాత్ర ఆమెకి ఎంతో కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. ఆ పాత్రలోని పవిత్రతను .. ప్రశాంతతను ఆమె అద్భుతంగా ఆవిష్కరించారు. అప్పట్లో ఆమె ఎక్కడికి వెళ్లినా సీతమ్మవారిగానే భావించి, అంతా కూడా ఆమె పాదాలకు నమస్కరించేవారట. ఆ తరువాత కాలంలో సీతమ్మవారి పాత్రను చాలామంది కథానాయికలు పోషించారు. కానీ తెలుగు తెర సీతమ్మ అంటే అంజలీదేవినే అని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇక ‘భక్త ప్రహ్లాద’ సినిమాలో, ఇటు ప్రహ్లాదుడికి .. అటు హిరణ్యకశిపుడికి నచ్చజెప్పలేక సతమతమయ్యే లీలావతి పాత్రకు ఆమె ప్రాణం పోశారు.
‘భక్త జయదేవ’ .. ‘భక్త ప్రహ్లాద’ .. ‘చెంచులక్ష్మి’ .. ‘అనార్కలి’ .. ‘శ్రీలక్ష్మమ్మ కథ’ సినిమాలు కూడా ఆమె కెరియర్లో మైలురాళ్లుగా కనిస్తాయి .. ఆణిముత్యాలుగా అనిపిస్తాయి. ఇక అప్పట్లో ఎంతమంది కథానాయికలు ఉన్నప్పటికీ, పతివ్రతలకి సంబంధించిన కథలలో ఆమెనే నాయిక. ‘సతీ సావిత్రి’ .. ‘సతీ సక్కుబాయి’ .. ‘సతీ సుమతి’ .. ‘సతీ అరుంధతి’ .. ‘ సతీ సులోచన’ ఇలా ఆమె వరుస సినిమాలు చేశారు. నాయిక ప్రధానమైన ఆ పాత్రలను జనంలోకి తీసుకునిపోయారు. ఈ సినిమాలన్నీ కూడా మహిళా లోకంలో అంజలీదేవికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి.
ఆ తరువాత కాలంలో సావిత్రి .. జమున .. బి. సరోజాదేవి .. కృష్ణకుమారి వంటి కథానాయికలు ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్ల ద్వారా అంజలీదేవికి గట్టిపోటీనే ఎదురైంది. అయినా తనదైన స్థానాన్ని కాపాడుకుంటూ ఆమె ముందుకువెళ్లారు. వాళ్లంతా కూడా ఎవరి ప్రత్యేకతను వారు చాటుకున్నారు తప్ప, అంజలీదేవికి ప్రత్యామ్నాయం కాలేకపోయారు. కాలక్రమంలో తన వయసుకి తగిన తల్లి పాత్రల ద్వారా కూడా ఆమె మెప్పించారు. ఆదినారాయణరావు కూడా సంగీత దర్శకుడిగా గొప్ప పేరును సంపాదించుకున్నారు. ఇద్దరూ కలిసి సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసి చాలా సినిమాలను నిర్మించారు. తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో 500 సినిమాలకి పైగా చేసిన అంజలీదేవిని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఈ రోజున ఆమె వర్ధంతి .. ఈ సందర్భంగా మనసారా ఒకసారి ఆమెను స్మరించుకుందాం.
(అంజలీదేవి వర్ధంతి ప్రత్యేకం)
— పెద్దింటి గోపీకృష్ణ
Also Read : గంగా ప్రవాహం ఆయన గానం….