Friday, March 29, 2024
HomeTrending Newsఏసంగి పంట కోసం కేంద్రంతో యుద్ధమే

ఏసంగి పంట కోసం కేంద్రంతో యుద్ధమే

Rabi Crop :

ఆహారధాన్య సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ అస్పష్ట విధానం ఇటు తెలంగాణ రైతాంగానికి అటు దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయరంగం, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి వున్నామని, అందుకు పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీస్తామని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని తీసుకునే విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్దమైన, ద్వంద్వ వైఖరిని విడనాడాలని ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షత జరిగిన టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం డిమాండ్ చేసింది. తెలంగాణ వరిధాన్య సేకరణలో స్పష్టతకోసం పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేలా గళమెత్తాలని రాజ్యసభ, లోక్ సభ సభ్యులకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శాసనసభా వ్యవహారాలు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ లో టిఆర్ఎస్ పక్ష నేత కె. కేశవరావు, కెప్టెన్ లక్ష్మీకాంత రావు, కె.ఆర్. సురేష్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, లోక్ సభ ఎంపిలు బి.బి పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, బొర్లకుంట వెంకటేష్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఈ వానాకాలంలో వరిధాన్యం సాగు విస్తీర్ణం విషయంలో పూటకో మాట మాట్లాడుతూ కిరికిరి పెడుతూ, 90 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించవలిసి వుండగా, కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని( 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని) మాత్రమే సేకరిస్తామని కేంద్రం మల్లీ పాతపాటే పడుతున్నదని,. ఈ విషయంలో కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని సిఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు, ఇటు తెలంగాణ మంత్రులతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ని, అటు సిఎస్ తో కూడిన ఉన్నతాధికారుల బృందం కేంద్ర ప్రభుత్వ అధికారులను పలుమార్లు కలిసి విజ్జప్తి చేసినా, ఎటూ తేల్చక పోవడం పై టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష సమావేశం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రానున్న యాసంగి పంటకాలం ప్రారంభమైన నేపథ్యంలో, తెలంగాణ రైతులు వరినాట్లకు సిద్ధమౌతున్న పరిస్థితుల్లో వచ్చే యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడం పై., అట్లాగే యాసంగి వరిధాన్యాన్ని ఎంత కొంటరో తేల్చి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా, ఇంకా నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానం పై సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉభయ సభల్లో తెలంగాణ రైతులు, ప్రజల తరపున గళాన్ని వినిపించాలని పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది.

వార్షిక ధాన్యసేకరణ కేలండర్ ను విడుదల చేయాలని సిఎం కెసిఆర్ చేసిన డిమాండ్ ను అభినందిస్తూనే, ఎటూ తేల్చని కేంద్రం వైఖరిపై సిఎం కెసిఆర్ అధ్యక్షతన సమావేశం విస్మయం వ్యక్తం చేసింది. పార్లమెంటులో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ విధానం పై పోరాడాలని నిర్ణయించింది. ధాన్యం దిగుబడిలో అనతి కాలంలో తెలంగాణ రైతు దేశ రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో, కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తెలంగాణ వ్యవసాయ రంగానికి ఆశనిపాతంగా మారిందని సమావేశం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆహార ధాన్యాల సేకరణ విషయంలో కేంద్రానికి వొక జాతీయ విధానం ఉండాలని., దేశంలోని అన్ని రాష్ట్రాలకు ధాన్యం సేకరణ విషయంలో ఏకరీతి విధానాన్ని అనుసరించాలని, ‘‘ సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం’’ ( Uniform National FoodGrain Procurement Policy ) కోసం పార్లమెంటులో డిమాండ్ చేయాలని సిఎం కెసిఆర్ ఎంపీలను ఆదేశించారు.

Also Read : రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

RELATED ARTICLES

Most Popular

న్యూస్