Sunday, September 8, 2024
HomeTrending NewsTDP: వారి విమర్శలకు స్పందించరేం?: అచ్చెన్న ప్రశ్న

TDP: వారి విమర్శలకు స్పందించరేం?: అచ్చెన్న ప్రశ్న

దళితులకు టిడిపి హయంలో అమలు చేసిన కార్యక్రమాలపై, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై బహిరంగచర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీకి సవాల్ విసిరారు. నాలుగేళ్ళుగా రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులు  స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదని అన్నారు.  మాదిగలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఈ మేరకు భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. సామాజిక న్యాయానికి టిడిపి కట్టుబడి ఉందని,  తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాతే మాదిగలకు రాజకీయ, సామాజిక అవకాశాలు లభించాయని చెప్పారు.  బిసిలతో పాటు మాదిగలు కూడా మొదటినుంచీ పార్టీకి అండగా నిలుస్తున్నారని కితాబిచ్చారు.  మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘మాదిగల ఆత్మీయ కృతజ్ఞతా సభ’ జరిగింది. దీనికి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

జగన్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, మరో 300 రోజులు మాత్రమే ఆయన పదవిలో ఉంటారని, ఆయన ఎప్పుడు దిగిపోతారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ అబద్ధాలు తప్ప ఒక్క నిజం కూడా జగన్ చెప్పరని మండిపడ్డారు. ఊరికో బంగాళా కట్టుకున్న జగన్ పేదవాడు ఎలా అవుతాడని ప్రశ్నించారు.  ఒక లీటర్ వాటర్ 2,500 రూపాయలు పెట్టి తాగుతున్నాడని ఆరోపించారు. పంచ భూతాలనూ దోచుకుంటున్నారని, ఈ విషయం తాము చెప్పడం కాదని, ఈ దేశాన్ని పాలిస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా చెప్పారని, అమిత్  షా కూడా జగన్ అవినీతి గురించి విమర్శలు చేశారని, వారు ఆరోపణలు చేసి మూడు రోజులైనా వాటిపై కనీసం సమాధానం కూడా చెప్పలేకపోయారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

తమ హయంలో దళితుల స్వయం ఉపాధికి వాహనాలు, ప్రోక్లెయినర్లు ఇచ్చామని… కానీ ఈ ఐదేళ్ళలో ఈ వర్గాలకు కనీసం ఒక్క పథకమైనా ఇచ్చారా అంటూ నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో దళితులంతా టిడిపికి అండగా ఉండాలని, జగన్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకలించి వేయాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్