Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణలో పోటీకి సిద్ధం - పవన్ కళ్యాణ్

తెలంగాణలో పోటీకి సిద్ధం – పవన్ కళ్యాణ్

తెలంగాణ అసెంబ్లీలో జనసేన పార్టీ సభ్యులు ఉండాలి.. అందుకోసం పోరాటం చేద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అవకాశాన్ని బట్టి ఏడు నుంచి 14 అసెంబ్లీ స్థానాలు, పరిమిత సంఖ్యలో లోక్ సభ స్థానాల్లో బరిలోకి దిగనున్నట్టు ప్రకటించారు. ఈ రోజు ఎన్నికల ప్రకటన వచ్చినా పోటీకి సిద్ధంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రజలు మీరు ఎందుకు వచ్చారు అని అడిగితే భుజం కాయడానికి వచ్చామని చెప్పాలని తెలిపారు. ఆ క్రమంలో ఎవరైనా పొత్తుకి వస్తే సంతోషమని.. అయితే అది జనసేన భావజాలనికి, తెలంగాణ రాష్ట్ర క్షేమానికి సరైంది అనుకుంటేనే ఆలోచిద్దామన్నారు. ఎవరితో పొత్తు పెట్టుకున్నా జీహెచ్ఎంసీ ఎన్నికల్లా వదిలేయం అని చెప్పారు. మంగళవారం సాయంత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన ప్రచార రధం వారాహికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓ రిసార్ట్ లో పార్టీ తెలంగాణ ప్రాంత కార్యనిర్వాహకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “కొండగట్టు ప్రాంతం నాకు పునర్జన్మనిచ్చిన నేల. గతంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పుడు ఒకాయన వచ్చి మీకు ప్రాణ గండం ఉందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని బయటకు వచ్చి అభివాదం చేయడానికి వ్యాన్ ఎక్కితే అక్కడ హైటెన్షన్ వైర్లు తగిలి జుట్టు కాలిపోయింది. నాకింద ఉన్న వారికి బలంగా షాక్ తగిలింది. నాకేమీ కాలేదు కానీ అరగంట వరకు ఏమీ తెలియలేదు. ఆ రోజు నుంచి తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిన నేల అని నమ్ముతాను.

తెలంగాణలోనే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టా
నా రాజకీయ ప్రస్థానం తెలంగాణ నేలలోనే మొదలు పెట్టాను. భీంరావ్ బాడలో దశాబ్దాలుగా ఉంటున్న పేదల ఇళ్లు కూల్చేసినప్పుడు అప్పుడున్న వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వాన్ని కాస్త గట్టిగానే నిలదీశాను. అప్పుడు పరిస్థితిని బట్టి ఒక మాట ఎక్కువ అని ఉండొచ్చు. కూల్చేసిన ఆ బస్తీని చూస్తే సగటు రాజకీయ నాయకత్వం మీద విసుగు కలిగింది. తర్వాత అప్పుడున్న నాయకులు కొంత మంది నాతోపాటు నాంపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తర్వాత ఏంటి అని అడిగితే వారంతా అయిపోయింది ఇంటికి వెళ్లిపోదామన్నారు. యువజన విభాగం బాధ్యతలు తీసుకున్న మేము వారికి కేటాయించిన ఇళ్లకు వెళ్తే అప్పటికే అక్కడ ఉన్న వారితో గొడవలు. తలుపులు లేని మురుగుదొడ్లలో కుమార్తెను ఎలా కాపాడుకోవాలో తెలియని ఓ తల్లి వేదన కళ్లారా చూశాను. అధికారంలో ఉన్న పార్టీ వారికి భూమి కావాలంటే ఎక్కడైనా తీసు కోవచ్చు. బడుగు బలహీన వర్గాల భూములు ఎందుకు లాక్కోవాలి అని ఆవేదన కలిగింది. అందుకే కొంచం గట్టిగా గళం విప్పి  నా  వేదన తెలియచేశాను.

తెలంగాణ పోరాటపటిమే నాకు స్ఫూర్తి
తెలంగాణకు రెండేళ్లు ఆలస్యంగా స్వతంత్రం వచ్చింది. దేశమంతా కేరింతలు కొడుతుంటే అప్పట్లో తెలంగాణ చీకట్లలో ఉంది. నాటి నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు ప్రతి అడుగులో తెలంగాణ ప్రజలదే ముఖ్య భూమిక. పోరాట పటిమ ఉన్నవారు తెలంగాణ ప్రజలు. అలాంటి పోరుగడ్డ మీద కొత్త కొత్త పార్టీలు, ప్రభుత్వాలు వచ్చాయి. నేను ఎవర్నీ ఊరికే తిట్టను. అప్పటి యువజన విభాగం అధ్యక్షుడిగా తెలంగాణ ప్రాంతంలో మెరికల్లాంటి యువతను, రత్నాల్లాంటి ఆడపడుచుల్ని చూశాను. వారంతా పోరాట పటిమ ఉన్న వారు. ఇది నా నేల అన్న భావన కలిగిన వారు. వందేమాతర శబ్దం ప్రతిధ్వనించే నేల ఇది. ఈ నేలలో ఉన్న పోరాటపటిమే నాకు స్ఫూర్తి.

ఆడవుల్ని నరికేస్తే ఎక్కడికెళ్లి పోరాడాలి?
జనసేన తెలంగాణ నేలలో పుట్టిన పార్టీ. ఇక్కడ మూడు దశాబ్దాలుగా రాజకీయాలు చేసిన వ్యక్తులు ఉన్నారు. పార్టీలు ఉన్నాయి. వారికి ఏ పార్టీకి వెళ్లినా చోటు దొరికేస్తుంది. నేను మాత్రం అట్టడుగు పొరల్లో ఉన్న కోహినూర్ల కోసం వెతుకుతున్నా. అంతా పేరు ప్రఖ్యాతులున్న నాయకుల్ని తీసుకుంటారు. నేను కొత్తతరం కోసం వెతుకుతా. పేరున్న నాయకుల జోలికి వెళ్లడం లేదు. కొత్త నాయకత్వం రావాలన్న మాటకు బద్దుడినై ఉన్నాను. మనకున్నది పరిమితమైన వనరులు. మొన్ననే తెలంగాణ వచ్చింది. కొత్త ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పార్టీలన్నింటిలో ఉన్న నాయకులంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. జనసేనలో ఉన్న ఎవరికి అనుభవం లేదు. అయితే దేశం పట్ల ప్రేమ. సమాజం పట్ల బాధ్యత ఉన్నాయి. నడవాలి నడిపించాలన్న ఆశయం ఉంది. ఇక్కడున్న ఏ పార్టీకి బలమైన భావజాలం లేదు. ప్రతి ఐదేళ్లకు మారిపోయే భావజాలమే ఉంది. నేను ముందుగానే బలమైన భావజాలం రాసుకున్నా. మనమంతా అడవుల్లోకి పారిపోయి పోరాటం చేస్తే న్యాయం జరుగుతుందన్న ఆలోచన కలిగిన వాళ్లం. ఉన్న అడవుల్ని నరికేసి అక్రమ మైనింగ్ చేస్తుంటే, అడవులు అంతరించిపోతుంటే ఏ అడవికి వెళ్లి పోరాటం చేయాలి. మనమంతా ప్రజాక్షేత్రంలో ఉండే పోరాడాలి. అది చాలా కష్టం అయినా నేను బలమైన సంకల్ప సిద్ధితో ఉన్నాను. ఒడిదుడుకులున్నా ఎక్కడికీ పారిపోను.

నాయకత్వం వహించేందుకు ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాలి
కానిస్టేబుల్ ఫిట్ నెస్ టెస్ట్ లో ఒక్కసారిగా రూల్స్ మార్చేశారు.. అప్పటికప్పుడు మార్చేయడం వల్ల సంసిద్ధత లేక లక్ష మంది యువత ఉద్యోగాలకు దూరమయ్యారు. దీని గురించి మాట్లాడమని మార్గ మధ్యలో ఓ యువతి అడిగింది. చిన్నపాటి పోలీసు ఉద్యోగానికే ఇన్ని పరీక్షలుపెడితే నాయకత్వం వహించేందుకు ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలి. నేను కాలం పెట్టే పరీక్షలకు తట్టుకుని నిలబడాలన్న ఉద్దేశంతోనే పార్టీ స్థాపించిన నాడే 25 సంవత్సరాల ప్రస్థానం అని చెప్పాను. ఇన్ని కోట్ల మంది జీవితాలకి సంబంధించి బాధ్యతగా నిర్వర్తించాలంటే అనుభవం కావాలి. నా వెనుక ఉన్నవారంతా ఆశయానికి నిలబడే వ్యక్తులు. తెలంగాణలో పరిమితమైన స్థానాల్లో పోటీ చేసి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని అడుగుతున్నారు. మనమంతా పరిమితమైన ఆటే ఆడుదాం. పెద్ద స్థాయి ఆట ఆడాలంటే అంతకంటే ముందు చిన్న స్థాయిలో బలమైన పాత్ర పోషించాలి. రాత్రికి రాత్రే ఎదగలేము. మిగిలిన పార్టీల్లో అనుభవం ఉన్న నాయకులంతా ఒక వేదిక ఏర్పాటు చేసుకుని పోరాడుతున్నారు. మనం అలా కాదు. సమాజానికి వేరే ఏదో కావాలని కోరుకునే వాళ్లం. మనమే వచ్చే తరాలకు దిక్సూచి అవుతాం. నన్ను నమ్మి ఇన్నాళ్లు నాతో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

తెలంగాణలో ఏడు నుంచి 14 శాసనసభ స్థానాలు, పరిమిత సంఖ్యలో లోక్ సభకు పోటీ చేద్దాం. పొత్తుకు ఎవరైనా వస్తే సంతోషం. అది బీజేపీ అయినా సరే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్లు ఉపసంహరించుకోమనడానికి కారణం ఉంది. ఉన్న ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారన్న అపప్రద సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మనకి మంచిది కాదు. ఆ అపప్రద రాకూడదనే వద్దన్నాను. మనవాళ్లు బలంగా గెలుస్తారన్న నమ్మకం ఉంటే పోటీ చేసే వాళ్లం. నా మాట మీద గౌరవంతో ఉపసంహరించుకున్నందుకు ధన్యవాదాలు. ఓటు చీలనివ్వకపోవడం ముఖ్యం. అలా కాకుండా మన ఇగో కోసం ఆట ఆడడం తేలికే. అయితే అలా రెండుసార్లు మాత్రమే ఆడగలం. ప్రజలకు మేలు జరగాలి అంటే ముందుగా సమస్యలపై అవగాహన అవసరం. అవసరం అయితే వీధి పోరాటాలు చేయాలి. భవిష్యత్తులో మన కార్యక్రమాలు మొదలు పెట్టే ముందు రాష్ట్రం కోసం బలిదానాలు ఇచ్చిన అమరవీరులకు జోహార్లు చెప్పి పోరాటాలు చేయండి.
ప్రజా క్షేత్రంలో ఓటుకు భయపడతారు. మనం పోటీ చేయని స్థానాల్లో కూడా జనసేన ప్రభావం చూపాలి. భవిష్యత్తులో ఎవరితో పొత్తు పెట్టుకున్నా జీహెచ్ఎంసీ ఎన్నికల్లా వదిలేయం. మనం పొలిటికల్ పవర్ తీసుకుందాం. మనం స్థానాలు వదిలేస్తే మీరు మా నాయకులకు ఏం చేయగలరో చెప్పమని అడుగుదాం. ఎంత మందికి కార్పోరేషన్లు ఇస్తారు. ఎంత మందికి అవకాశాలు ఇస్తారని అడుగుదాం. మీ బలాన్ని వృధా చేయకూడదని భావిస్తున్నా. ఈ సారి పకడ్బందీగా వెళ్దాం.

ఆంధ్రాలో ఉన్నది మామూలోళ్లు కాదు
ఆంధ్రాలో నేను ఎదుర్కొంటున్న వారు మామూలు మనుషులు కాదు. సొంత బాబాయిని చంపేసుకునే వాళ్లు. న్యాయ వ్యవస్థని అడ్డదిడ్డంగా తిట్టేవారు. పోలీసు వ్యవస్థని ఇష్టం వచ్చినట్టు వాడే వారు. ప్రజాస్వామ్యం అన్న పదానికి అక్కడ విలువ లేదు.
ఎవరి మీద గళం విప్పడానికైనా సిద్ధం
నేను పైకి సున్నితంగా కనబడినా లోపల చాలా కరుకైన వ్యక్తిని. పార్టీ శ్రేణులకు సరైన దారి ఏర్పరచకుండా మాట్లాడితే అన్ని పార్టీలు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటారు. అందుకే నేను తగ్గి మాట్లాడుతా. నాకు మాట అనడం తేలికే. తర్వాత క్షేత్ర స్థాయిలో మీరు ఇబ్బందిపడతారు. సమస్య తీవ్రత ఉందంటే మాత్రం ఏ స్థాయిలో కావాలన్నా గళం విప్పుతా. భయపడకుండా మాట్లాడుతా. తెలంగాణలో భాగోద్వేగంతో కూడిన రాజకీయాలు ఉంటాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కులాల గీతల మధ్య రాజకీయం చేయాలి. అందుకే ఆంధ్రలో మాట్లాడేప్పుడు కులాల గీతల మధ్యే మాట్లాడాలి. తెలంగాణ యువత బలిదానాల మీద వచ్చింది. అక్కడ అభివృద్ధి కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు రావాలి. అక్కడ పరిశ్రమలు రాకుంటే మళ్లీ తెలంగాణకు వలసలు పోవాలని ఓ ఉత్తరాంధ్ర యువకుడు చెప్పిన మాటలు ఆలోచింపచేశాయి. ఆంధ్రలో అభివృద్ధి లేకపోతే తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతుంది. అక్కడ పరిశ్రమలు వచ్చేలా పోరాటం చేయమని ఆ యువకుడు సూచించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరైన దిశానిర్ధేశం చేయకపోతే తెలంగాణ సాధన ఫలితాలు యువతకు అందవు. అది ఆంధ్ర పాలకుల దాష్టికంగానే భావించాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణను ముందుకు తీసుకువెళ్లడానికి అవసరం.

అప్పుడే వీధి పోరాటాలకు దిగుదాం
తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో చేసినట్టు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని ఉంది. తెలంగాణలో 20 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. వారికి ఏ పార్టీ అయినా ఫించన్ ఇచ్చి వదిలేస్తోంది. వారిలో ఉన్న ప్రతిభ గుర్తించడం లేదు. వారిని ఎలా బయటకు తీసుకు రావాలో ఆలోచించండి. యువత ఎదుర్కొంటున్న సమస్యల మీద పార్టీ నాయకత్వం పోరాటం చేయండి. నియోజకవర్గాల సమస్యల మీద మీకు అవగాహన అవసరం. ఇక్కడ ప్రతి అంశం మీద మీకు అవగాహన అవసరం. నేల, నీరు, ఉపాధి అవకాశాలు, కాలుష్యం, కుల వృత్తులకు ఉపాధి దొరుకుతుందా? లేదా? ప్రతి అంశం మీద అవగాహన తెచ్చుకుని నిర్ధిష్టమైన ప్రణాళిక రూపొందిస్తే నేను క్షేత్ర స్థాయిలో పర్యటించి వారి కోసం గొంతెత్తుతా.. సమస్యలు పరిష్కారం కానప్పుడు వీధి పోరాటాలకు దిగుదాం.

అమర వీరుల సాక్షిగా తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటాం
భవిష్యత్తులో ఎన్నికలు ఏ రోజు ప్రకటించినా ముందుకు వెళ్దాం. కావాలంటే ఒకటికి రెండు సార్లు మీ నియోజకవర్గాల్లో తిరుగుతా. కొద్ది మందైనా తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నదే నా ఆకాంక్ష. నేను కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలనుకుంటున్నా. ఆ దిశగా నావంతు కృషి చేస్తా. తెలంగాణ అభివృద్ధికి జనసేన పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని అమరవీరుల సాక్షిగా చెబుతున్నాను” అన్నారు.

Also Read : కొండగట్టులో వారాహికి జనసేనాని ప్రత్యేక పూజలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్