పదే పదే అటవీ ఆక్రమణ ప్రయత్నాలు జరుగుతున్న మంచిర్యాల జిల్లా కోయపోచగూడ ప్రాంతంలో జాయింట్ చెక్ పోస్టును అధికారులు ఏర్పాటుచేశారు. పోలీసు, అటవీ, రెవెన్యూ యంత్రాంగం పర్యవేక్షణలో ఈ చెక్ పోస్టు ఉంటుంది. కొత్తగా అటవీ ఆక్రమణల ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించమని అధికారులు స్పష్టం చేశారు. కవ్వాల్ పులుల సంరక్షణ ప్రాంతానికి ఆనుకుని ఉన్న కోయపోచగూడ పరిధిలో ఇప్పటిదాకా అసలు పోడు వ్యవసాయమే లేదని, కొత్తగా అడవిని నరికి, ఆక్రమించేందుకు గత ఆరునెలలుగా ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని అటవీ శాఖ గుర్తు చేసింది.
స్థానికులు ఎట్టిపరిస్థితుల్లో నిబంధనలను అతిక్రమించవద్దని తెలంగాణ అటవీ శాఖ మరోసారి విజ్ఞప్తి చేసింది. అటవీ ప్రాంతాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తామని, ఆక్రమణలను అడ్డుకుంటామని, గ్రామస్థులు కూడా సంయమనం పాటించాలని జన్నారం ఫారెస్ట్ డివిజనల్ అధికారి ఎస్. మాధవరావు కోరారు. కోయపోచగూడ సమీపంలో ఉన్న అటవీ బేస్ క్యాంపును కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని ఆయన తెలిపారు.