ఆయన ఎప్పుడూ పసుపు రంగు దుస్తులలోనే కనిపిస్తుంటారు. అందుకు కారణం, ఆయన అరటిపండు ప్రేమికుడు. ఆయన పేరు కెన్ బానిస్టర్.అంతేకాదు, లాస్ ఏంజిల్స్ లో నివసించే ఈయన ఓ అంతర్జాతీయ అరటిపండ్ల క్లబ్బుని ఏర్పాటు చేసారు. అరటిపండ్లంటే ఇష్టమున్న వాళ్ళందరూ తన సంఘంలో చేరాలని ఆయన ఆహ్వానిస్తుంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ తదితర అరటిపండ్ల ప్రేమికులందరూ తన సంఘ సభ్యులుగా ఉండేవారట. అరటి పండ్లకు సంబంధించి పదిహేడు వేల రకాల వస్తువులను ఆయన ఏర్పాటు చేసిన అరటి పండ్ల మ్యూజియంలో ప్రదర్శనకుంచారు. ఆయన తన ఆరోగ్యానికి ఆనందానికి జీవితంమీద ఆసక్తికి కారణం అరటిపండేనన్నారు.
అరటిపండు తిని తొక్కను ఎక్కడంటే అక్కడే విసిరేసేవారంటే ఆయనకు గిట్టనే గిట్టదు. తన అరటి పండ్ల క్లబ్ ప్రధాన ఉద్దేశం, అందరినీ చిరునవ్వుతో ఉంచడమే. ఈ క్లబ్బు ఈ ఏడాదితో యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంటే 1972లో ప్రారంభ మైందిది. ఈ సందర్భంగా ఆయన అరటిపండు ముద్రించిన స్టిక్కర్లను పంపిణీ చేశారు. ఇందులో చేరేందుకు సభ్యత్వ రుసుము పది డాలర్లు. ఇక అరటిపండ్ల మ్యూజియంని మరో నాలుగేళ్ళకు అనగా 1976లో నెలకొల్పారు. ఈ క్లబ్బులో దాదాపు ముప్పైకిపైగా దేశాల నుంచి ముప్పై అయిదు వేల మందికి పైగా సభ్యులున్నారు.
తన అరటిపండ్ల క్లబ్ , మ్యూజియం గురించి పది మందికి తెలియడం కోసం బానిస్టర్ ఇప్పటికి వందకుపైగా “టు నైట్ షో” అనే పేరిట టీవీషోలు కూడా నిర్వహించారు. అలాగే వివిధ పత్రికలలో వీటికి సంబంధించి వ్యాసాలు, ఫోటోలు వచ్చాయి. 2005లో అయితే ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కింది. ఈ క్లబ్బు అరటిపండు ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఇప్పటివరకు డజన్ పుస్తకాలను ప్రచురించింది.
ప్రతి ఒక్కరూ ఉదయం పూట ఒక అరటిపండును ముందుగా తినాలని ఆయన మాట. అరటిపండుని తినడంద్వారా మన ఒంట్లో శక్తి రీఛార్జ్ అవుతుందంటారు బానిస్టర్. అదలా ఉండనిచ్చి ఓ చిన్న విషయంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను. మన దేశంలో తమిళనాడులో ఏటా 5136 మెట్రిక్ టన్నుల అరటిపండ్లు ఉత్పత్తవటం గమనార్హం. అలాగే ప్రపంచంలో అధికంగా ఉత్పత్తయ్యే అరటిపండ్ల పట్టికలో మన భారతదేశమూ ముందుండటం విశేషం. 2014లో అయితే మన దేశమే అరటిపండ్ల సాగులో ప్రథమస్థానాన్ని ఆక్రమించింది.
– యామిజాల జగదీశ్