ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా అవకాశాలు సంపాదించుకోవడం అంత తేలికైన పనేం కాదు. ఒకటి రెండు ఫ్లాపులు ఎదురైనా తట్టుకుని నిలబడటం కూడా అంత ఆషామాషీ విషయమేం కాదు. అంతటి కష్టతరమైన ప్రయాణంలో కిరణ్ అబ్బవరం ఇంకా తొలి అడుగులే వేస్తున్నాడు. ఎస్. ఆర్. కల్యాణ మంటపం’ సక్సెస్ తరువాత ఆయన నుంచి ఇంతవరకూ హిట్ లేదు. ఆ తరువాత చేసిన రెండు సినిమాలు కూడా సరిగ్గా ఆడలేదు. ఆ తరువాత సినిమాగా ఆయన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని‘ సినిమా చేశాడు.
కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య కొత్త బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, నిర్మాతగా ఆమె చేసిన ఫస్టు సినిమా ఇది. ఈ సినిమాతో కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాతో కథానాయికగా సంజన ఆనంద్ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ కి మరింత కనెక్ట్ కావడానికి కిరణ్ అబ్బవరం ప్రయత్నం చేసినట్టుగా సాంగ్స్ ను బట్టి తెలుస్తోంది. ఈ నెల 8 వ తేదీన మరో ట్రైలర్ ను వదలడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతోంది.
ముందుగా ఈ సినిమాను ఈ నెల 9వ తేదీనే విడుదల చేయలనుకున్నారు. ఆ దిశగానే ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. అయితే ఆ రోజునే శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ సినిమా విడుదలకి ఉంది. మదర్ సెంటిమెంట్ తో కూడిన టైమ్ ట్రావెల్ కథ ఇది. అందువలన అందరిలో ఆసక్తి ఉంది. ఇక భారీ స్థాయిలో ‘బ్రహ్మాస్త్రం’ విడుదలవుతోంది. తెలుగులో రాజమౌళి సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇంత పోటీలో రావడం కరెక్ట్ కాదని భావించిన ఈ సినిమా వెనక్కి వెళ్లింది. ఈ నెల 16వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా హిట్ ఇప్పుడు కిరణ్ కి చాలా అవసరమేనని చెప్పాలి.
Also Read : సెప్టెంబర్ 9న ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ విడుదల