Kishan Reddy Slams :
ధాన్యం కొనుగోలుపై లేని సమస్యను సిఎం కేసియార్ సృష్టిస్తున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఏడేళ్ళపాటు రైతులనుంచి ధాన్యం తామే కొంటున్నామని గొప్పలు చెప్పిన సిఎం…హుజూరాబాద్ లో ఓటమి తర్వాత కేంద్రం కొనడం లేదని నెపం తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ లో జబ్బలు చరిచి, విర్రవీగి చతికిలపడ్డారని, అందుకే కొత్త నాటకం మొదలు పెట్టారని కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు.
బియ్యం ఇవ్వాళ కేంద్రం కొత్తగా కొంటుందా అని ప్రశ్నించారు. ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ నుండి ఇందిరా పార్కు వరకూ వచ్చారని ఇది కచ్చితంగా బిజెపి ఘనతేనని వ్యాఖ్యానించారు. కేసీయార్ కు రైతుల ప్రేమ లేదన్నారు. ముడి బియ్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులు లేఖల ద్వారా స్పష్టంగా చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం మీద అబద్దాలతో, విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ కుటుంబం దిట్ట అని, కేసీఆర్ ఒక్కరివల్లే తెలంగాణ రాలేదని, సకల జనుల త్యాగం వల్ల తెలంగాణ వచ్చిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కేసీయార్ మిలియన్ మార్చ్, సాగరహారం, రైల్ రోకో ఇలా ఏ కార్యక్రమంలో పాల్గొనలేదని, గతంలో ఉద్యమ సమయంలో ఏనాడూ ధర్నాకోసం బైటికి రాలేదని, ఈరోజు లేని సమస్య కోసం ధర్నా కోసం వచ్చారని దుయ్యబట్టారు. తన పార్టీని రక్షించేందుకు.. హుజూరాబాద్ ప్రజలను అవమానించడం కోసం ధర్నా కు వచ్చారని కిషన్ రెడ్డి అన్నారు.
చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్న కేసియార్ ముందు ఓయూలో జామ్ అయిపోయిన టాయిలెట్ల సంగతి చెప్పాలని, ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్ట్ ల గురించి కూడా మాట్లాడాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గత ఏడున్నరేళ్లలో ఎంత మంది రైతులు చనిపోయారో, వారి కుటుంబాలకు సాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయ జూదంలో భాగంగా అనేక కార్యక్రమాలు కెసియార్ చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Also Read : వివాహ వేడుకలో కేసియార్, జగన్