ఆగస్ట్ 13 నుంచి 15 వరకూ మూడు రోజులపాటు దేశంలోని ప్రతి ఇంటిపై తిరంగా జెండా ఎగురవేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. భారత దేశానికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా పింగళి వెంకయ్య స్వగ్రామం భట్ల పెనుమర్రును కిషన్ రెడ్డిని సందర్శించారు. గ్రామంలోని అయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడున్న వారిలో ఎవరూ పింగళి వెంకయ్యను చూసి ఉండమని, కానీ అయన దేశానికి రూపకల్పన చేసి ఇచ్చిన జాతీయ జెండా మాత్రం శాశ్వతంగా ఉంటుందన్నారు. సూర్య చంద్రులు ఉన్నంతవరకూ, భారతదేశం ఉన్నంతవరకూ అయన తయారు చేసిన భారత జాతీయ పతాకం ఉంటుందని స్పష్టం చేశారు. పింగళి జన్మించిన భట్ల పెనుమర్రు గ్రామం కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి వేడుకలను కూడా ఘనంగా నిర్వహిస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. అయన ఓ గాయకుడిగా, సంగీత విద్వాంసుడిగా మాత్రమే అందరికీ తెలుసనీ కానీ అయన స్వాతంత్ర్య సమరయోధుడు కూడా అని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.