Saturday, July 27, 2024
HomeTrending Newskukatpally: కూకట్ పల్లిలో కారుతో గ్లాస్ డీ

kukatpally: కూకట్ పల్లిలో కారుతో గ్లాస్ డీ

హైదరాబాద్ నగరంలో ఎన్నికల ప్రచారం జోరు మీద ఉంది. సీమాంధ్రుల ఓట్లు కీలకంగా ఉన్న కూకట్ పల్లి నియోజకవర్గంలో పార్టీల గెలుపు ఓటములపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇక్కడి ఫలితాలు ఏపిలో రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిపై గోదావరి జిల్లాల్లో బెట్టింగ్ లు భారీగా జరుగుతున్నాయి.

బీఆర్ఎస్ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావు, కాంగ్రెస్ నుంచి బండి రమేష్, జనసేన తరపున ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పోటీ చేస్తున్నారు. మొత్తం ఓటర్లు 4,69,325గా ఉన్నారు. ఇందులో సీమాంధ్రకు చెందిన కాపుల ఓట్లు సుమారు 40 వేలు ఉండగా శ్రీకాకుళం జిల్లా వారివి 30 వేల వరకు ఉన్నాయి. మైనారిటీల ఓట్లు 70 వేలు ఉన్నాయి.

ఖైరతాబాద్ నుంచి విడివడి 2009లో ఏర్పడగా మొదటి ఎమ్మెల్యేగా లోక్ సత్తా అభ్యర్థి జయప్రకాశ్ నారాయణ గెలిచారు. 2014లో టిడిపి తరపున గెలిచిన మాధవరం బీఆర్ఎస్ లో చేరారు. 2018లో కారు గుర్తుపై మాధవరం విజయం సాధించారు. మూడో దఫా హాట్రిక్ సాధించేందుకు కృషి చేస్తున్నారు.

నియోజకవర్గ పరిధిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు గట్టేక్కిస్తాయని, సిఎం కెసిఆర్ ప్రచారం, మంత్రి కేటిఆర్ రోడ్ షోలు కలిసివస్తాయని భరోసాతో ఉన్నారు. మాధవరంపై ఆరోపణలు కోకొల్లలు. ఓ బిల్డర్ కు మేలు చేసేందుకు కైత్లాపూర్ ఫ్లైఓవర్ రూపకల్పన చేశారని, మొదట రూపొందించిన నక్ష మార్చేశారని ఆరోపణలున్నాయి. బడా వ్యాపారులు, బిల్డర్లు, వైన్ షాప్ ల నుంచి మాధవరం సెస్ పేరుతో ఆయన బినామీలు వసూళ్ళు చేస్తారని విమర్శలు ఉన్నాయి.

అయితే బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు మాస్ ఫాలోయింగ్ అధికంగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉండే మాధవరంకి బస్తీలలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. మైనారిటీలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అధికంగా దక్కిన నియోజకవర్గాల్లో కూకట్ పల్లి ఒకటి. మైనారిటీలు, సీమాంధ్రులు, బస్తీల్లో గులాబీ గుబాలిస్తోందని మాధవరం గెలుపుపై ధీమాతో ఉన్నారు.

బిల్డర్ గా ఉన్న బండి రమేష్ ఒకప్పుడు గులాబీ నేతనే. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు, టిడిపి అభిమానుల ఓట్లు కలిసివస్తాయని, ప్రభుత్వ వ్యతిరేకత, ఎమ్మెల్యేపై అసంతృప్తి ఓట్ల రూపంలో హస్తంకే పడతాయని కాంగ్రెస్ నేతలు నిశ్చింతగా  ఉన్నారు. క్షేత్ర స్థాయిలో క్యాడర్ లేకపోవటం ప్రతికూలం. కలిసి వచ్చే నేతలతో పాత పరిచయాలతో బండి లాగిస్తున్నారని సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని..అదే ఉపులో హస్తం విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు భరోసాతో ఉన్నారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రచారం ప్రత్యర్థులతో పోటా పోటీగా సాగుతోంది. బూత్ స్థాయిలో ఓటరును కాంగ్రెస్ వైపు మల్లించటానికి శ్రేణుల కొరత పార్టీ గెలుపుపై ప్రభావం చూపనుంది.

బిజెపి-జనసేన పొత్తుల్లో భాగంగా ఈ స్థానం జనసేనకు దక్కింది. బిజెపి నుంచి జనసేనలో చేరి టికెట్ సాధించిన ముమ్మరెడ్డి ప్రేమకుమార్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు. మొదట్లో బిజెపికే ఇవ్వాలని మంకుపట్టు పట్టిన కమలం నేతలు ఇప్పుడు ప్రేమ కుమార్ కోసం పనిచేస్తున్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి, వడ్డేపల్లి రాజేశ్వర్ రావులు పొత్తు ధర్మాన్ని పాటించి…గిలాస గుర్తు గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

నియోజకవర్గంలో ఈ దఫా సమీకరణాలు కొత్తగా ఉన్నాయి. టిడిపి అభిమానులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో జనసేన గెలిస్తే ఏపిలో ప్రభావం చూపుతుందనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. దీంతో కమ్మ సామాజిక వర్గం జనసేనను బలపరుస్తోందని సమాచారం. తెలంగాణ, సీమాంద్ర యువత బిజెపి,జనసేన పొత్తును సమర్థిస్తున్నారు. ఉత్తరాంధ్ర, కాపు,కమ్మ సామాజిక వర్గాల ఓట్లు గంప గుత్తగా పడితే జనసేనదే విజయం అనే విశ్లేషణ ఉంది.

సీమాంధ్ర ఓటర్లు కూకట్ పల్లి, బాలానగర్, మూసాపేట ప్రాంతాల్లో అధికంగా ఉన్నారు. వీరి ఓట్లు ముగ్గురి మధ్య చీలుతాయని, అల్లాపూర్,ఫతేనగర్, బోయినపల్లి, బేగంపేట, ఫిరోజ్ గూడ ప్రాంతాల ఓటర్లు గెలుపు ఓటములను నిర్ణయించే అవకాశం ఉంది. పోలింగ్ నాటికి కారు – గ్లాసు మధ్య హోరాహోరీ జరగనుందని సమాచారం.

జనసేన, కాంగ్రెస్ ధాటికి కారు పంక్చర్ అవుతుందో…కారు స్పీడుకు గిలాస పగిలి, చేతికి గాయం అవుతుందో డిసెంబర్ 3న  తేలనుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్