ఎన్టీఆర్ తనను పెళ్లి చేసుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదని, పెళ్లి ప్రయత్నాలు ఆపాలని చివరి వరకూ కుట్రలు పన్నారని, అందుకే మీడియా ముందే ఎన్టీఆర్ తనను పెళ్లి చేసుకున్నారని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి వెల్లడించారు. చరిత్రను ఎవరూ చెరిపేయలేరని, తన పెళ్లి గురించి, వ్యక్తిగత జీవితం గురించి ఎవరైనా కామెంట్లు చేసే కేసు పెడతానని హెచ్చరించారు, ఎన్టీఆర్‌కు ద్రోహం చేసిన వారే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
చివరి ఇంటర్వ్యూలో తమ వివాహం గురించి చాలా స్పష్టంగా చెప్పారని, చంద్రబాబు అధికార వ్యామోహన్ని పక్కదారి పట్టించేందుకు, ఆయనకు మద్దతిస్తున్న మీడియా దుష్ప్రచారానికి దిగిందని చెప్పారు. పార్టీని మింగేసిన వ్యక్తికి ఎన్టీఆర్ కుమారులు మద్దతు పలికారని, వైశ్రాయ్ హోటల్ దగ్గర చెప్పులేసిన సంగతి మరిచిపోయారా అని ప్రశ్నించారు. పాముకు పాలు పోసి పెంచుతున్నానని… చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఆరోజే చెప్పారని, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినందుకు ఇప్పటికైనా పశ్చాతాపం చెందారా? అని బాబును నిలదీశారు. ఎన్టీఆర్ పేరు ఉచ్చరించే హక్కు బాబు బ్యాచ్‌కు లేదని, ఎన్టీఆర్ హంతకులు ఇప్పుడు హడావిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టాలా? యూనివర్శిటీకి పెట్టాలా అని అడిగితే జిల్లాకే ఎన్టీఆర్ పేరు ఉండాలని తాను కోరుకుంటానని వెల్లడించారు. మరో ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని సిఎం జగన్ ని కలిసి కోరతానన్నారు. ఎన్టీఆర్‌కు రావాల్సిన పదవులు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని…. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వొద్దని వాజ్‌పేయికి చంద్రబాబు స్వయంగా చెప్పారని ఆమె గుర్తు చేశారు. నాడు చంద్రబాబు జూ. ఎన్టీఆర్ ఇంటికెళ్లి బతిమిలాడి ప్రచారం చేయించుకున్నారన్నారు. వర్శిటీ పేరు మార్పుకు సంబంధించి.. జూ. ఎన్టీఆర్ ప్రకటనను అందరూ హర్షిస్తున్నారన్నారు. నాదెండ్ల భాస్కర రావు తిరుగుబాటు చేస్తే వెన్నుపోటు, చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే అధికార మార్పా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.