India Vs. SL 2nd Test: ఇండియా- శ్రీలంక మధ్య బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టులో లంక ముందు 447 పరుగుల విజయలక్ష్యాన్ని ఇండియా ఉంచింది. 6 వికెట్ల నష్టానికి 86 పరుగుల తొలి రోజు స్కోరుతో నేటి ఆట మొదలు పెట్టిన శ్రీలంక 109 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఇండియా బౌలర్లలో బుమ్రా ఐదు; షమీ, అశ్విన్ చెరో రెండు; అక్షర్ ఒక వికెట్ పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్ లో 143 పరుగుల ఆధిక్యాన్ని ఇండియా సంపాదించింది.
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇండియా 9 వికెట్లకు 303 పరుగుల వద్ద ఆటను డిక్లేర్ చేసింది. శ్రేయాస్ అయ్యర్-67; రిషభ్ పంత్-50; కెప్టెన్ రోహిత్-46; హనుమ విహారి-35 పరుగులు చేశారు. లంక బౌలర్లలో జయ విక్రమ నాలుగు; ఎంబుల్దేనియా మూడు; విశ్వ ఫెర్నాండో, ధనుంజయ డిసిల్వా చెరో వికెట్ పడగొట్టారు. శ్రీలంక ముందు 447 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
అయితే లంక రెండో ఇన్నింగ్స్ లో పరుగుల ఖాతా తెరవకముందే వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్ లో ఓపెనర్ లాహిరు తిరుమన్నేఎల్బీగా డకౌట్ అయ్యాడు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి లంక ఒక వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. కరుణరత్నే-10; కుశాల్ మెండీస్-16 పరుగులతో క్రీజులో ఉన్నారు.