Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంయునెస్కో గుర్తింపుకు అడుగు దూరం

యునెస్కో గుర్తింపుకు అడుగు దూరం

Lepakshi-UNESCO: లేపాక్షి ఇప్పుడొక బ్రాండ్. శిల్ప, చిత్ర కళకు, వేలాడే స్తంభానికి, లేచి వచ్చే నందికి నెలవయిన చోటు. పాపనాశేశ్వరుడిగా వీరభద్రుడు ప్రధాన గర్భాలయంలో ఉన్నా…అంతే ప్రాధాన్యంతో శివకేశవులు, దుర్గ, ప్రాకార మండపంలో గణపతి, ఊరి పొలిమేరల్లో ఆలయానికి కాపలా కాస్తున్నట్లు నంది…అందరు దేవతలు కొలువయిన చోటు.

విజయనగర రాజుల శిల్ప కళా వైభవానికి కట్టిన గోపురంగా ఇప్పుడు లేపాక్షి గురించి గూగుల్ నిండా చదివినంత చరిత్ర అందుబాటులో ఉంది. లెక్కలేనన్ని ఫోటోలు దొరుకుతాయి. యూట్యూబులో రకరకాల కథనాలు దొరుకుతాయి. అయితే ఇంతగా పేరు ప్రతిష్ఠలు పొందిన ఈ ఆలయం కొన్ని శతాబ్దాలపాటు మట్టి కొట్టుకుపోయి, ధూప దీప నైవేద్యాలు కూడా లేకుండా మరుగున పడి ఉండేదని చెబితే ఇప్పుడెవరూ నమ్మకపోవచ్చు.

lepakshi unesco heritage site

యునెస్కో తాత్కాలిక గుర్తింపుతో లేపాక్షి ప్రపంచ వారసత్వ సంపద కావడానికి అడుగు దూరంలో ఉంది. ఈ అడుగు చాలా కీలకమయినది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పురావస్తు శాఖలు సంయుక్తంగా ఒక ఏజెన్సీని నియమించాలి. ఆ ఏజెన్సీ సకల సమాచారాన్ని ప్రోది చేసి యునెస్కోను ఒప్పించాలి. దానికి తగిన మాట సాయాన్ని కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక బృందం ఇదే పని మీద ఉండాలి. ఆలయం చుట్టు పక్కల ఉన్న ఆక్రమణలను తొలగించి యునెస్కో ప్రమాణాల ప్రకారం తీర్చి దిద్దాలి. ఇన్ని జరిగితేనే తాత్కాలిక గుర్తింపు శాశ్వత గుర్తింపుగా మారుతుంది. ఇంతదాకా వచ్చాము కాబట్టి…ఆ ఒక్క అడుగు కూడా తడబడకుండా వేస్తామనే అనుకుందాం. వేయాలనే కోరుకుందాం.

“లేపాక్షి స్వప్న దర్శనం” పేరిట బాడాల రామయ్య ఒక పద్య కావ్యం రాశారు. ఆయన రాయలసీమ వాసి. కర్ణాటకలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. బహుశా 1965 ప్రాంతాల్లో లేదా ఇంకాస్త ముందు ఈ కావ్యం ప్రచురితమయినట్లుంది. ఈ కావ్యానికి విశ్వనాథ సత్యనారాయణ ముందు మాట రాశారు. రాముడు సీతాన్వేషణలో భాగంగా రెక్క తెగిపడ్డ జటాయువును చూసి…లే పక్షీ! అనడంతో ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరొచ్చిందనే విషయం మీద విశ్వనాథ సుదీర్ఘమయిన చర్చ చేశారు. రాముడు స్పష్టంగా తెలుగులో లే పక్షీ! అన్నాడని ఆధారాలు ఎక్కడున్నాయని వెతుకుతూ గుడి విలువను తగ్గించుకోవడానికి బదులు…జటాయువు పడ్డ చోటే గుడి కట్టారని, ఆ గుడి అయిదు శతాబ్దాలయినా చెక్కు చెదరకుండా నిలిచి ఉందని అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. పురాణాలు, కావ్యాలు, చరిత్ర, భాష, సంస్కృతి, భారతీయతకు ప్రతిరూపమయిన విశ్వనాథ అంతటి వ్యక్తి వాదన కూడా వినకపొతే మనల్ను రక్షించే వారు దొరకరు.

లేపాక్షి ఆలయం కట్టిన తరువాత ఈ ప్రాంతం ఒక వెలుగు వెలిగింది. విజయనగర రాజ్య పతనంతో ఆలయం ప్రభ తగ్గిపోయింది. నెమ్మదిగా మట్టి దిబ్బలు పేరుకుపోయాయి. ముళ్ల కంపలు మొలిచాయి. మంటపాల స్తంభాలు కూలుతూ వచ్చాయి. ఏడు ప్రాకారాల సువిశాలమయిన గుడి ఊరు ఊరంతా వ్యాపించి ఉండేది. పోయినది పోగా అయిదు ప్రాకారాలతో ఈ మాత్రం గుడి అయినా మిగిలి, పూర్వ వైభవం రావడానికి ఇద్దరే ఇద్దరు వ్యక్తులు కారణం. ఒకరు- మహాత్మా గాంధీ చేత జైలు విద్యార్థి అని బిరుదు పొందిన స్వాతంత్య్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు. రెండో వ్యక్తి 1928 నుండి 1982 వరకు లేపాక్షి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పనిచేసిన లేపాక్షి వెంకటనారాయణప్ప. స్వాతంత్ర్యానంతరం కల్లూరు సుబ్బారావు హిందూపురం ఎం ఎల్ ఏ గా పనిచేశారు. నిగర్వి. నిరాడంబరుడు. సాహితీ పిపాసి. ఉపరాష్ట్రపతి వి వి గిరి, అనేక భాషల పండితుడు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, పెన్నేటి పాట రచయిత విద్వాన్ విశ్వం లాంటివారితో తన ఇంటిని ఒక పండిత సభగా మలచుకున్నవాడు. సమరయోధుడిగా తనకిచ్చిన భూమిని కూడా కాంగ్రెస్ పార్టీకే దానమిచ్చిన ఉదారుడు.

వీళ్ళిద్దరూ జిల్లా కలెక్టరేట్ నుండి ఢిల్లీ దాకా విసుగు, విరామం లేకుండా ఏళ్లకు ఏళ్లు తిరిగి తిరిగి మట్టికొట్టుకుపోయిన లేపాక్షి ఆలయాన్ని లోకం దృష్టికి తీసుకొచ్చారు. 1920లో వీళ్లు ప్రయత్నం మొదలు పెడితే 1970 ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పుడు తవ్వకాలు మొదలు పెట్టి, కూలిపోయిన మంటపాలను తీసేసి, ఒరిగిపోయిన స్తంభాలను నిలబెట్టి, మట్టి మాటున దాగిన శిలల అందాలను వెలికి తీసి, వెలిసి పోయిన రంగులను శాస్త్రీయంగా మళ్లీ అద్ది…ఆలయంలో రాకపోకలకు దారి సరి చేసే సరికి పదిహేనేళ్ళు పట్టింది. ఆలయాన్ని వెలికి తీసుకురావడానికి యాభై ఏళ్ల పాటు కాలికి బలపం కట్టుకు తిరిగిన కల్లూరు సుబ్బారావు, లేపాక్షి వెంకటరమణప్పను యునెస్కో గుర్తింపు వేళ స్మరించుకోకపోతే మనకంటే రాళ్లే నయమవుతాయి. లేపాక్షి ఆలయాన్ని పునరుద్ధరించండి మహా ప్రభో! అని కనిపించిన ప్రతివారి కాళ్లు పట్టుకున్న నాటికి కల్లూరు సుబ్బారావు ఎమ్మెల్యే కాదు. వెంకటనారాయణప్ప సర్పంచ్ కాదు. అప్పటికి పంచాయతీరాజ్ వ్యవస్థే ఏర్పడలేదు.

lepakshi unesco heritage site

ఇంటిముందు వాలు కుర్చీలో వెంకటనారాయణప్ప కూర్చుని ఉండగా దుమ్ములో ధూళిలో తనివితీరా ఆడుకున్నవాళ్ళం మేము. ఆయన మా నాన్న శ్రేయోభిలాషి. ఆయన మనవళ్ల దాకా వారి కుటుంబంతో నాకు ఇప్పటికీ బాగా సాన్నిహిత్యం. మా నాన్న లేపాక్షి చింతలపాటి బాపిరాజు ఓరియంటల్ కాలేజీ తెలుగు అధ్యాపకుడిగా పనిచేయడం, అదే లేపాక్షి ఆలయ నాట్యమండపంలో అనేక అష్టావధానాలు చేయడం, నాకు ఊహ తెలిసినది మొదలు లేపాక్షి నంది మీద ఎక్కి దాగుడు మూతలు ఆడుకోవడం…ఇలా ఇరవై ఏళ్లపాటు లేపాక్షి తప్ప ఇంకేమి తెలియకుండా పెరిగిన నాకు లేపాక్షి అంటే పులకింత. నా తెలుగుకు లేపాక్షే వెలుగు. అడవి బాపిరాజు లేపాక్షి బసవయ్య గేయకవిత, బాడాల రామయ్య లేపాక్షి స్వప్న దర్శనం, లంకా కృష్ణమూర్తి లేపాక్షి పద్య కావ్యం, లేపాక్షి నళిని నాటకం, లేపాక్షి చారిత్రక నవల, ప్రొఫెసర్ వి కామేశ్వర రావు లేపాక్షి ఆలయం మొదలు మొన్నటికి మొన్న జర్నలిస్ట్ మైనాస్వామి రాసిన లేపాక్షి పుస్తకం దాకా…ఎందరు రాసినా ఇంకా ఎంతో మిగిలిపోయేది లేపాక్షి చరిత్ర. ముప్పయ్ అయిదేళ్లుగా సందర్భం వచ్చిన ప్రతిసారీ లేపాక్షిని తలచుకుంటూనే ఉన్నాను. రాస్తూనే ఉన్నాను. చెబుతూనే ఉన్నాను. అయినా తనివి తీరదు.

ఎందుకంటే-
“జీవమున్న మనిషికన్న శిలలే నయమనిపించును…
ఈ లేపాక్షి రాలలో ఏ కన్నులు దాగెనో?
ఈ బసవడి మాటున ఏ గుండెలు మ్రోగెనో?”

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

చరితకు సాక్షి- లేపాక్షి

RELATED ARTICLES

Most Popular

న్యూస్