Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

(Non)Local Issue: కాలగతిలో కొన్నిమాటలకు అర్థసంకోచ, వ్యాకోచాల వల్ల మరేదో అర్థం ధ్వనిస్తుంది. ఇప్పుడు వార్త అంటే కేవలం న్యూస్. “వార్తయందు జగము వర్తిల్లుచున్నది అదియు లేనినాడ అఖిల జనులు అంధకారమగ్నులగుదురు కావున వార్త నిర్వహింపవలయు బతికి ” అన్న భారత పద్యం అక్షరాలా న్యూస్ గురించే చెప్పిందనుకుని తెలుగు ప్రింట్ మీడియా దశాబ్దాల తరబడి ఈ పద్యాన్ని తెగవాడుకుంది. అర్థంలేని ఎన్నో మాటలను సృష్టించి జనం మీద వదలడంతో పోలిస్తే ఇంత మంచి పద్యం ఏదో ఒక అర్థంలో అన్నేళ్లపాటు ప్రచారంలో ఉన్నందుకు సంతోషించాలి.

మొదట్లో-
పశుపోషణ, వ్యవసాయం, కృషి కలిపి- “వార్త”.

వృత్తం అంటే చుట్టూ తిరిగేది…లోకమంతా వ్యాపించేది అనే అర్థంలో “వార్త” తరువాత ఎప్పుడో స్థిరపడినట్లుంది.

పాశం అంటే తాడు. పాశంతో కట్టి ఉంటుంది కాబట్టి పశువు అయ్యింది. మన్ అన్న సంస్కృత ధాతువు నుండి మనిషి అన్న మాట పుట్టింది. అంటే ఆలోచించే స్వభావం ఉన్నవారు అని అర్థం. ఇందులో నుండే మననం, మనసు, మానవత్వం పుట్టాయి. అందుకే అవి లేనప్పుడు మనిషివా? పశువ్వా? అంటాం. మనకుమాత్రమే మనసు, ఆలోచన, మననం ఉంటాయి, పశువులకు ఉండవు అనుకుని మనం చాలా పాశవికంగా ప్రవర్తిస్తున్నామేమో? గొడ్డును బాదినట్లు వాటిని బాదేస్తున్నాం. మనిషికో మాట – గొడ్డుకో దెబ్బ అని చెప్పి మరీ కుమ్మి పారేస్తున్నాం. పశువుల సంతగా మార్చేస్తున్నాం. ఎద్దు పుండు కాకికి ముద్దు. మనుషులు మాత్రం పశువులను అంతకంటే భిన్నంగా చూస్తున్నారా?

అందుకే పశువులను గౌరవంగా చూడ్డానికి, చూడాలన్న స్ఫూర్తిని నింపడానికి ఏర్పడినవి కనుమ, సదర్ పండుగలు.

మొత్తంగా పాడి పంటలకు సంబంధించినది కనుమ. ఆవులు, ఎడ్లు తొక్కనినేల మన ఆచారంలో ఉపయోగించడానికి వీలులేనిది. చివరికి యజ్ఞం చేయాలన్నా మొదట కాడికి ఎడ్లను కట్టి, నాగలితో భూమిని దున్ని ప్రారంభించాలి. మిథిల అవుట్ స్కర్ట్స్ లో జనకుడు అలా దున్నుతుంటే నాగేటిచాలుకు దొరికింది సీతమ్మ. నాగేటితో దున్నినప్పుడు భూమిపై గింజలు చల్లడానికి అనువుగా చేసిన లైన్లను నాగేటి చాలు అంటారు. సంస్కృతంలో సీత. అందుకే ఆమె పేరు సీత అయ్యింది. జనకుడి కూతురుగా పెరిగింది కాబట్టి జానకి. మిథిలలో పుట్టింది కాబట్టి మైథిలి.

దున్నపోతులకు మాత్రమే సంబంధించినది సదర్ పండుగ. రంగు, స్వభావం వల్ల భాషాపరంగా “దున్నపోతు” నిందార్థమయ్యింది.
దున్నపోతులా ఉన్నావు;
దున్నలా బలిసిపోయావ్;
దున్నపోతుమీద వాన కురిసినట్లు;
దున్నపోతులా అడ్డంగా పడి ఉన్నావ్…
ఇలా లెక్కలేనన్ని దున్న తిట్లు తిడుతున్నాం. ఎగతాళికి దున్నను వాడుకుంటున్నాము. దున్నపోతుకే కనుక మాటలు వచ్చి…నోరు విప్పితే…మానవజాతి దున్నల కాలి గిట్టలకింద సిగ్గుతో దాచుకోవాల్సి వస్తుంది.

తెలంగాణాలో సదర్ అనాదిగా ఉన్న ఉత్సవం. నెమ్మదిగా ఈ ఉత్సవాలు పోటీలుగా మారిపోయాయి. దాంతో స్థానిక దున్నపోతుల స్థానంలో హర్యానా బాహుబలి దున్నలు వచ్చాయి. దాదాపు రెండు వేల కేజీల బరువుండే ఆ దున్నపోతులు తినే యాపిల్స్ , బాదం, పిస్తాలు; నిగ నిగలాడే నల్లటి నునుపు కోసం వాటికి ఆయిల్ మసాజ్ లు, వాటి ఆలనా పాలనకు అటెండెంట్లు ఇదంతా బృందావనంలో గోపోషణకంటే పెద్ద ఇండస్ట్రీ. లక్షల ఖర్చుతో కూడిన వ్యవహారం. ఈ బాహుబలి దున్నల దెబ్బకు స్థానిక దున్నలు గుండు సున్నాలై విలువ లేనివి కావడం కొందరు తెలంగాణా యువకుల గుండెకు తగిలింది. ఇకపై స్థానిక దున్నలనే పోటీకి పరిగణించాలన్న వారి డిమాండు సహేతుకమయినదే. వారి ఆవేదన అర్థం చేసుకోదగ్గదే.

తినడానికి గుడ్డి గడ్డి పోచ కూడా దొరకని సగటు దున్నను-
ముప్పూటలా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ పెట్టి మేపిన హర్యానా మహా దున్న పక్కన పోటీకి పెట్టడం…
క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. సహజ దున్న న్యాయ సూత్రాలకు వ్యతిరేకం.
స్థానిక దున్నల ఆత్మాభిమానానికి, ప్రాంతీయ అస్తిత్వ పోరాటానికి సంబంధించిన సమస్య ఇది.

ఇప్పటికయినా పశువుల మనోభావాలను గుర్తించకపోతే…
మరీ ఇంత పాశవికంగా ప్రవర్తిస్తారా? అని స్థానిక దున్నపోతులు ప్రశ్నిస్తే…మనం మానవత్వంతో ఏమి సమాధానం చెప్పగలం?

ఏమాటకామాట.
సదర్ లో దున్నపోతుల అందమే అందం.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఆధునిక గజేంద్ర మోక్షణం

Also Read :

పశుపాలన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com