Thursday, March 28, 2024
HomeTrending Newsజాబ్ క్యాలండర్ మేము ఇస్తాం: లోకేష్ హామీ

జాబ్ క్యాలండర్ మేము ఇస్తాం: లోకేష్ హామీ

చంద్రబాబు పాలనలో 40వేల పరిశ్రమల ద్వారా 6లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని, ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వమే శాసన సభ సాక్షిగా వెల్లడించిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువ గళం పాదయాత్ర చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. దీనిలో భాగంగా నేడు ఇర్రంగారి పల్లె వద్ద యువతతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. అదానీ, ఈసిఎల్, కియా,  హెచ్ సి ఎల్, ఫాక్స్ కాన్, సెల్ కాన్ లాంటి పరిశ్రమలు ఎన్నో తమ హయంలో వచ్చాయని గుర్తు చేశారు.       2019లో బాబు గెలిచి ఉంటే ఈ పాటికి రాష్ట్రంలో 15 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి ఉండేవని, మొత్తంగా 50 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవని పేర్కొన్నారు.

ప్రతియేటా జాబ్ క్యాలండర్ ఇస్తామని హామీ ఇచ్చిన జగన్… యువతను మోసం చేశారని, ఖాళీగా ఉన్న రెండు లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అది కూడా చేయలేదని, ప్రతి ఏటా 6,500 పోలీసు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని చేయలేదని విమర్శించారు. కనీసం ఒక్క డిఎస్సీ కూడా వేయలేదని, కానీ బాబు సిఎం గా ఉండగా రెండు డిఎస్సీల ద్వారా 32వేల పోస్టులు భర్తీ చేశారని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 2025  జనవరి1న జాబ్ క్యాలండర్ తాము ప్రకటిస్తామని, ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు భర్తీ చేసేది, ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహించేదీ, ఎప్పుడు ఆఫర్ లెటర్లు ఇచ్చేదీ  స్పష్టంగా అదేరోజు చెబుతామన్నారు.

బడుగు బలహీన వర్గాలకు, ఓసీ కులాల్లో పేదవారికి అనేక కార్పొరేషన్లు చంద్రబాబు ఏర్పాటు చేశారని, వాటి ద్వారా యువతకు స్వయం  ఉపాధి కోసం రుణాలు ఇచ్చామని చెప్పారు. ఏపీఐఐసి ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఏర్పాటు చేసి, వాటిలో బిసిలకు ప్రత్యేకంగా కొంత శాతం కేటాయించాలనేది బాబు గారి లక్ష్యమన్నారు.

కాగా, లోకేష్ యాత్ర నేటికి 400 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నేండ్రగుంట వద్ద శిలాఫలకం ఆవిష్కరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆ గ్రామంలో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  నిర్మిస్తామని లోకేష్ ప్రకటించారు.

Also Read : మరో ‘పులివెందుల’గా గన్నవరం: బాబు ఫైర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్