Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశివ శివ అనరాదా!

శివ శివ అనరాదా!

Other Names of Lord Shiva: శివుడు ఆనంద స్వరూపుడు. శుభములను కలిగించేవాడు. శివుడు లింగాకారంగా ఆవిర్భవించిన రోజుగాను, శివ పార్వతుల వివాహం జరిగిన రోజుగాను, హాలాహలాన్ని మ్రింగి లోకాలన్నిటికీ శుభం కలిగించిన రోజుగాను మహాశివరాత్రి జరుపుకుంటాము. అనేక పేర్లతో భారతదేశమంతటా శివాలయాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్నిబట్టి, క్షేత్రప్రభావాన్నిబట్టి పేర్లు ఏర్పడుతుంటాయి. శివరాత్రి సందర్భంగా శివుడి ప్రత్యేకనామాల్లో కొన్నింటిని గురించి తెలుసుకుందాము.

కంచి:
ఆసక్తికరమైన కంచి. కచ్ఛపేశ్వరుడు వెలసిన క్షేత్రం కనుక దీనికి కంచి అనే పేరు వచ్చింది. కఛ్చపి అంటే తాబేలు. విష్ణువు పది అవతారాలలో కూర్మావతారం ఒకటి. కూర్మావతారంలో ఉన్న విష్ణువును శివుడు ఇక్కడ పూజించినట్లు పురాణగాథ. పూర్వం కంచి దివ్యక్షేత్రమేగాక సాంస్కృతికంగా ప్రసిద్ధిగాంచిన నగరం.

నజుండయ్య:
నంజుండయ్య అనే పేరు ఉన్నది – నీలకంఠునికి. కన్నడంలో నంజు = విషం ఉండ = భక్షించిన అయ్య = నామానుబంధం. విషం మింగడం వలన కంఠం నీలవర్ణం కావడంతో నీలకంఠుడు అయ్యాడు. ఉండ అనేది ‘ఉడే’ ధాతువు (=తిను/తాగు) భూతార్థక ధాతుజ విశేషణం.

ఉణ్ణాములై:
ఉణ్ ధాతువు నుండి వచ్చిన మరొకపేరు తమిళంలోని ఉణ్ణాములై తెలుగులో ఉణ్ణాముల. ఆరుణాచల క్షేత్రంలో వెలసిన పార్వతీదేవి పేరు. ఉణ్ = తిను/తాగు + అ = వ్యతిరేకార్థ ప్రత్యయం + ముల = వక్షోజము (కలది). పాలు తాగని వక్షోజముకల దేవి. దీని సంస్కృతీకరణం అపీత కుచాంబ. దివ్యులైన వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు తల్లిపాలు తాగవలసిన అవసరం లేకపోయింది. అందువలన పార్వతీదేవి. పాలుతాగని వక్షోజముకల దేవిగా తెలియబడుతున్నది.

కాటమయ్య:
కాటమయ్య కాడు అంటే అడవి, శ్మశానం. ఇక్కడ ‘కాట్’ ధాతువు. ‘కాట్’ ధాతువు + ‘అ’ ప్రత్యయం ‘మ్’ ప్రకృతిభావ నివారణకై వచ్చిన ఆగమం + అయ్య = కాటమయ్య. అడవిలో పశువులకాపరులు కొలిచే దేవతను కాటమయ్య అని పిలుస్తారు.

కాట్రేడు:
కాట్రేడు ‘కాట్’ ధాతువునుండి వచ్చిన మరోపదం కాటిరేడు > కాట్రేడు. కాట్రేడు అంటే శ్మశానానికి ప్రభువు. శివుడు అని అర్థం. కాశీకి మహాశ్మశానమని ఒక పేరు ఉన్నది.

మహాయోగి, మహాత్యాగి, మహావిరాగి, మహాజ్ఞాని అయిన శివుడు అందరికీ శుభములను ప్రసాదించు గాక!

(ఈ సంకలనం ఆచార్య కోరాడ మహాదేవశాస్త్రిగారి ‘భాషా సంస్కృతి’ పుస్తకం ఆధారంగా చేసినది)

-కోరాడ వేంకటరమణ

Also Read : శివతాండవానికి తెలుగు మువ్వలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్