Saturday, July 27, 2024
HomeTrending Newsపంట మార్పిడిపై కేంద్రం కసరత్తు..సాగునీటి సద్వినియోగానికి చర్యలు

పంట మార్పిడిపై కేంద్రం కసరత్తు..సాగునీటి సద్వినియోగానికి చర్యలు

మూడొంతుల జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగం, వ్యవసాయాదారిత దేశమైనా… మన పాలకులు ఇప్పటివరకు సమగ్ర విధానాలు రూపొందించలేకపోతున్నారు. బహుళజాతి సంస్థల ఒత్తిడికి తలొగ్గి విధానాల రూపకల్పన చేసి రైతాంగంపై బలవంతంగా రుద్దటం పాలకులకు అలవాటుగా మారింది. ఆలస్యంగా మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం నివారణ చర్యలకు ఉపక్రమించింది.

నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి పంట నుంచి రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడానికి కేంద్రం కొత్త ప్రణాళికను అమలు చేయనున్నట్టు సమాచారం. రైతులు వరికి బదులుగా కంది, మినుము, ఎర్ర పప్పు, మక్కజొన్న, పత్తి పంటలు పండిస్తే ఐదేండ్ల పాటు కనీస మద్దతు ధర ఇచ్చి పంటను కొనుగోలు చేయనుంది. కేంద్ర సంస్థలైన జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య(ఎన్సీసీఎఫ్‌), జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(నాఫెడ్‌) రైతులతో ముందస్తు ఒప్పందం చేసుకుంటాయి. ఇందుకు గానూ ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్‌లో రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవల్సి ఉంటుంది. వరికి బదులుగా ఇతర పంటలు పండించే రైతుల నుంచి ఎలాంటి పరిమితులు లేకుండా కనీస మద్దతు ధర ఇచ్చి పంట కొనుగోలు చేయాలని కేంద్రం ప్రణాలికలు రూపొందిస్తోంది. ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేయనుంది.

నిర్ణీత పరిమితి లేకుండా గోధుమ, వరి పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం సరికాదని, ఇది ‘పంట మార్పిడి’పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నీతి ఆయోగ్‌ పరిధిలోని వర్కింగ్‌ గ్రూప్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార భద్రత చట్టం, ఇతర సంక్షేమ పథకాల అవసరాలకు సరిపడా మాత్రమే వీటిని కొనుగోలు చేయాలని సిఫారసు చేసింది.

ప్రధాన ఆహార ఉత్పత్తుల డిమాండ్‌, సప్లయ్‌ని విశ్లేషించి ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేసేందుకు ఏర్పాటైన 23 మంది సభ్యులతో కూడిన కమిటీ కొద్ది రోజుల క్రితం నివేదిక సమర్పించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్‌, హర్యానాలోని రైతన్నలు చలో ఢిల్లీ మార్చ్‌ నిర్వహిస్తున్న వేళ నివేదిక బయటకు రావడం గమనార్హం. ఒకవేళ మార్కెట్‌లో మిగులు ధాన్యం ఉన్నా లేదా వరి, గోధుమ నుంచి రైతులు ఇతర పంటలకు మళ్లాల్సి వచ్చినా వారికి పరిహారం అందించవచ్చని కమిటీ పేర్కొన్నది.

ఢిల్లీలో ఆందోళన చేసిన రైతులు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుండగా, రైతు నేతలతో చర్చల సమయంలో కేంద్రమంత్రులు కొత్త ప్రతిపాదన చేశారు. రైతు నేతలు ఈ ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ కేంద్రం అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. తద్వారా వ్యవసాయానికి నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు పప్పుదినుసుల కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని కేంద్రం భావిస్తున్నది. దీంతో పాటు ఇథనాల్‌ తయారీకి బియ్యానికి బదులుగా మొక్కజొన్న వినియోగాన్ని పెంచవచ్చని అంచనా వేస్తున్నది.

భవిష్యత్ తరాల ఆహారభద్రతకు అభ్యుదయ విధానాలకు శ్రీకారం చుడుతూ… మరోవైపు ఓట్ల రాజకీయం కోసం మూత పడిన చెరుకు ఫ్యాక్టరీలను పునఃప్రారంభం చేసేందుకు బిజెపి ప్రభుత్వం కార్యాచరణకు దిగటం ఆందోళనకరం. అంతులేని నీటి వినియోగం, భూసారాన్ని దెబ్బతీసే చెరుకు పంట సాగును అభివృద్ధి చెందిన దేశాలు ఏనాడో వదిలేశాయి. కేవలం మూడో ప్రపంచ దేశాల్లోనే చెరుకు పంట సాగు చేస్తున్నారు.

దేశ ప్రయోజనాలకు క్షేమకరం కాని చెరుకు పంట సాగు తగ్గించి ఇతర పంటల వైపు మల్లించేలా కేంద్రం చర్యలు చేపట్టాలి. చెరుకు సాగు ద్వారా నీటి వనరులు అధికంగా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. చిరు ధాన్యాల సాగుకు ప్రోత్సాహం ఇస్తున్న ప్రభుత్వం చెరుకు రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు తీసుకెళ్లాలని కోరుతున్నారు.

మరోవైపు భూసారం తగ్గుతోంది. UN convention to combat desertification నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచంలో 90 శాతం భూమి నిస్సారంగా మారుతుందని వెల్లడించింది. ఒక పిడికెడు మట్టిలో 8 లక్షల జీవరాసులు ఉంటాయి. వాటితోనే అన్ని రకాల పంటలు పండుతున్నాయి. అధిక దిగుబడి కోసం వాడే ఎరువులతో ఈ జీవరాశులు నశించి.. భూసారం తగ్గుతోంది. ఎరువులతో ప్రతి ఏడాది 27 వేల రకాల జీవులు చనిపోతున్నాయి. సాగు నీటి వినియోగంతో పాటు ఎరువుల వాడకంపై ప్రపంచ దేశాలు కట్టుదిట్టమైన నిబంధనలు రూపొందించి, అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్