నిరంతరం రైతు సంక్షేమం కోసం కృషి చేసే ప్రభుత్వం కేసీఆర్ గారిదని, విపరీత ప్రకృతి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతాంగం కోసం నిరంతరాయంగా దేశంలో ఎక్కడా లేని విదంగా కనీస మద్దతు ధరతో ధాన్యం సేకరణ చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ డా అంబేద్కర్ సచివాలయంలో మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిదులతో యాసంగి ధాన్యం సేకరణ, సీఎంఆర్ నూక శాతం ఇతరత్రా సమస్యలపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బందులు కలుగకూడదని, మిల్లర్లు ప్రభుత్వానికి ఖచ్చితంగా సహకరించాలన్నారు. ఎఫ్.ఏ.క్యూ ధాన్యంలో ఒక్క గింజ కోత పెట్టినా ఉపేక్షించమన్న మంత్రి, ధాన్యం అన్లోడింగ్లో వెంట వెంటనే చేపట్టాలన్నారు. సీఎంఆర్ నిర్ణీత గడువులోగా ముగించాలన్నారు, యాసంగి ధాన్యంలో నూక శాతంపై గతంలో నిపుణుల కమిటీ మధ్యంతర నివేధిక సమర్పించిన నేపథ్యంలో ప్రస్థుత యాసంగి వరి రకాలు, పరిస్థితులకు ఎలా అన్వయించాలో త్వరలోనే సీఎం గారి ద్రుష్టికి తీసుకెళ్లి నిర్ణయిస్తామన్నారు, ప్రభుత్వంతో పాటు మిల్లర్లు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి గంగుల కమలాకర్.
ఈ సందర్భంగా మిల్లర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి ద్రుష్టికి తెచ్చారు. తెలంగాణలో యాసంగి ఉష్ణోగ్రతలకు పొట్టదశలోనే గింజ విరిగిపోతుందని, దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా చరిత్రలో ఎన్నడూ లేనివిదంగా కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ముడిబియ్యాన్ని ఇవ్వమని కోరడం వల్ల రైతులతో పాటు మిల్లింగ్ ఇండస్ట్రీ ఇబ్బందుల పాలవుతుందని, ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ణప్తి చేసారు. వ్యవసాయంలో మిల్లర్లు సైతం భాగస్వాములమని, రైతు పండించిన పంట వినియోగదారునికి చేర్చే గురుతర బాధ్యతను మోస్తున్నామన్న మిల్లర్లు, తమను రైతులకు శతృవులుగా ప్రచారం చేయడం బాధకలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఎఫ్.ఏ.క్యూతో ఉన్న ధాన్యంలో కోతలు పెట్టడం లేదన్న మిల్లర్లు ప్రస్థుత యాసంగిలో అకాల వర్షాలతో వచ్చిన ధాన్యం ముక్కడంతో పాటు రంగుమారుతుందని, దీనికి తోడు ముడిబియ్యంగా సగం ఔటర్న్ కూడా రాదని, ప్రభుత్వం త్వరితంగా నూకశాతాన్ని తేల్చాలని విజ్ణప్తి చేసారు.
ఈ సమావేశంలో మంత్రితో పాటు పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, జీఎం శ్రీనివాసరావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంపా నాగేందర్, జనరల్ సెక్రటరీ ఏ.సుధాకర్ రావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి. ప్రభాకర్ రావ్, ట్రెజరర్ చంద్రపాల్, అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.