Reviews Yadadri : ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం య‌దాద్రి శ్రీ ల‌క్ష్మిన‌ర్సింహా స్వామి ఆల‌యంలో భ‌క్తుల సౌక‌ర్యాల క‌ల్ప‌న‌, ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప‌నుల‌పై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంబంధిత అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. అర‌ణ్య భ‌వ‌న్ లో నిర్వ‌హించిన ఈ స‌మావేశానికి దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, వైటీడీఏ వైస్ చైర్మ‌న్ కిష‌న్ రావు, ఆర్ & బీ ఈఎన్సీ గ‌ణ‌ప‌తి రెడ్డి, ఎస్ఈ వ‌సంత్ కుమార్, ఆల‌య ఇంచార్జీ ఈవో రామ‌కృష్ణ‌, ఇత‌ర అధికారులు హాజ‌ర‌య్యారు.

క్యూ కాంప్లెక్స్ లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడ‌టం, వాష్ రూమ్స్ లో ప‌రిశుభ్ర‌త‌, కొండ పైన‌ చ‌లువ పందిళ్ళు ఏర్పాటు, మురుగునీటి కాల్వ‌ల నిర్వ‌హ‌ణ‌, క్యూ కాంప్లెక్స్ లో ఫ్యాన్ల నిర్వ‌హ‌ణ స‌క్ర‌మంగా ఉండేలా చూడ‌టం, వృద్ధులు, విక‌లాంగుల‌కు వీల్ చైర్ లు అందుబాటులో ఉండేలా చూడటం, కొండ కింద మొబైల్ టాయ్లెట్స్ ఏర్పాటు, ఇత‌ర వ‌స‌తులు ఏర్పాటు పై స‌మావేశంలో చ‌ర్చించారు. అకాల వ‌ర్షం వ‌ల్ల ఉత్ప‌న్న‌మైన స‌మ‌స్య‌లు, పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌ల‌ను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కూలిన పందిళ్లు, వాననీటి లీకేజీలు, ఇతర నష్టాలపై ఆరా తీశారు. ఇలాంటి స‌మ‌స్య‌లు భవిష్య‌త్ లో పునరావృతం కాకుండా వ‌ర్ష‌కాలంలోగా వాటిని అధిగ‌మించేందుకు చర్య‌లు తీసుకోవాల‌న్నారు. మౌలిక వ‌స‌తుల‌పై ప్ర‌ధానంగా దృష్టి పెట్టాల‌ని, సామ‌న్య భ‌క్తుల‌కు శీఘ్ర‌ద‌ర్శ‌నం జ‌రిగేలా చూడాల‌న్నారు.

ప్ర‌ధాన ఆల‌యంతో పాటు మిగితా నిర్మాణాలు నూత‌నంగా చేప‌ట్టినందు వ‌ల్ల కొన్ని రోజుల పాటు నిర్వ‌హ‌ణ‌లో పురోగ‌తి చూపిస్తూ మందుకు వెళ్ళాల్సి ఉంటుంద‌ని, దీన్ని పెద్ద త‌ప్పిదంగానో లేదా పొరాపాట్లుగా చూడాల్సిన‌ లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. స‌ర్దుబాటు స‌మ‌యంగా దీన్ని భావించి, అన్ని అడ్డంకుల‌ను అధిగ‌మించి అద్భుత‌మైన వ‌స‌తులు క‌ల్పించే దిశ‌గా ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

భక్తులు క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా ప్రత్యేక చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణంలో వేచి ఉన్న అన్ని సమయాలలో భక్తులకు మంచినీరు అందించాల‌ని, అదేవిధంగా భక్తులు ఎండవేడిమి నుంచి సేద తీరేవిధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వసతి కల్పనలో ఆలస్యం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంత‌రం మంత్రి మాట్లాడుతూ… రాజ‌కీయ ల‌బ్ధి కోసం ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం యాదాద్రిపై విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాదని అన్నారు. చిన్న చిన్న స‌మ‌స్య‌లను కూడా భూత‌ద్దంలో చూపెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని, పవిత్ర‌మైన ఆల‌య ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నాలు మానుకోవాలని హిత‌వు ప‌లికారు. 79 మిల్లీమీట్ల‌ర్ల‌ అకాల‌ భారీ వర్షం కారణంగా నిర్మాణంలో రోడ్లు దెబ్బతిన్నాయని, ఆల‌య ప్రాంగ‌ణంలో పెండింగ్ ప‌నులు కొన‌సాగుతుండ‌టంతో పైప్ లైన్ లో మ‌ట్టి, ఇసుక కూరుకుపోయి నీరు నిలిచిపోయిందే త‌ప్పా నాసిర‌కం ప‌నుల వ‌ల్లో, నిర్మాణ లోపం వ‌ల్లో అలా జ‌ర‌గ‌లేదని స్ప‌ష్టం చేశారు. భారీ వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లు, ఇతర పనులను వెంటనే పునరుద్ధరించారని. అకాల వ‌ర్షాల‌తో ఉత్ప‌న్న‌మైన చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించామ‌ని తెలిపారు.

Also Read : తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *