వ్యవసాయంలో యాంత్రీకరణ, అధిక ఉత్పాదకతనిచ్చే వంగడాలు,పెద్ద కమతాలు అమెరికా రైతుల విజయ రహస్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అమెరికాలో అధికసాంద్రత పత్తి సాగు బాగుందని తెలిపారు. పత్తి సాగులో ఆధునిక పద్దతులు, అధిక సాంధ్రత పత్తి సాగుపై అధ్యయనంలో భాగంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో పత్తి పరిశోధనా కేంద్రాన్నిమంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్, డాక్టర్ మెతుకు ఆనంద్,పెద్ది సుదర్శన్ రెడ్డి , తెలంగాణ సీడ్స్ ఎండీ కేశవులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాధారం ఉంటే హెక్టారుకు 60 నుండి 75 వేల మొక్కలు నాటవచ్చని తెలిపారు.సాగునీటి సదుపాయం ఉంటే హెక్టారుకు లక్ష 10 వేల మొక్కలు నాటవచ్చన్నారు. భవిష్యత్ లో తెలంగాణలో హెక్టారుకు లక్ష 40 వేల మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఇక్కడి రైతులు పత్తి పంట తర్వాత జొన్న సాగు చేస్తూ పత్తిలో అధిక దిగుబడులు సాధిస్తున్నారని మంత్రి తెలిపారు.మన దేశంలో పాలకులకు ముందుచూపు లేకపోవడం మూలంగా అత్యధిక శాతం మందికి ఉపాధినిచ్చే వ్యవసాయరంగం ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయరంగ స్వరూపం సంపూర్ణంగా మారుతున్నదని అన్నారు. రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు, సాగునీటి రాకతో తెలంగాణ రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను ప్రోత్సహించి వ్యవసాయ రంగాన్ని లాభదాయకమైన వ్యాపారరంగంగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు.