Thursday, May 9, 2024
HomeTrending Newsసుంకం పెంపు రైతులకు భారం

సుంకం పెంపు రైతులకు భారం

ఆయిల్ పామ్ విత్తన మొలకల దిగుమతి సుంకం పెంపు నేపథ్యంలో పెంపు భారం రైతులపై పడకుండా పాత కేటగిరిలోనే ఉంచాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు  లేఖ రాసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

ఆయిల్ పామ్ విత్తన మొలకలపై కేంద్రం పెంచిన దిగుమతి సుంకాన్ని తగ్గించాలి. దేశంలో నూనె ఉత్పత్తుల స్వయం సంవృద్దికి తోడ్పడాలి. ఆయిల్ పామ్ కు తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం , తెలంగాణ నేలలు సాగుకు అనుకూలం. తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రభుత్వం సాగునీటి వసతి, 24 గంటల కరంటు సరఫరా, ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు రైతుబంధు పథకాలతో సాగుకు ప్రోత్సాహం అందిస్తోంది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ కు అత్యధిక నూనె ఉత్పాదకత, 25 నుండి 30 ఏళ్ల పాటు దీర్ఘకాలిక ఆదాయం, తక్కువగా ఆశించే చీడపీడలు, తక్కువ పెట్టుబడి ఖర్చులు, బై బ్యాక్ గ్యారంటీ పాలసీతో పాటు రాష్ట్రంలో పంటల వైవిద్యీకరణలో ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నాం.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో 20 లక్షల ఎకరాలలో యుద్దప్రాదికన , రాబోయే 2022, 2023 సంవత్సరాలలో 3 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళిక సిద్ధంగా ఉంది. దేశంలో ఆయిల్ పామ్ సాగుకు అవసరానికి తగినంత  విత్తన తోటలు లేవు ఈ పరిస్థితులలో కోస్టారికా, థాయ్ లాండ్, మలేషియా దేశాల నుండి విత్తన మొలకలు దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణలో ఇప్పటికే ప్రకటించిన 8 లక్షల ఎకరాలకు 14.40 కోట్ల విత్తన మొలకలు అవసరం ఉన్నాయి. వాటిలో వచ్చే ఏడాదికి 2.16 కోట్ల విత్తన మొలకలు అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ – ఆయిల్ పామ్ నిబంధనల ప్రకారం హెక్టారుకు రూ.12 వేల విలువైన మొక్కల అవసరం.

ఒక్క ఆయిల్ పామ్ విత్తనం మొలక ధర రూ.99 .. దీనిలో 85 శాతం సబ్సిడీ అంటే ఒక్క మొలక రూ.84 కు రైతులకు అందించడం జరుగుతుంది. అయితే తాజాగా పెంచిన 30 శాతం సుంకం నేపథ్యంలో దిగుమతి చేసుకుని పెంచి రైతులకు అందించే సమయానికి విత్తన కంపెనీలకు అయ్యే ఖర్చు రూ.240 నుండి రూ.250 అవుతుంది. 1991 – 92 నుండి 2019 వరకు ఆయిల్ పామ్ విత్తన మొలకల దిగుమతి ITC HS 12099910 పండ్ల తోటల పద్దు కింద ఉండేది .. ప్రస్తుతం దీనిని ITC HS 12071010 పామ్ నట్స్ పద్దు కిందకు మార్చారు. ఇది 30 శాతం దిగుమతి సుంకం పరిధిలోకి వచ్చింది .. దీనిమూలంగా రైతులపై అదనపు భారం పడుతుంది. పెంచిన దిగుమతి సుంకం నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో ఆయిల్ పామ్ అభివృద్ధికి భారీ నష్టం కలగనుంది. దీని మూలంగా నూనెల డిమాండ్ , సప్లైల మధ్య భారీ వ్యత్యాసం పెరిగి వినియోగదారులపై భారం పడనుంది. దిగుమతి చేసుకోనున్న ఆయిల్ పామ్  విత్తన మొలకలు కేవలం నర్సరీలు పెంచడానికి, తర్వాత రైతులకు అందించడానికి మాత్రమే. కానీ గింజలను దిగుమతి చేసుకుని నూనె తీయడానికి కాదు .. వాణిజ్య అవసరాలకు అసలే కాదు. ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహానికి రైతులపై భారం తగ్గించేందుకు దిగుమతి ఆయిల్ పామ్ విత్తన మొలకలను 12071010 బదులుగా 12099910 క్యాటగిరీ కిందనే ఉంచగలరు

RELATED ARTICLES

Most Popular

న్యూస్