సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (72) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కిడ్నీ, గుండె సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఈ నెల 18న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. సాయన్నకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయనకు ఉంది.
అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన సాయన్న.. 1994,1999,2004లో వరుసగా విజయం సాధించారు. 2009లో ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా మరోసారి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
టీడీపీతో సాయన్న తన రాజకీయ ప్రస్థానం మొదలైంది. నాలుగుసార్లు తెలుగుదేశం పార్టీ తరుఫున, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. ఆ తరువాత గులాబీ గూటికి చేరిన సాయన్న.. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ పై 37,568 ఓట్ల తేడాతో విజయం సాధించి ఐదోసారి శాసనసభలో అడుగుపెట్టారు. సాయన్న కుమార్తె నందితా లాస్య కూడా ఓసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.