Monday, May 20, 2024

సెల్ఫ్ గోల్

Boomerang:  చందమామ కథలు చందమామలా అందమయినవి. మనసుకు వెన్నెల రెక్కలు కట్టి ఊహా లోకాల్లో విహరింపజేసేవి. అప్పుడప్పుడే అక్షరాలు కలిపి చదవడం నేర్చుకునే పిల్లలు మొదలు కాటికి కాళ్లు చాచిన పండు ముసలివారి వరకు అందరూ చందమామకోసం ఎదురు చూసేవారు. వడ్డాది పాపయ్య జీవం పోసిన కవర్ పేజీ రంగుల బొమ్మ చూడగానే కంటికి పండగగా ఉండేది. కొడవటిగంటి కుటుంబరావులు ఎందరు ప్రాణం పోస్తే చందమామ అన్ని దశాబ్దాలపాటు పిండారబోసిన వెండి వెన్నెలను పంచిందో!

నలభై అయిదేళ్ల కిందటి ఒక చందమామలో ఒక సింగిల్ పేజీ కథ. అంటే నాలుగు పేరాల పొట్టి కథ. మధురాంతకం రాజారామ్ లాంటి విఖ్యాత కథకులు ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించిన కథ. అనేక భాషల్లోకి అనువాదమయిన కథ.

ఎర్రటి ఎండా కాలం. ఊళ్లో ఉన్న నాలుగు వీధుల్లో తిరిగిన భిక్షగాడికి ఎందుకో ఆ రోజు ఎక్కడా పిడికెడు బువ్వ దొరకలేదు. ఒక ఇంటి అరుగు మీద నీరసంతో కూలబడ్డాడు. మాతా! కబళం తల్లీ! అని అర్థించాడు. ఈ రోజు రొట్టెలు చేస్తున్నాం. కాసేపు ఆగు నాయనా…తిందువు గానీ…అని ఆ ఇంటి యజమానురాలు చెప్పింది. భిక్షగాడికి కునుకు పట్టింది. అరుగు గుంజకు ఆనుకుని నిద్రలోకి జారుకున్నాడు.

కాసేపటికి పళ్లెంలో పది రొట్టెలు పెట్టి, భిక్షగాడి భుజం తట్టి, లోటాలో నీళ్లు కూడా పక్కన పెట్టి వెళ్లింది. నకనకలాడే ఆకలితో ఆవురావురుమని భిక్షగాడు ఆరు రొట్టెలను ఏకబిగిన తినేశాడు. ఏడో రొట్టె సగం తిని ఏడవడం మొదలు పెట్టాడు. భిక్షగాడికి పెట్టి తాము కూడా తింటున్న ఆ ఇంటివారందరూ అలాగే ఎంగిలి చేతులతో గుమ్మం దగ్గరికి వచ్చారు…ఏమి జరిగిందో అన్న కంగారుతో.

ఏడో రొట్టె తింటే ఆకలి తీరుతుందని ముందే తెలిసి ఉంటే…దాన్నే తినేవాడిని…అప్పుడు పైన ఆరు రొట్టెలు అలాగే మిగిలిపోయి ఉండేవి…ఎంత మూర్ఖుడినో నేను…ఎంత తెలివి తక్కువ పని చేశానో?…అని మళ్లీ గుండెలు బాదుకుంటాడు. ఆ ఇంటివారు అతడి అమాయకత్వానికి నవ్వుకుని ఇంట్లోకి వెళ్లిపోతారు. కథ సమాప్తం. ఈ కథ పేరు- ఏడో రొట్టె.

ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ “అగర్ కాంగ్రెస్ న హోతీ…” అని రాజ్యసభలో కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. చందమామ ఏడో రొట్టె కథ నిజంగా జరిగిందో…రచయిత కల్పనో…తెలియదు. ఏడో రొట్టె కథను అగర్ కాంగ్రెస్ న హోతీతో అన్వయించుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు.

కాంగ్రెస్ లేకుండా ఉండి ఉంటే-

పార్లమెంటులో పెప్పర్ స్ప్రే జరిగి ఉండేది కాదు;

అర్ధ రాత్రి పార్లమెంటు తలుపులు మూత పడేవి కాదు;

సిక్కుల ఊచకోత జరిగి ఉండేది కాదు;

కాశ్మీరీ పండిట్లు ఉన్న ఊళ్లు వదిలేవారు కాదు;

అంజయ్యకు అవమానం జరిగి ఉండేది కాదు;

ఎన్ టీ ఆర్ ను అప్రజాస్వామికంగా గద్దె దించేవారు కాదు…

అగర్ కాంగ్రెస్ న హోతీ…ఇంకా ఇలాగే ఎన్నో అనర్థాలు జరిగి ఉండేవి కావు అని ప్రధాని పెద్ద లిస్టును పెద్దల సభలో పెద్ద గొంతుతో వినిపించారు.

కాంగ్రెస్ రాహుల్ గాంధీ పార్లమెంటు ఉపన్యాసం తొలిసారి కోట్ల మందిని ఆలోచింపజేయడం ప్రధాని కోపానికి కారణం. అసలే అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ. ఎక్కడయినా ఆచి తూచి మాట్లాడే మోడీ కాంగ్రెస్ ను తూర్పారబట్టే తొందరలో అనవసరంగా తెలుగు రాష్ట్రాల విభజన అంశాన్ని ప్రస్తావించి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు.

Modi Speech

అసలే తెలంగాణా మీద బి జె పి ఆశలు పెంచుకున్న వేళ. టీ ఆర్ ఎస్ కె సి ఆర్ మోడీపై కత్తి దూసి జాతీయ యుద్ధానికి నడుం బిగిస్తున్న వేళ. శంషాబాద్ విమానాశ్రయంలో ఉప్పు- నిప్పు కలవక ప్రధానికి ముఖ్యమంత్రి మొహం చాటేసిన వేళ.

విభజన అంశాన్ని లేవనెత్తి మోడీ కె సి ఆర్ నెత్తిన పాలు పోశారు. ఆయన కోరుకున్నది బహుశా ఇది కాకపోవచ్చు. కాంగ్రెస్ ను విలన్ గా చూపించే ఉక్రోషంలో తెలంగాణ బి జె పి కి నోట మాట పెగలకుండా చేశారు.

విభజన దెబ్బకు ఆంధ్రాలో ఇంకెన్ని తరాలయినా కాంగ్రెస్ లేవలేదు. ఆంధ్రా పొతే పోయింది… తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణాలో వెయ్యేళ్లు నిర్నిరోధంగా అధికారంలో ఉండవచ్చు అనుకున్న కాంగ్రెస్ కలను మొదటి రోజే కె సి ఆర్ ఒడుపుగా తుత్తునియలు చేశారు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తెలంగాణాలో దిక్కులు చూస్తోంది. దూకుడు రేవంత్ చుట్టూ కాంగ్రెస్ భూ స్థాపితానికి కాంగ్రెస్ పెద్దలే కృషి చేస్తుంటారు. కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి బి జె పి ని ప్రతిపక్షంగా బతికించే కె సి ఆర్ రెండంచుల కత్తికి ప్రస్తుతానికి తిరుగు లేదు. ఎం ఐ ఎం తో సెక్యులర్ ప్రేమ గీతాలు పాడుతూ…ముచ్చింతల యదాద్రుల్లో వైష్ణవ గీతాలు పాడే కె సీ ఆర్ రాజకీయ విశిష్టాద్వైతాన్ని మోడీ అమిత్ షా లు సరిగ్గా అంచనా వేస్తున్నట్లు లేరు.

అగర్ కాంగ్రెస్ న హోతీ… అని రాజ్యసభ సాక్షిగా కోరుకున్న ప్రధాని నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి కాదు. రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేసి ఎనిమిదేళ్లుగా ప్రధానిగా ఉన్న అంతర్జాతీయ నాయకుడు. కాంగ్రెస్ చేసిన తప్పులకు జనం కర్రు కాల్చి వాతలు పెట్టి శిక్షించారు. జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయబోయి…ఏదేదో చేసుకుని కాంగ్రెస్ తన చేత్తో తన మెడకే ఉరి వేసుకుంది.

తిరుపతి వెంకన్న పాదాల చెంత పవిత్ర ప్రమాణం చేసిన ప్రత్యేక హోదా హామీ ఎనిమిదేళ్లుగా ఏడుస్తూనే ఉంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన హామీలు కూడా ఎనిమిదేళ్లుగా ఏడుస్తూనే ఉన్నాయి. వీటిని అమలు చేయకుండా మోడీని అడ్డుకుంటున్న పెప్పర్ స్ప్రేలు ఏవున్నాయో? ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ పార్లమెంటు తలుపులు అర్ధరాత్రి మూసుకున్నాయో?

తల్లిని చంపి బిడ్డను బతికించే పార్టీ ఒకటి.
తల్లిని, బిడ్డను చంపే పార్టీ ఒకటి.
పిల్లికి కూడా భిక్షం పెట్టని పార్టీ ఒకటి.

అగర్ బి జె పి హోతీ…అనే కదా రెండుసార్లు గెలిపించారు. అగర్ మోడీ హువాతో…అనే కదా కూర్చోబెట్టారు. ప్రతిపక్షాల ఓట్లు ఎప్పటిలాగే చీలిపోతే ముచ్చటగా మూడోసారి కూడా మోడీ ప్రధాని అయ్యి రికార్డులు తిరగరాయవచ్చు.

Modi Speech

ఫిర్…అగర్…మత్…కుచ్…కింతు…పరంతు…ఉపసర్గలు, ప్రత్యయాలదేముంది? భాష నిండా ఉంటాయి. మాటంటే ఒక శబ్దం. ఒట్టి గాలి. మాటంటే నీటి మీద రాతలు. నిలకడ లేనివి.

ఒక పార్టీ మీద విద్వేషం కాస్త ఒక రాష్ట్రం మీద విద్వేషంగా మారుతుందని మోడీ అనుకుని ఉండరు. ప్రమాదో ధీమతామపి. ఎంతటివారయినా ఎప్పుడో ఒకప్పుడు తప్పులో కాలేస్తారు. కె సి ఆర్ కు ఉపయోగపడాలనే మోడీ ఈ పల్లవి శ్రుతి చేశారని కాంగ్రెస్ అంటోంది. ఎవరు ఎవరిని బలి పెట్టుకుంటూ ఎవరిని కాపాడుతున్నారన్నది కాలం మాత్రమే సమాధానం చెప్పగలిగే ప్రశ్న. వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా పనికివచ్చే తిరుగులేని అస్త్రాన్ని చేజేతులా ఇచ్చిన మోడీకి కె సి ఆర్ ఎంతయినా రుణపడి ఉండాలి!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

బడ్జెట్ ఎందుకు దండగ? మతం ఉందిగా దండిగా!

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్