Monday, April 15, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమునుగోడు పాఠం

మునుగోడు పాఠం

Munugode-Morals: విన్నర్ టేక్స్ అల్ అని గెలిచినవాడు అంతా ఊడ్చుకెళితే… ఓడినవాడికి ఏడ్చి…తుడుచుకోవడానికి తుండు గుడ్డ కూడా మిగలదు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఎవరెవరికి ఎలా అన్వయమవుతుందో కానీ…కుమిలి కుమిలి ఏడవాల్సింది మాత్రం కాంగ్రెస్. సిటింగ్ సీటు పోయింది. రెండో స్థానమయినా దక్కి ఉంటే పార్టీ వదిలి వేరే పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్న గోడ మీద పిల్లులు కొంతలో కొంత పార్టీ చూరు పట్టుకుని ఇంకొంత కాలం వేలాడుతూ ఉండేవారు. ఇప్పుడు వారికి రెండోస్థానంలో నిలబడిన బిజెపి, మొదటి స్థానంలో ఉన్న టిఆర్ఎస్ కన్ను గీటాల్సిన పనిలేకుండానే…పిలుస్తున్నట్లుగా కలలో కూడా వినిపిస్తూ ఉంటుంది.

గెలుపు గెలుపే. ఓటమి ఓటమే. ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఎంపి తొమ్మిది ఓట్ల తేడాతో గెలిచి పార్లమెంటుకు వెళ్లాడు. అలాంటిది 10,309 ఓట్ల మెజారిటీ అంటే టిఆర్ఎస్ కు మంచి గెలుపే. బిజెపి వ్యూహంలో లోపం ఉండి ఉండవచ్చు కానీ…మునుగోడులో గెలుపు అంచుదాకా వచ్చి…టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించడం భవిష్యత్ తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని చూపుతోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో బిజెపి- టిఆర్ఎస్ అమీ తుమీకి దిగుతాయి. రాజకీయ కోణంలో చూస్తే…ఈ ఓటమి బిజెపికి ఎన్నెన్నో పాఠాలు చెబుతోంది.

కెసిఆర్ తో తలపడాలంటే పూజలు చేసే యాజుళ్లను, భారతులను, నందులను, సంతోషులను ముందు బి జె పి నియంత్రించాలి.
కెసిఆర్ తో తలపడాలంటే షిండేలను సృష్టిస్తామని కొట్టే తొడలను కొంచెం తొడలను దాచుకోవాలని చెప్పాలి.
కెసిఆర్ కు అచ్చొచ్చిందని బిజెపి కూడా ఫార్మ్ హౌస్ ల వెంట తిరగకూడదని తెలుసుకోవాలి.
విభజన నాటి ప్రమాణాల మీద నిలబడి తెలంగాణ ప్రజల మనసులు ఎలా గెలవాలో తెలుసుకోవాలి.
ఒక్కో అభ్యర్థికి 18 వేల కోట్ల కాంట్రాక్టు ఇస్తే…మొత్తం ఎన్ని లక్షల కోట్ల కాంట్రాక్టులు…తమ తెలంగాణ అభ్యర్థులకు బి ఫారాల కంటే ముందు ఇవ్వాల్సి ఉంటుందో ఆ సున్నాల మీద బిజెపికి ఒక క్లారిటీ ఉండాలి.

 Munugode Bypoll

టిఆర్ఎస్ కు ఈ గెలుపు గొప్ప ఊరట కావాలి. అయితే గుళ్లో పూజలు చేసే వారే పసుపు బట్టలు కట్టుకుని ఫార్మ్ హౌస్ కుట్రలు చేయగలిగితే…ఈ ఓటమి ఉక్రోషంతో వారి వెనుక ఉన్నవారు ఇక ఎన్నెన్ని ఫార్మ్ హౌసుల్లో దిగుతారో అన్న భయం మాత్రం వెంటాడుతోంది. బోడి ఈడిలతో ఏమి పీక్కుంటారో పీక్కోండి! అన్న పిలుపులు బహిరంగసభల్లో బాగానే ఉన్నా…ఢిల్లీ లిక్కర్ చుక్కలు చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. చిన్నా పెద్దా వికెట్లు పడి…కటకటాల వెనక్కు వెళుతూనే ఉన్నాయి.

“ధర్మం ఎప్పటికయినా గెలుస్తుంది. కానీ గెలిచినదంతా ధర్మం కావచ్చు… కాకపోవచ్చు” అన్న అర్థమయి…అర్థం కానట్లున్న సామెతను ఓడిన అభ్యర్థి షరా మామూలుగా మునుగోడులో కూడా వినిపించారు. ఓడినా నైతిక విజయం తనదే అన్నారు. ఓటమిలో గెలుపును వెతుక్కోవడమే ఇలాంటప్పుడు తక్షణ కర్తవ్యం. నైతిక సూత్రాలకు నిర్వచనం ఎవరూ అడగరు. అడిగినా చెప్పరు. చెప్పినా అర్థం కాదు కాబట్టి వదిలేయడమే మంచిది.

 Munugode Bypoll

ఇంతకూ-
మునుగోడు ఉప ఎన్నిక ఎందుకొచ్చినట్లు?
టిఆర్ఎస్ ను సుస్థిరపరచడానికి బిజెపి ఇంత రిస్క్ తీసుకుందా?

రాజకీయాల్లో హత్యలుండవు.
ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి.

మునుగోడులో-
ఎవరు ఎవరిని గెలిపించారు?
ఎవరు ఎవరిని ఓడించారు?
ఎవరు ఎవరిని గేలి చేశారు?

ఎవరిది అతి నమ్మకం?
ఎవరిది ఆత్మ హత్య?
ఓ మహాత్మా!
ఓ మహర్షీ!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ప్రజాస్వామ్య ప్రథమా విభక్తి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్