Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకలగన్నారు... నిజం చేశారు

కలగన్నారు… నిజం చేశారు

వసుంధర ఒక సాధారణ గృహిణి. భర్త వ్యాపారవేత్త. అయినా అన్ని ఖర్చులకూ ఆయన్ని అడగడం నచ్చలేదు. అయిదువేల రూపాయలతో వాసవి ప్రింట్స్ ప్రారంభించి బ్లాక్ ప్రింట్ చీరలు అమ్మడం ప్రారంభించారు. అప్పుడే పరిచయమయ్యారు నచికేతానంద పురి స్వామిజీ. ఆయన సూచనపై అంతా మహిళలనే సిబ్బందిగా నియమించారు వసుంధర. వారంతా కూడా ఏ ఆసరాలేని పేద మహిళలు. అప్పటినుంచి వాసవి ప్రింట్స్ మహిళలకు ప్రియమైన నేస్తం అయింది. ఆర్థికంగానూ నిలదొక్కుకుంది. ఇక్కడ పనిచేసే మహిళల స్వావలంబనకు తోడ్పడింది. స్వామిజీ సహాయం లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదంటారు ‘వసుంధర మా’. స్వామిజీ యే మొదట ఆమెను మా అని పిలిచారు. అమ్మలానే గౌరవిస్తారు. అప్పటినుంచీ అందరికీ ఆమె అమ్మగానే తెలుసు. స్వామిజీ పరిచయం వసుంధర మా ను సమాజసేవకు పురికొల్పింది.

నచికేత తపోవన్:
పుట్టింది మహారాష్ట్రలో అయినా చిన్నవయసులోనే ఇంటినుంచి వచ్చేశారు విశ్వదీప్. చదువు ఆపలేదు. బీఎస్సి చదివి పేద పిల్లల కోసం పనిచేసేవారు. వివేకానంద కేంద్రంలో వసుంధరని కలిశారు. ఎటువంటి సౌకర్యాలూ కోరుకోకుండా తనకంటూ ఏమీ ఆశించకుండా పేదపిల్లల కోసం విశ్వదీప్ చేస్తున్న కృషి వసుంధరను కదిలించింది. ఆయన సేవకు తానూ తోడయ్యారు. ఆ తర్వాత విశ్వదీప్ సన్యాస దీక్ష తీసుకుని నచికేతానంద పురి స్వామిజీ అయ్యారు. అప్పటినుంచి ఆయన చెప్పినట్టు అమ్మ, అమ్మకు సహాయంగా స్వామిజీ ఎన్నో సత్కార్యాలకు శ్రీకారం చుట్టారు. నిరుపేదల పిల్లలకు చదువు చెప్పాలన్న స్వామిజీ ఆలోచనకు వసుంధర, ఆమె స్నేహితులు అండగా నిలిచారు. పేదల కోసం హెల్త్ క్యాంపులు, వారి పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సమ్మర్ క్యాంప్స్ నిర్వహించేవారు.

మొదట్లో రోడ్ల పక్కన కొనసాగినా కొన్నాళ్ళకు హైదరాబాద్ కావూరి హిల్స్ లో ఉన్న సొంత స్థలంలో పాక వేసి పేదపిల్లల కోసం నచికేత తపోవన్ పేరిట స్కూల్ ప్రారంభించారు. పుస్తకాలు, పెన్నుల నుంచి యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం వరకు పిల్లలకు అన్ని సౌకర్యాలు సమకూర్చేవారు. అలా 60 మంది పిల్లలతో 2001 లో ప్రారంభమైన పాఠశాలలో ఇప్పుడు 280 మంది పిల్లలున్నారు. దాతల సహకారంతో అన్ని సౌకర్యాలతో రెండంతస్తుల భవనం నిర్మించారు. ఈ పనులన్నీ స్వామిజీ స్వయంగా చూసుకుంటారు. మా తన ఆదాయాన్ని, సమయాన్ని ఇతరుల సహాయాన్ని వెచ్చిస్తున్నారు. వీటన్నిటి వెనుకా వసుంధర భర్త సూర్యనారాయణ రెడ్డి సహకారం, తోడ్పాటు ప్రశంసనీయం. చాలా కొద్దికాలంలోనే ఈ పాఠశాల చిత్తశుద్ధి, పిల్లలకు విలువలతో కూడిన విద్య అందించడం చూసి ఎందరో స్వచ్ఛందంగా సేవలందించడానికి ముందుకొచ్చారు. ఇక్కడ చదివే పిల్లల క్రమశిక్షణను మెచ్చుకోవాలి. స్వామిజీ ఏర్పాటు చేసిన నియమాలు ప్రతి ఒక్కరూ పాటిస్తారు. వంట చేయడం నుంచి కార్ నడపడం వరకు అన్ని పనులూ నేర్చుకుంటారు. కష్టంగా కాక ఇష్టంగా ఇక్కడ చదువుకున్న పిల్లలు కాలేజీ చదువులు కూడా పూర్తిచేసుకుని చక్కగా స్థిరపడుతున్నారు.

280విద్యార్థులున్న ఈ విద్యావనం ఇప్పటివరకు ప్రభుత్వ సాయం అర్థించలేదు. దాతలే అన్నీ సమకూరుస్తున్నారు. ఏనాడూ ప్రచార ఆర్భాటాలకు కూడా పోలేదు. ఏ ఫీజులూ తీసుకోకుండా పిల్లలకు విద్య అందిస్తుంటే లక్షల్లో పన్ను చెల్లించాలని నోటీసు వచ్చిందని వాపోయారు వసుంధర. కొందరు సహృదయులైన అధికారుల సహాయంతో ఈ సమస్య అధిగమించేలా ప్రయత్నిస్తున్నామన్నారు మా. ఇక్కడితో ఆగిపోలేదు. మరో మహత్కార్యానికీ పూనుకున్నారు స్వామిజీ. ఆయన ఆశయాన్ని సుసాధ్యం చేశారు వసుంధర మా బృందం. ఆ విశేషాలు మరోసారి తెలుసుకుందాం.

నచికేత తపోవన్ ఫోన్ నంబర్స్:-
99890 64499
80088 82828

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్