Pride of Telugu: తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు. ఆయన శత జయంతి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ శత జయంతి ఉత్సవాలను ఆయన జన్మస్థలం నిమ్మకూరులో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఈ వేడుకలను మే 28న నందమూరి బాలకృష్ణ ప్రారంభించనున్నారు. మే 28 నుంచి వచ్చే ఏడాది అంటే 2023 మే 28 వరకు వేడుకలను ఏడాది పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ‘శత పురుషుని శత జయంతి ఉత్సవాలు’ పేరిట ఓ లేఖను విడుదల చేశారు.
అభిమానులకు.. తెలుగునేలకు.. విశ్వవ్యాప్తంగా వెలుగులీనుతున్న తెలుగుజాతికి.. నందమూరి బాలకృష్ణ నమస్సుమాంజలి..
మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు. భారతీయ సినిమా తెలుగుసినిమాని తలఎత్తి చూసింది. తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు సంస్కృతి తలఎత్తి నిలబడింది. ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది. ఆ రోజు నుంచి, 2023 మే 28 వరకు, 365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచేరగులా జరుగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది. ఆనందంలో పాలుపంచుకుంటుంది.
మా కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారు. అందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం మా స్వస్థలం నిమ్మకూరు వెళ్ళి, అక్కడి వేడుకలలో పాల్గొంటాను. వందేళ్ల క్రితం మా నాన్నగారిని జాతికందించింది నిమ్మకూరు కనుక అది నా బాధ్యత. అక్కడి నుంచి కళలకాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలి చేరుకుంటాను. అక్కడ జరిగే శతాబ్ది వేడుకలను నా చేతులమీద ప్రారంభిస్తున్నాను. 365రోజులు వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు.. నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు.. ఈ మహత్కార్యాన్ని పెమ్మసాని(రామకృష్ణ) థియేటర్ లో ప్రారంభించి, ఒంగోలు వెళ్ళి మహానాడులో పాల్గొంటానని తెలుగుజాతికి తెలియజేస్తున్నాను.
అహర్నిశలు మీ అభిమానం కోసం
మీ
నందమూరి బాలకృష్ణ