న్యూజిలాండ్-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టి20 మ్యాచ్ లో కివీస్ 13 పరుగులతో విజయం సాధించింది. ఓపెనర్ కాన్వే, కెప్టెన్ విలియమ్సన్, నీషమ్ బ్యాటింగ్ లో రాణించగా, మిచెల్ శాంట్నర్ బౌలింగ్ లో సత్తా చాటాడు. మూడు టి20లు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు కివీస్ జట్టు వెస్టిండీస్ లో పర్యటిస్తోంది. జమైకా, కింగ్ స్టన్ లోని సబీనా పార్క్ మైదానంలో జరిగిన తొలి టి 20లో విండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
కివీస్ తొలి వికెట్ కు 62 (గుప్తిల్-16) పరుగులు చేసింది. మరో ఓపెనర్ కాన్వే 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43; విలియమ్సన్ 33 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లతో 47 పరుగులు చేశారు. చివర్లో నీషమ్ ధాటిగా ఆడి కేవలం 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
విండీస్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ మూడు; హోల్డర్, మెక్ కాయ్ చెరో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 14 పరుగులకే తొలి వికెట్ (కేల్ మేయర్స్-1) కోల్పోయింది. మరో ఓపెనర్ షమ్రా బ్రూక్స్ 42; జేసన్ హోర్దర్-25 పరుగులు చేసి ఔటయ్యారు. చివర్లో రోమానియో షెఫర్డ్ -31; ఓడియన్ స్మిత్-27 పరుగులతో ధాటిగా ఆడినా పరాజయం తప్పలేదు. 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 172పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ బౌలర్లలో శాంట్నర్ మూడు; సౌతీ, బోల్ట్, ఫెర్గ్యుసన్, సోది తలా ఒక వికెట్ సాధించారు.
మూడు కీలక వికెట్లు తీసిన కివీస్ బౌలర్ మిచెల్ శాంట్నర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.