Saturday, November 23, 2024
Homeసినిమా‘అఖండ’ అఖండమైన విజయాన్ని సాధించాలి : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

‘అఖండ’ అఖండమైన విజయాన్ని సాధించాలి : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

హైద్రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో శనివారం జరిగిన అఖండ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.


దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘బోయపాటి గారికి థ్యాంక్స్. ఈ ఆడిటోరియంకే కాకుండా.. మొత్తం ఇండస్ట్రీకి ఊపును తీసుకొచ్చారు. డిసెంబర్ 2 నుంచి అన్ని థియేటర్లు, అరుపులు కేకలతో నిండిపోవాలి. మాకు ఇప్పుడు ఎంత ఆనందం వచ్చింది.. తెలుగు వాళ్లందరికి అదే ఆనందం రావాలి.. రావాలి కాదు.. కచ్చితంగా వస్తుంది అని చెబుతున్నాను. బాలయ్య బాబు ఒక ఐటమ్ బాంబు.. ఎలా ప్రయోగించాలో శ్రీనుకు తెలుసు. ఆ సీక్రెట్ ఎంటో శ్రీను చెప్పాలి. బాలయ్య బాబు కూడా ఎనర్జీ సీక్రెట్ చెప్పాలి. ఇప్పుడు మనం చూసింది మచ్చు తునకే. సినిమాలో ఇలాంటివి బోలెడు ఉంటాయి. ‘అఖండ’ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్‌లో చూస్తాను. అఖండ చాల పెద్ద హిట్ అవ్వాలి. ఇండస్ట్రీకి కొత్త ఊపును తీసుకురావాలి. తమన్ మంచి సంగీతాన్ని అందించారు. నిర్మాతకు అందరికి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు వచ్చినందుకు బన్నీ, రాజమౌళికి థాంక్స్. ఇండస్ట్రీకి శివుడి లాంటి మనిషి బాలయ్య. బాలయ్య ఎంతో ఆధ్యాత్మికం. లాస్ట్ 48 రోజులు అఖండ కోసమే పని చేస్తున్నాను. కాశీకి వెళ్లిపోయిన ఫీలింగ్ వచ్చింది. బాలయ్య ట్రాన్స్‌ ఫార్మర్ అయితే.. ఆయనకు కరెక్ట్ వోల్టెజ్ కరెంట్ ఇచ్చేది బోయపాటి. నేను నా కెరీర్‌లో చేసిన ఫస్ట్ సినిమా భైరవ దీపం. అప్పుడు నాకు పన్నెండేళ్లు. అప్పుడు నాకు 30 రూపాయలు ఇచ్చారు. అఖండ సంగీతం అందించినందుకు రుణపడి ఉన్నాను. నాకు దేవున్ని చూస్తున్నట్టే ఉంది. ఇంకా అఖండ ట్రాన్స్‌ లోనే ఉన్నాను. థియేటర్‌లో సినిమా చూసేటప్పుడు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. పెద్ద ఎన్టీఆర్ పనిచేసిన ఇండస్ట్రీలో మేము ఉన్నందుకు గర్వపడుతున్నాం’ అని అన్నారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నందమూరి అభిమానులకు, నా అభిమానులకు అందరికీ అభినందనలు. నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. నందమూరి, అల్లు ఫ్యామిలీకు ఉన్న బంధం ఇప్పటిది కాదు. ఈ నాటి ఈ బంధం ఏనాటిదో. మా తాత గారు ఎన్టీఆర్ గారి వంటింటికి వెళ్లేవారు. అంత‌టి అనుబంధం ఉంది. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగాం. అలాంటి వారి సినిమాలకు నేను ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉంది. ఆయన నాకు తండ్రిలాంటి వారు. బోయపాటి గారి సినిమా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఆయనతో నేను భద్ర సినిమా చేయాలి.. కానీ అప్పుడు ఆర్య సినిమా కోసం వెళ్లాను.. అప్పుడే బోయపాటి గారు పెద్ద దర్శకుడు అవుతారని నాకు నమ్మకం ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్.. అక్కడి నుంచి స్టార్ డైరెక్టర్ వరకు ఎదిగారు. మీ జర్నీ చూశాను.. మనతో స్టార్ట్ అయిన వ్యక్తి ఈ స్థాయికి రావడం ఆనందంగా ఉంది.

నేను పైకి వెళ్తుంటే కూడా బోయపాటి గారు ఆనందిస్తుంటారు. మంచి సినిమా కాదు.. మెట్టు ఎక్కే సినిమా చేయాలి అనేవారు. అలానే నాతో సరైనోడు అనే సినిమాను తీశారు. బాలయ్య బోయపాటి కాంబోలో సినిమా గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ట్రైలర్ చూశాను. పూనకాలు వచ్చేలా ఉంది. తాండవంలా ఉందని తమన్ అన్నాడు. తమన్ మామూలు ఫాంలో లేడు.. ముట్టుకుందల్లా బంగారం.. కొట్టిందల్లా సిక్సర్ అవుతోంది. చిత్రం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అఖండమైన హిట్ సాధించాలి. ఓ సినిమాను ఇన్ని రోజులు ఆపారంటే.. అది ఎంత కష్టమో నాకు తెలుసు. ప్రగ్యా జైస్వాల్ గురించి నాకు బాగా తెలుసు. ఎంతో మంచి నటి. ఆమెకు ఈ సినిమా బూస్ట్ ఇస్తుంది. శ్రీకాంత్ అన్నయ్య మనసు ఎంతో మెత్తనైంది. ఈయన ఒక విలన్ కారెక్టర్ ఎలా వేయగలరు అని అనుకున్నాను. కానీ బోయపాటి గారు మార్చేశారు.


ఇకపై కొత్త శ్రీకాంత్‌ను చూడాలని కోరుకుంటున్నాను.. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌ కు పేరుపేరునా ఆల్ ది బెస్ట్. బాలకృష్ణ గారికి ఈ లెవెల్‌లో ఉండటానికి రెండు కారణాలు. ఒకటి.. ఆయనకు సినిమా మీదున్న ప్యాషన్. రెండోది ఆయన వాచకం.. ఆయనలా డైలాగ్ చెప్పేవారు ఎవ్వరూ లేరు. రెండు మూడు పేజీల డైలాగ్స్ చెప్పినా అదే ఇంటెన్సిటీ ఉంటుంది. ఈ డిక్షన్ అనేది మహానుభావులు ఎన్టీఆర్ గారి వల్లే కుదిరింది. ఆ తరువాత కేవలం బాలయ్య గారే చెప్పగలరు. రీల్‌లో అయినా రియల్‌లో అయినా.. ఆయన రియల్‌గానే ఉంటారు. కోపం వస్తే కోపం.. ప్రేమ వస్తే ప్రేమ.. ఎప్పుడూ రియల్‌గానే ఉంటారు. మనం అనుకున్నది చేయగలగడం, అనుకున్నట్టు ఉండటం చాలా కష్టం. కానీ బాలయ్య గారు అలా ఉంటారు. నాకు పర్సనల్‌గా ఆయనలో ఇష్టమైంది అదే. మనిషి మనసులో ఏం పెట్టుకోకుండా ఇలా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడో అని అనుకునే వాడిని.. అందుకే ఆయనకు ఇంత ఫ్యాన్ బేస్ వచ్చిందేమో అని అనుకున్నాను. నాకు చాలా పర్సనల్‌గా నచ్చిన విషయం అది. అఖండమైన విజయాన్ని సాధించాలి.. చిన్న సినిమాల మీద చాలా మందికి సింపతి ఉంటుంది. వారికి ఓటీటీలున్నాయి. కానీ పెద్ద సినిమాలకు వచ్చిన కష్టం మామూలు విషయం కాదు.

ప్రస్తుతం అంతా కూడా సినిమా గెలవాలని అంటున్నారు. సెకండ్ వేవ్ తరువాత విడుదలవుతున్న పెద్ద సినిమా ఇది. అఖండ జ్యోతిలా తెలుగు సినిమాకు వెలుగునివ్వాలని అందరం కోరుకుటున్నాం.. ఈ ఉత్సాహాన్ని ఇలానే కొనసాగిస్తూ.. మరో రెండు వారాల్లో రాబోతోన్న పుష్ప ఆ తరువాత రాబోతోన్న ఆర్ఆర్ఆర్..అలా ముందుకు వెళ్లాలి..ఇండస్ట్రీ గెలవాలి.. నన్ను ఇలా పిలిచినందుకు అందరికీ థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులు సినిమాలను ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించరు. కోవిడ్ వచ్చినా.. పైనుంచి దేవుడు వచ్చినా.. తెలుగు ప్రేక్షకులు.. సినిమా తగ్గేదే లే.. మీ అందరి కోసం జై బాలయ్య ’ అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్