Tuesday, March 19, 2024
HomeTrending NewsPakistan:పాకిస్థాన్‍లో సబ్సిడీతో పెట్రోలు,డీజిల్

Pakistan:పాకిస్థాన్‍లో సబ్సిడీతో పెట్రోలు,డీజిల్

తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‍లో పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయి. తక్కువ ఆదాయం ఉన్న వారు వాహనాలను బయటికి తీయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. దేశంలోని ధనికులకు పెట్రోల్ ధరలను పెంచింది. దీని ద్వారా పేదలకు సబ్సిడీతో అందివ్వనుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ పెట్రోలియమ్ శాఖ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్.. డాన్‍ మీడియా సంస్థతో చెప్పారు. పేదలకు పెట్రోలియం ప్రొడక్టులు రూ.100 సబ్సిడీతో అందిస్తామని అన్నారు.

సంపన్నుల నుంచి లీటర్‌పై రూ.100 అదనంగా వసూలు చేయనున్నట్టు ముసాదిక్ వెల్లడించారు. దీని ద్వారా పేదలకు తక్కువ ధరకు పెట్రోల్‍ను సబ్సిడీతో అందిస్తామని అన్నారు. “తక్కువ ఆదాయం ఉన్న ప్రజలకు పెట్రోలియం ఉత్పత్తులను సబ్సిడీకి అందించేందుకు ధనికులు చెల్లించే అదనపు ధర నిధులను వినియోగిస్తాం” అని ఆయన చెప్పారు. దీంతో పాకిస్థాన్‍లో సంపన్నులు పెట్రోలియం ఉత్పత్తుల కోసం లీటరుకు రూ.100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

బడ్జెట్ బైక్‍లు, రిక్షాలు, చిన్నస్థాయి కార్లు ఉన్న తక్కువ ఆదాయం ఉన్న వారికి సబ్సిడీలో పెట్రోలియమ్ ప్రొడక్టులను ఇవ్వాలని పాకిస్థాన్ సర్కార్ నిర్ణయించింది. లగ్జరీ కార్లు, లగ్జరీ బైక్స్ సహా ఖరీదైన వాహనాలు ఉన్న ధనికుల నుంచి అదనపు ధరలు వసూలు చేయనుంది. ఈ విషయాన్ని పాక్ మీడియా సంస్థ డాన్ రిపోర్ట్ చేసింది.

పాకిస్థాన్‍లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.272 (అక్కడి రూపాయి), డీజిల్ ధర రూ.293గా ఉంది. ఈనెల 16వ తేదీన అక్కడ ధరలు పెరిగాయి. ఆ దేశంలో కిరోసిన్ ధర రూ.190.29గా ఉంది. అయితే పాకిస్థాన్ తాజా నిబంధనతో ధనికులు ఇప్పటి నుంచి లీటర్‌ పెట్రోల్‍కు రూ.100 అదనంగా చెల్లించాలి. తక్కువ అదాయ వర్గాలకు రూ.100 సబ్సిడీతో పెట్రోల్ లభిస్తుంది.

ఈ విధానాన్ని పాక్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తీసుకొచ్చింది. రానున్న ఆరు వారాలు ఈ పెట్రోలియం రిలీఫ్ ప్యాకేజ్ పద్ధతి ఉంటుందని డాన్ పేర్కొంది. కాగా, గతంలో గ్యాస్ ధరల విషయంలో ఇలాంటి విధానాన్ని పాక్ ప్రభుత్వం అమలు చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్