ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమకు అభ్యంతరం లేదని, జగన్ నాయకత్వంలో తాము ఒంటరిగా అందరినీ ఎదుర్కొని విజయం సాధిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరా రావు ధీమా వ్యక్తం చేశారు. కాపు జాతిని అవమానించిన చంద్రబాబును పవన్ ఎందుకు మోస్తున్నారని కారుమూరు ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ కాల్‌షీట్ ముగిసిందని అందుకే హైదరాబాద్ వెళ్ళి పోయారని మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖ గర్జనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, అందుకే విశాఖ ఎయిర్ పోర్ట్ లో జనసేన కార్యకర్తలు తమ పార్టీ మంత్రులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రి రోజా వెంట్రుక వాసిలో ఈ దాడి నుంచి తప్పించుకున్నారన్నారు.
నిన్నటి వ్యాఖ్యల పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇస్తున్నారని, యువతకు మంచి మాటలు చెప్పాల్సింది పోయి…దాడి చేయమని రెచ్చగొడతారా? హాకీ స్టిక్ లు, రాడ్ లు తీసుకొని దాడికి పాల్పడమని చెబుతారా అని కారుమూరి నిలదీశారు. పవన్ ఇప్పటివరకూ ఎంత మందికి తాట తీశారో చెప్పాలని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలం ప్రజలనుంచి ఎన్నికయ్యామని, మమ్మల్ని కొడితే రాష్ట్ర ప్రజలను కొట్టినట్లేనని… అంటే ప్రజలు మీకు ఓట్లు వేయలేదు కాబట్టి మీరు కొడతారా అంటూ పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో రాష్ట్ర ప్రజల పైనే దాడి చేసే స్థాయికి వెళ్ళారరన్నారు. బాబు-పవన్ ల మధ్య ఇప్పటి వరకు ఉన్న ముసుగు నిన్నటి నోవాటెల్ మీటింగ్ తో తొలిగిందని, ప్యాకేజీ, దత్త పుత్రుడు అన్న మాటలను నిజమే అని పవన్ స్పష్టం చేశారన్నారు.
తన అన్న చిరంజీవిని చేతులు కట్టుకుని నిల్చునేలా చేశారంటూ పవన్ సిఎం జగన్ పై గతంలో విమర్శలు చేశారని, కానీ నిన్న చంద్రబాబు ముందు చేతులు కట్టుకొని నిల్చున్నది మీరు కాదా అంటూ ఫోటోను మీడియాకు మంత్రి కారుమూరి చూపించారు.
Also Read : వెధవల్లారా…: వైసీపీ నేతలపై పవన్ నిప్పులు