Meter Politics: వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించడంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, రైతులు వ్యవసాయానికి వినియోగించిన ప్రతి యూనిట్ కు ప్రభుత్వమే సబ్సిడీగా చెల్లింపులు చేస్తుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. దీనికి గాను రైతుల పేరుమీద రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల్లో ఖాతాలను ప్రారంభించాలని , వారి వ్యవసాయ కనెక్షన్ కోసం వినియోగించిన విద్యుత్ కు అయ్యే వ్యయంను ప్రభుత్వం నేరుగా డిబిటి విధానంలో వారి ఖాతాల్లోనే జమ చేస్తుందని అన్నారు. ఈ సొమ్మును రైతులు డిస్కం లకు చెల్లిస్తారని, దీనివల్ల డిస్కం ల జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని, వాటికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను త్వరతగతిన ప్రారంభించాలని, అందుకు డిస్కం అధికారులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నిర్ధేశించిన గడువు నాటికి రాష్ట్రం అంతా కూడా కొత్త మీటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయంలో సోమవారం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ … విద్యుత్ మీటర్ల ఏర్పాటు వల్ల వ్యవసాయానికి నికరంగా రైతులు ఎంత మేరకు విద్యుత్ ను వినియోగించుకుంటున్నారో ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయని అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా 28వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లకు మీటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇదే జిల్లాలో 26వేల వ్యవసాయ కనెక్షన్ లకు గానూ 101.51 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించుకున్నారని డిస్కంలు లెక్కలు వేశాయని తెలిపారు. దాని ప్రకారం విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. అయితే ఇదే జిల్లాల్లో విద్యుత్ మీటర్లను భిగించిన తరువాత 2021-22 ఆర్థిక సంవత్సరానికి 28వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లకు గానూ 67.76 మినియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించినట్లు నిర్థిష్టంగా గుర్తించడం జరిగిందని అన్నారు. అంటే మీటర్లు భిగించడం వల్ల నికరంగా ఎంత విద్యుత్ ను వ్యవసాయం కోసం వినియోగిస్తున్నారో తేలిందని, గత ఏడాదితో పోలిస్తే రెండు వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ తక్కువగానే వినియోగించినట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఈ మేరకు మాత్రమే ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని డిస్కం లకు చెల్లించిందని, దీనివల్ల ప్రభుత్వం వినియోగించకపోయినా కూడా సరైన లెక్కలు తేలకపోవడం వల్ల ఇప్పటి వరకు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పేరుతో చేస్తున్న అదనపు చెల్లింపులకు చెక్ పెట్టడం జరిగిందని వివరించారు.
ముఖ్యమంత్రి జగన్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ ను మరింత నాణ్యత, మెరుగైన సరఫరాతో రైతులకు చేరువ చేయాలని ఆదేశించారని చెప్పారు. జగనన్న హౌసింగ్ కాలనీలు పూర్తయ్యి, గృహాల్లో లబ్ధిదారులు నివాసాలను ప్రారంభించే నేపథ్యంలో ఆ కాలనీల్లో విద్యుదీకరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్ కో జెఎండి ఐ. పృథ్వితేజ్, ట్రాన్స్ కో విజిలెన్స్ జెఎండి మల్లారెడ్డి, డైరెక్టర్ ఎవికె భాస్కర్, ఎన్ఆర్ఇడిసిఎపి ఎండి, రమణారెడ్డి, డిస్కమ్ సిఎండిలు హెచ్ హరనాథ రావు , జె పద్మ జనార్ధన రెడ్డి , కే.సంతోషరావు తదితరులు పాల్గొన్నారు.
Also Read : సాంకేతిక నష్టాలు నియంత్రించాలి: పెద్దిరెడ్డి