పట్టాభి అడిగిన ప్రశ్నలకే తట్టుకోలేక పిరికిపందల్లా దాడులకు పాల్పడ్డారని, రాబోయే రెండేళ్లలో ఇంకా అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రజా సమస్యలపై తాము ప్రశ్నిస్తే ఎవరూ లేని సమయంలో పార్టీ ఆఫీసులపై దాడులు చేశారని విమర్శించారు. ప్రజా ఉగ్రవాద దీక్షలో రామ్మోహన్ ప్రసంగించారు. మొన్న జరిగిన దాడి తెలుగుదేశం పార్టీ మీద జరిగిన దాడి కాదని, యావత్ తెలుగు జాతి మీద జరిగిన దాడిగా అయన అభివర్ణించారు.
కర్రకు జెండా కట్టి ఎగరేయడం ఎలా తెలుసో, అలాగే అదే కర్రతో గూండాల భరతం పట్టడం కూడా టిడిపి కార్యకర్తలకు తెలుసనీ, కానీ తమ అధినేత చంద్రబాబు నేర్పిన సంస్కృతి అది కాదని, సంస్కారంగా ఉండాలని, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని చెప్పారన్నారు. సిఎం జగన్ చేసిన బీపీ వ్యాఖ్యలను రామ్మోహన్ ప్రస్తావిస్తూ మీకు వైద్యం చేసే డాక్టర్ నారా లోకేష్ రూపంలో ఉన్నారని, రేపు అయన వచ్చిన తరువాత మీకు బీపీతో పాటు షుగర్, హార్ట్ ఎటాక్ లు కూడా రాబోతున్నాయని, రాసుకోవాలని సవాల్ చేశారు. దాడి జరిగిన తరువాత చంద్రబాబుకు సిఎం జగన్ ఫోన్ చేసి క్షమాపణ చెప్పి ఉంటే అయన గౌరవం పదింతలు పెరిగి ఉండేదని, కానీ ప్రెస్ మీట్ పెట్టి ‘నన్ను తిడితే మా పార్టీ కార్యకర్తలకు బీపీ పెరుగుతుందని’ సిఎం చెప్పడం సమంజసం కాదన్నారు.
తమ పార్టీకి 25 మంది ఎంపీలను ఇస్తే ఢిల్లీ మెడలు వంచుతానన్న జగన్ ఇప్పుడు అయినవాడికి, కానివాడికి అందరిముందూ తలలు వంచుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ లో ఒక్క వైఎస్సార్సీపీ ఎంపీ కూడా నోరు విప్పలేకపోతున్నారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ ఓట్లు అడిగిన జగన్ కు ఓటేసి అవకాశం ఇచ్చినందుకు మనచేతులతో మనమే రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నామని ప్రజలందరూ భావిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మార్పు ఖాయమని, అయితే ప్రజలకు ధైర్యం కల్పించాల్సిన అవసరం నాయకులుగా మనందరిమీదా ఉందని సూచించారు.