బుస మాటలు, సొల్లు మాటలు చెప్పడం పవన్ కళ్యాణ్ మానుకోవాలని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. వైసీపీకి చెప్పు చూపించానంటూ చెప్పుకుంటున్నాడని, మేము చూపించాలేమా చెప్పులు అంటూ, తన రెండు చెప్పులూ చూపించి పవన్ పై నిప్పులు చెరిగారు. ‘పవన్… మక్కెలిరిగి పోతాయ్’ జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. పవన్ ఒక చెప్పు చూపిస్తే తాము రెండు చెప్పులు చూపించ గలమన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాని నిన్న కంటిపూడిలో పవన్ వారాహి యాత్రలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. జన సేన పార్టీని నడుపుతున్నది తెలుగుదేశం పార్టీ అనేది చిన్న పిల్లగాడిని అడిగినా చెబుతారని అన్నారు.
నాయకులు బాధ్యతగా లేకపోతే చొక్కా పట్టుకొని నిలదీస్తానని చెప్పుకున్న పవన్ చంద్రబాబు చొక్కా, నరేంద్ర మోడీ గారి కోటు ఎన్నిసార్లు పట్టుకున్నారో చెప్పాలని నాని డిమాండ్ చేశారు. వంతాడలో లాటరైట్ గనులు చంద్రబాబు దోచుకున్నాడని గతంలో ఆరోపించిన ఆయన అప్పుడెందుకు నిలదీయలేదని నాని సూటిగా ప్రశ్నించారు.
వాస్తవానికి వారాహి అనే లారీకి ‘నారాహి’ అనే పేరు పెట్టుకోవాల్సి ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఆ లారీకి కొండగట్టులో, ఆ తర్వాత విజయవాడ కనక దుర్గమ్మ కు, నిన్న అన్నవరంలో పూజలు చేశారన్నారు. పవన్ ప్రసంగాలు ఆయనకే ఆశ్చర్యం వేయడంలో కొత్తేమీ లేదని,ఇంక ప్రజలకు ఆశ్చర్యం కలగడంలో తప్పేమీ లేదన్నారు.
గతంలో చంద్రబాబు నేనిచ్చిన రోడ్లు, నేనిచ్చిన పెన్షన్ అంటూ మాట్లాడినప్పుడు పవన్ ఎక్కడకు వెళ్ళారని పేర్ని నిలదీశారు. జనం సొమ్ము జనానికే జగన్ పంపుతున్నారని ఇదే విషయాన్ని ఆయన చెబుతున్నారని వివరించారు. ఆంధ్రా కొడకల్లారా అంటూ తెలంగాణా నేతలు మాట్లాడుతుంటే తనకు బాధగా ఉందని చెబుతున్న పవన్ తన జేబులో టిఆర్ఎస్ జెండా పెట్టుకొని తిరుగుతున్నారని, అక్కడి మంత్రి హరీష్ రావు ఏపీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆయనకు వత్తాసు పలికింది ఎవరు అంటూ పవన్ పై ధ్వజమెత్తారు. జగన్ సిఎం అయిన తర్వాత పవన్ తీసింది రెండు సినిమాలు మాత్రమేనని, ఈ సినిమాలు ఎవరు ఆపారో చెప్పాలన్నారు. సినిమాలు బాగుంటే ఆడతాయని, ఇక ప్రభుత్వమే బస్సులు పెట్టి సినిమాలకు జనాల్ని తోలాలా అని ఎదురుదాడి చేశారు.
ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకుంటా అని చెప్పడమేమితని, ఇది ఎవరైనా దానం ఇస్తారా అంటూ సూటిగా నిలదీశారు. ఏదీ తనంత తాను నీ దరికి రాదు, శోధించి సాధించాలంటూ శ్రీ శ్రీ చెప్పిన పంక్తులను ప్రస్తావిస్తూ సిఎం జగన్ ముఖ్యమంత్రి పదవిని సాధించారని నాని వివరించారు. ప్రజల్ని నమ్ముకుంటే అసెంబ్లీకి వెళతారు కానీ, వ్యూహాలు నమ్ముకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరని, ఇది తెలుసుకుంటే మంచిదన్నారు.