Monday, March 4, 2024
HomeTrending Newsసీడ్ బాల్స్ తో గత రికార్డు తిరగరాస్తాం - శ్రీనివాస్ గౌడ్

సీడ్ బాల్స్ తో గత రికార్డు తిరగరాస్తాం – శ్రీనివాస్ గౌడ్

చెదలు పట్టి కూలిపోయేం దశకు చేరుకున్న ఆసియాలోనే రెండో అతిపెద్ద పిల్లలమర్రిని సంరక్షించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. చెట్టుకే సెలైన్ బాటిళ్ల ద్వారా చికిత్స అందించి కాపాడుకోవడం వల్ల తిరిగి పిల్లలమర్రికి పూర్వ వైభవం రావడం గొప్ప విషయమని అందుకు కారణమైన అధికారులు, సిబ్బంది, తోటమాలులను అభినందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పిల్లలమర్రి చౌరస్తాలో రూ. 30 లక్షలతో తీర్చిదిద్దిన జంక్షన్ ను ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి ప్రారంభించిన అనంతరం పిల్లలమర్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలమర్రిని సంరక్షించేందుకు తీసుకున్న చర్యలపై ఎంపీకి మంత్రి వివరించారు.

అనంతరం వారు మీడియా ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం మొదలు పెట్టిన తర్వాతే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలుగా కురుస్తున్నాయని మంత్రి తెలిపారు. గత ఏడాది పచ్చదనం పెంచేందుకు సీడ్ బాల్స్ ద్వారా జిల్లా యంత్రాంగం కృషి చేసిందని తద్వారా గిన్నిస్ బుక్ రికార్డ్స్ కూడా సాధించామన్నారు. తెలంగాణకు హరితహారం స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని స్వయం సహాయక బృందాలు 10 రోజుల్లో 2.08 కోట్ల సీడ్ బాల్స్‌ను త‌యారు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాయని… ఈమారు ఆ రికార్డును అధిగమించబోతున్నామని మంత్రి తెలిపారు. పిల్లలమర్రిని ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షంగా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లలమర్రి సంరక్షణ కోసం ఎంపీ నిధుల నుంచి రూ. 2 కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన ఎంపీ సంతోష్ కుమార్ కు మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

800 ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రిని సంరక్షించేందుకు తన నిధుల నుంచి రూ.2 కోట్లను విడుదల చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు గ్రీన్ చాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఇంతటి పురాతన చరిత్ర ఉన్న వృక్షాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. పిల్లలమర్రిని సొంత పిల్లల్లా చూసుకున్న మంత్రిని ఆయన అభినందించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకుని పిల్లలమర్రి సంరక్షణకు నడుంబిగించడం అభినందనీయమని ఆయన తెలిపారు. చారిత్రాత్మక పిల్లలమర్రిని సంరక్షించేందుకు సెలైన్ బాటిల్లతో ట్రీట్మెంట్ చేయడం ఎంతో గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. ప్రతి వేరును కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ… తిరిగి ప్రాణం పోశారని తెలిపారు. ఒకప్పుడు ఎండిపోయే దశకు చేరుకున్న పిల్లలమర్రి మహావృక్షం నేడు పచ్చగా కళకళలాడుతుండడం సంతోషాన్నిస్తోందన్నారు.

కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, కలెక్టర్ వెంకట్ రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్, జిల్లాటవీశాఖాధికారి సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read : వైభవంగా కాకతీయ సప్తాహం ఆరంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్