Double plural:మంగళగిరి నుండి ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాసనసభలున్న తుళ్లూరుకు వెళ్లేదారిలో కొన్ని బోర్డులు చూసిన ప్రతిసారీ నన్ను వెంటాడుతుంటాయి.
మంగళగిరి ఎయిమ్స్ ఫ్లై ఓవర్ దాటి యర్రబాలెం ఊరి వీధి మూల మలుపులో గుడి గోడకు
“శ్రీ సీతారాముల స్వామి వార్ల దేవస్థానము” అని బోర్డు రాయించినవారు భక్తి, భాషా మర్యాదల మధ్య ఎటూ తేల్చుకోలేక… భక్తి వైపే మొగ్గినట్లున్నారు.
సాధారణంగా-
“శ్రీ సీతారామస్వామి దేవస్థానం”
అని ఉంటుంది. భాషలో సీతారాములు అంటే ఇద్దరు. బహువచనం నిజమే కానీ…భక్తిలో సీతారాములను వేరు చేసి చూడకూడదు అంటుంది శాస్త్రం.
“నమోస్తు రామాయ సలక్షణాయ,
దేవ్యైచ తస్యై జనకాత్మజాయై,
నమోస్తు రుద్రేన్ద్రయమానిలేభ్యో,
నమోస్తు చన్ద్రార్కమరుద్గణేభ్యః”
హనుమంతుడన్న ఈ మాటను వాల్మీకి మనకు చెప్పడంలో ఉద్దేశం- మనం కూడా లక్ష్మణుడు, సీతతో ఉన్న రాముడినే దర్శించాలి– అని.
శ్రీ సీతారామస్వామి దేవస్థానం అని అంటే ఒక రాముడికే ఆలయం అని కానీ, సీతమ్మకు ప్రాధాన్యం ఉండదని కానీ అనుకునే ప్రమాదం ఉందని ఈ బోర్డు రాయించినవారు భావించి ఉంటారు. పక్కన విడిగా “ఆంజనేయస్వామి వారి దేవస్థానం” ఇంకో బోర్డు కూడా ఉంది.
“శ్రీ సీతారాముల దేవస్థానం” అంటే “వారి”, “స్వామిత్వం” రెండూ జారిపోతాయి. అది అమర్యాద కావచ్చు. సీతారామ అంటే ఒకరే అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి-
శ్రీ సీతారాముల మధ్యలో స్వామి చేర్చి నామవాచకంలో ఉన్న బహువచనాన్ని చెప్పే “వార్ల” (దాని పూర్వ రూపం వారల) పెట్టి…మొత్తం మీద- “శ్రీ సీతారాముల స్వామి వార్ల దేవస్థానం” అని చదవడానికి ఇబ్బంది అయినా…వ్యాకరణ విరుద్ధమయినా…నామకరణం చేసి ఉంటారు. బహుశా అక్కడే ఆంజనేయస్వామి గుడి వేరుగా ఉన్నట్లుంది. “శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం” అంటే సమాసం ప్రకారం ముగ్గురు దేవుళ్లు శ్రీకరమై అక్కడున్నట్లు అక్షరాలా సరిపోయేది. అయితే ఆంజనేయుడి విగ్రహం విడిగా ఉంటే అలా ఎలా కలుపుతాం? విడిగా ఉన్నట్లు సూచించాలి కదా? అని పెద్ద ఆగమ శాస్త్ర చర్చ జరిగి ఉంటుంది. భయం లేని భక్తికి విలువ లేదంటారు. అందుకే భయభక్తులు విడదీయలేని ద్వంద్వ సమాసం అయ్యింది. ఇలాంటి భయంతో
“శ్రీ సీతారాముల స్వాముల వార్ల” అని రాసినా శ్రీరామ శ్రీరామ అనుకుని ముందుకు కదలడమే మంచిది!
బయట వ్యవహారంలో ఫలానా ….గారు, ఫలానా ….వారు అని గౌరవవాచకం వాడుతుంటాం. అలా సీతమ్మ, రాముడు, హనుమలకు కూడా వార్లు, వారి పెడుతున్న మన భాషా మర్యాదలకు ఆ మర్యాదా పురుషోత్తముడు పొంగిపోయి ఉండాలి.
మనుషుల మర్యాదలే దేవుళ్లకు కూడా వర్తింపజేస్తున్న మనల్ను
సీతమ్మవారు, ఆంజనేయస్వామి వారు, రాముల వారితో కలిసి తప్పకుండా రక్షిస్తారు.
“అతి పరిచయాత్…”, “పూర్వ విషయ ప్రసంగేన …” అని భాషలో ఒక ప్రమాణం ఉంది. బాగా పరిచయమయిన, ఇష్టమయిన వారిని ఏకవచనంతో పిలవడం పద్ధతి.
ఉదాహరణ:-
వాజపేయి ఎంత బాగా మాట్లాడాడో?
రామారావు భలే నటించాడు;
బాలు బాగా పాడాడు.
అలాగే బాగా పాతబడ్డ విషయాల్లో ఏకవచనమే వాడతాం.
ఉదాహరణ:-
కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రాశాడు. ( ఎంత గౌరవం ఉన్నా “రాశారు” అనం)
“రాముడు అడవికి వెళ్లాడు” అంటామే కానీ గౌరవం తక్కువవుతుందనుకుని “వెళ్లారు” అనం. ఇందులో దాగి ఉన్న భాషాపరమయిన సున్నితమయిన అంశాలు, వ్యవహార భాషా సంప్రదాయాలు, నియమాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ…అవి ఇక్కడ అనవసరం.
విజయవాడ దుర్గ గుడి పేరు కూడా
“శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం” అనే అనాదిగా వాడుకలో ఉంది. ఇద్దరు దేవుళ్లు వేరు వేరు కాబట్టి వ్యవహార భాషా సంప్రదాయమిది. “దుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం” అంటే మల్లేశ్వరస్వామికి దుర్గ విశేషణం అయి ఒక పేరే అవుతుంది. కాబట్టి దుర్గ, మల్లేశ్వర స్వామి వార్ల అని ఇద్దరున్నట్లు స్పష్టంగా తెలియడం కోసం ఎప్పటినుండో ఇలా అంటున్నారు. మనకోసం అవతరించిన దేవుళ్లను మన భాషా మర్యాదల చట్రంలోకే తెచ్చుకుంటాం.
ఇదివరకు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో చాలావరకు ఫలానా స్వామి దేవస్థానం అనే ఉండేది. ఇప్పుడు అక్కడ కూడా కోస్తా ప్రామాణిక భాష స్పర్శ తగిలి స్వామి “వారి” “వార్ల” దేవస్థానాలుగా మారాయి.
భూత భవిష్యత్ వర్తమాన-మూడు కాలాలకు;
స్త్రీ పుం నపుంసక- మూడు లింగాలకు;
ఏక, ద్వి, బహు- మూడు వచనాలకు
అతీతమైనవాడు భగవంతుడు అన్నది పోతన భాగవత విశాల దృష్టి.
ఆఫ్టర్ ఆల్ వార్డు మెంబరుకే గౌరవనీయ శ్రీ…గారు అని గౌరవిస్తున్నప్పుడు…
దేవదేవుడిని శ్రీ …వారు, వార్లు అని గౌరవించకపోతే ఎలా!
అద్వైత సాధనలోనే ఉంటాం. వేనవేల అద్వైత ప్రవచనాలు పరవశంగా వింటూ ఉంటాం. రెండు కాని ఒకటే పరబ్రహ్మం ఉందన్నది అకెడెమిక్ గా ఒప్పుకుంటాం. ఆచరణలో మాత్రం ఏ దేవుడికి ఆ దేవుడిని ద్వైతంగా విడి విడిగానే చూస్తాం. ఇది కూడా దేవుడి మాయ. లేదా లీల అయి ఉంటుంది- అంతే.
అచ్చ తెలుగు కట్టెల అడితి
మందడం ఊరి ముందు వీధి పక్కన ఒక కట్టెలమ్మే చోట రెండు తాటి చెట్లకు కట్టిన దుకాణం పేరు ఫ్లెక్సీ నాకు భలే నచ్చింది.
“కట్టెల అడితి” అని తాటికాయంత అక్షరాలు.
అడితి అన్న మాటకు వివిధ నిఘంటువులు చెబుతున్న అర్థాలివి:-
శబ్దరత్నాకరం :-
ఒక వర్తకుఁడు మఱియొకఁ డంపెడు సరకుల నమ్మి మరల వానికి సరకులుఁ గొనిపంపుటకై వానివద్ద నూటికింతయని పుచ్చుకొనెడి తఱుగు.
బ్రౌణ్య నిఘంటువు:-
Premium, commission. తరుగు. same as అడతి.
ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) : –
కలప అమ్మెడు చోటు.
ఆంధ్ర శబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) :-
తఱుగు – లాభము, అమ్ముటకై కఱ్ఱలు నిలువ చేసిన చోటు
తెలుగు వ్యుత్పత్తి పదకోశం (ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు) : –
1. కమీషను, రుసుం, తరుగు – సరుకులు అమ్మిపెట్టటానికీ ఇతరులవద్ద పుచ్చుకునే సొమ్మ;
2. కమీషను కొట్టు;
3. కలప దుకాణం.
4. పానుపు పట్టె, మరమగ్గంలో పన్నె బిగించిన కిందికొయ్య
శంకరనారాయణ తెలుగు-ఇంగ్లిష్ నిఘంటువు:-
1. commission, a percentage of allowance or brokerage received by an agent for transacting business for another;
2. a broker’s shop.
వావిళ్ల నిఘంటువు:-
1. ఇతరుల సరకులు అమ్మిపెట్టుటకును, వారికి కావలసినవి కొనిపెట్టిటకును ఏర్పఱచుకొనిన లాభము;
2. కఱ్ఱలు మొదలగు వాని నమ్ము చోటు. (“కఱ్ఱలయడితి.”)
పల్లెల్లో కట్టెల అడితి మాట వాడుకలో ఉన్నా…బోర్డుల మీద “అడితి” మాయమై-
“కర్రల దుకాణం
కట్టెల కొట్టు
కట్టెలు అమ్మబడును
కర్రల షాపు
స్వరి కట్టెలు అమ్మబడును”
లాంటి పేర్లే కనబడుతున్నాయి.
వ్యవసాయ, గ్రామీణ భాషలో వేనవేల అచ్చ తెలుగు పదాలు ఇంకా బతికి ఉండి…ఇలా అక్కడక్కడా కనిపిస్తున్నందుకు సంతోషించాలి.
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Also Read :