Wednesday, April 17, 2024
HomeTrending Newsరాజ్యసభకు ఆర్. కృష్ణయ్య!

రాజ్యసభకు ఆర్. కృష్ణయ్య!

BC Voice: బీసీ సంక్షేమ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ఇకపై రాజ్యసభలో తన గళం వినిపించ బోతున్నారు. ఆయన్ను పెద్దల సభకు పంపాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు.  ఆయనతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావు… అడ్వకేట్, సినీ నిర్మాత నిరంజన్ రెడ్డి లను కూడా అభ్యర్ధులుగా జగన్ ఎంపిక చేసినట్లు తెలిసింది  ఈ ముగ్గురితో పాటు ప్రస్తుతం వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న వి. విజయసాయిరెడ్డి కి  రెన్యువల్ లభించింది.  తాడేపల్లి నుంచి కృష్ణయ్యకు పిలుపు వచ్చింది. ఈ మేరకు అయన నేటి ఉదయం సిఎం జగన్ తో సమావేశమైనట్లు తెలిసింది.

రాష్ట్రం నుంచి నాలుగు రాజ్య సభ సీట్లు ఖాళీ అవుతుండగా  ఈ నాలుగూ అధికార వైసీపీకే దక్కనున్నాయి. విజయసాయిరెడ్డి, వైఎస్ చౌదరి, టిజి వెంకటేష్, సురేష్ ప్రభులు రిటైర్ కానున్నారు. ఈ ఖాళీల భర్తీ కోసం జూన్ 10న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

గౌతమ్ అదానీ లేదా అయన సతీమణి ప్రీతీకి ఒక సీటు కేటాయించినట్లు వార్తలు వచ్చినా వాటిని అదానీ గ్రూప్ మొన్న ఆదివారం ఖంచిందింది. రాజకీయాల్లో వచ్చే ఉద్దేశం అదానీ కుటుంబంలో ఎవరికీ లేదని ప్రకటన విడుదల చేశారు. మరో వైపు కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేత డా. కిల్లి కృపారాణికి అవకాశం దక్కుతుందని భావించినా ఆర్. కృష్ణయ్యకు ఇవ్వాల్సి రావడంతో ఆమెను పక్కన పెట్టినట్లు తెలిసింది.

రెండున్నర దశాబ్దాలుగా బీసీ కులాల సమస్యలపై పోరాటం చేస్తూవస్తోన్న ఆర్. కృష్ణయ్య 2014 ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి  తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి  గెలుపొందారు. ఆ తర్వాత  కాంగ్రెస్ లో చేరి 2018 ఎన్నికల్లో  పోటీ చేసి  ఓటమి పాలయ్యారు.

తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచీ బలమైన ఓటుబ్యాంకు గా ఉంటూ వస్తోన్న బీసీలను తమవైపు లాక్కునేందుకు సిఎం జగన్ పావులు కదుపుతున్నారు. అందుకే రాజ్యసభ, శాసన మండలి, నామినేటెడ్ పోస్టులతో పాటు, ఇటీవల మంత్రివర్గ విస్తరణలో కూడా ఈ వర్ఘాలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. ఇప్పుడు నాలుగు ఖాళీలలో కూడా రెండు బీసీలకే కేటాయించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్