Sunday, January 19, 2025

జాతక చిత్రం

Astro Maestro: బాహుబలి తరువాత సాహో, రాధే శ్యామ్ చేసినందుకు ప్రభాస్ ను అభినందించాలి. అర్థం చేసుకోవాలి. ఏ సినిమా కథ అయినా వినేప్పుడు ఊహించుకుంటారు కాబట్టి సినిమా అత్యద్భుతంగా కనపడుతుంది. కానీ తీసిన తరువాత అందులో కథను ప్రేక్షకులు కోరుకుంటారు. కథ దానికదిగా కథనంతో తెలిసిపోవాలి కానీ…కథ ఎక్కడుందో? ఏమిటో? అని ప్రేక్షకులు వెతుక్కోవాల్సిన పరిస్థితి రాకూడదు. సాధారణంగా కొత్త కథలు ఉండవు. పాత కథలనే కొత్తగా చెప్పాలి.

ముప్పావు కే జి గీతాంజలి, పావు కే జి టైటానిక్ లను మిక్సీలో వేసి…యాభై ఏళ్లు వెనక్కు తీసుకెళ్లి ఇటలీ రోమ్ రోడ్లలో రుబ్బితే రాధే శ్యామ్ కథ అయ్యిందని సామాన్య ప్రేక్షకుడికి అనిపించవచ్చు. అత్యంత అందమయిన ప్రాంతాలను కళ్లప్పగించి చూస్తూ అలా కూడా అనుకోక ఒక అలౌకిక స్థితిలో ఉండిపోవచ్చు.

 Radhe Shyam

థియేటర్లకు వెళ్లి అనుచిత ప్రాథమిక నిర్బంధాన్ని భరించలేక ఇంట్లో టీవీల్లో, ఓటీటీల్లో వచ్చినప్పుడు ముక్కలు ముక్కలుగా ఒక సినిమాను వారం రోజులు చూసే నాలాంటివారికి ఏ రోజుకారోజు కథ జారిపోతూ ఉంటుంది. అలా రాధే శ్యామ్ నాచే చూడబడింది. లేదా చూడబడితిని.

తేనెటీగలు వాలే ముంగురులు, చిలుక ముక్కు, దొండపండు లాంటి పెదవులు, తామరతూడుల్లాంటి చేతులు…లాంటి కావ్య వర్ణనలను ఎగతాళి చేస్తూ ప్రఖ్యాత చిత్రకారుడు తలిశెట్టి రామారావు “ప్రబంధ సుందరి” పేరిట ఒక బొమ్మ గీశారు. అయితే నడుమే లేకుండా, తామర కాడల చేతులు, దొండ పండు పెదవులతో ఆ ప్రబంధ సుందరి పరమ వికారంగా…పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చి భయపెట్టేలా ఉంటుంది. అలా ఏ ముక్కకు ఆ ముక్కను చూసుకుంటూ రాధే శ్యామ్ ను ఆనందించడానికి ప్రయత్నించాలేమో?

తెలుగు సినిమా పూర్వ పుణ్యాల ఫలంగా దొరికిన కన్నడ పూజా హెగ్డే తనకు తానే తెలుగు డబ్బింగ్ చెప్పుకున్నందుకు ఆమె ధైర్యాన్ని అభినందించాలి. హీరో- హీరోయిన్ల ప్రాణం ఉంటుందో? పోతుందో? తెలియని ఈ సినిమాలో హెగ్డే స్పష్టంగా ప్రానం…ప్రానం…అంటుంటే మన పై ప్రాణాలు పైపైకే పోతాయి. హీరోయిన్ పేరు ప్రేరణలో “ణ” ఆల్రెడీ ఉంది కాబట్టి ఆమె ‘ణ’ ను ‘న’ అని పలికి ఉంటుందని సర్దుకుపోవడం తప్ప భాషాభిమానులు చేయగలిగింది లేదు. అయినా తమిళ మూలాలతో అమెరికాలో పుట్టి…పబ్ డి జె ఊపు పాటలను కూడా పంచె కట్టుకుని… జ్యోతి ప్రజ్వలన చేసి…గణపతి ప్రార్థనతో కర్ణాటక సంగీత కచేరీలో పాడినట్లు పాడే సిధ్ శ్రీరామ్ ఉంటే అనడానికి ఉల్టే ఉల్టే అంటుంటే… ఒక్కరయినా అభ్యంతరం చెప్పకపోగా…కుళ్ళబొడిచింది చాలదు… ఇంకా ఉల్టే బాగుల్టుందని అతని వెల్టపడి…కుళ్ళబొడిపించుకుల్టున్న సముద్రమంత భాషా సహనం మనది.

 Radhe Shyam

జాతకాలు- నమ్మకాల మీద అల్లిన రాధే శ్యామ్ లో 99 శాతం, ఒక శాతం ప్రాబబిలిటీ లెక్కల సిద్ధాంతాన్ని, సూత్రాలను పట్టుకోవాల్సిన బాధ్యత, వాటిని కథకు అన్వయించుకోవలసిన శ్రమ ప్రేక్షకుల మీదే ఉంటుంది.

“నీకోసం నే చస్తా;
నాకోసం నువ్ బతుకు;
నా చావు నీకు ప్రాణం;
నీ ప్రాణానికి నా చావు అడ్డు;
నువ్ బతికితే నేనొస్తా;
నేనొచ్చే దాకా నువ్ బతుకుతావ్”
లాంటి చావు బతుకుల మధ్య సన్నని విభజన రేఖదాకా ప్రేక్షకులను తీసుకెళ్లారు. చివర సునామీతో కల్లోలమయిన కడలిలో హీరో ధీరోదాత్తంగా టైటానిక్ ను గుర్తుకు తెస్తూ నడిరాత్రి సముద్రాన్ని ఈది…తెల్లవారేలోపు రోమ్ చేరి…సర్జరీ జరిగి…వీల్ చెయిర్లో బతికిన ప్రేరనను సారీ ప్రేరణను చూడ్డంతో ప్రేక్షకుల ప్రానం సారీ ప్రాణం లేచి వస్తుంది.

“మన జాతకం చేతి గీతల్లో ఉండదు- మన చేతల్లో ఉంటుంది” అనే అర్థం వచ్చే రాజమౌళి వాయిస్ తో శుభం కార్డు పడుతుంది.

యూరోప్ లో, ప్రత్యేకించి ఇటలీలో అందమయిన దృశ్యాలను చూడాలనుకునేవారికి రాధే శ్యామ్ కొంచెం ఉపయోగపడగలదేమో!
కథ, కథనం వెతికేవారికి మాత్రం బాధే శ్యామ్!!

ఇందులో ప్రభాస్ తప్పేమీ లేదు. వైవిధ్యమయిన కథలతో ప్రయోగాలు చేస్తున్నాడు. ఒక బాహుబలి తరువాత ఆ అడ్వాంటేజ్ ను పిండుకోవడానికి చాలా మేధోమథనం జరగాలి. ఇప్పటికీ మించి పోయింది లేదు. నేల విడిచి గ్రాఫిక్స్ సాము చేసే సాహోలను, ఒక శాతం ప్రాబబిలిటీ రాధే శ్యామ్ చేతి రేఖలను కాకుండా…ప్రభాస్ వెతుక్కోవాల్సింది ఇంకేదో ఉంది.

-పమిడికాల్వ మధుసూదన్

ఇవి కూడా చదవండి:

త్రిబుల్ ఆర్ పుస్తకం

ఇవి కూడా చదవండి:

రాములో! రాములా! ఇంతకూ నీవెవరు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్