Sunday, January 19, 2025
HomeTrending Newsదక్షిణాది పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దక్షిణాది పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 26 నుండి 30 వరకు దక్షిణాది పర్యటనకు రానున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ లోబస చేయనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు పర్యటన ఉంటుంది. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము, రామప్ప, భద్రాచలాన్ని సందర్శిస్తారు. హైదరాబాద్లో స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొననున్న రాష్ట్రపతి..రంగారెడ్డి జిల్లా కన్హాశాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు రామచంద్ర మహారాజ్ 150 జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తారు. దీనికి గుర్తుగా హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్ ప్రచార ఫలకం ఆవిష్కరణలో కూడా ఆమె పాల్గొంటారు. రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి విడిది కోసం చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

రాష్టప్రతి మార్గంలో రోడ్డు మరమ్మతులు, బారికేడింగ్‌ పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, కంటోన్మెంట్‌ బోర్డు సీఈవోలను సోమేష్ కుమార్ ఆదేశించారు. పోలీసు శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్రపతి నిలయంలో ప్రొటోకాల్‌ ను అనుసరించి  24 గంటల పాటు విద్యుత్తు శాఖ, వైద్య బృందాలను నియమించాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు.

ప్రతి ఏడాది డిసెంబర్ లో రాష్ట్రపతి వారం రోజుల పాటు దక్షిణ భారత దేశంలో పర్యటించటం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణాది విడిది కోసం ప్రతి ఏటా డిసెంబర్ చివర్లో రాష్ట్రపతి హైదరాబాద్ కు వస్తుంటారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. అయితే కరోనా కారణంగా గడిచిన రెండేళ్లలో దక్షిణాది విడిదికి రాష్ట్రపతి రాలేదు. రాష్ట్రపతి అయ్యాక  ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్