Reforms : ప్రజలకు పట్టింపు లేనంత కాలం వ్యవస్థలో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా లాభం ఏమిటని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రశ్నించారు. విశ్రాంత డీజీపీ పద్మశ్రీ ప్రకాశ్ సింగ్ రాసిన.. ది స్ట్రగుల్ ఫర్ పోలీస్ రీఫార్మ్స్ ఇన్ ఇండియా అనే పుస్తకంపై హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీ ఆడిటోరియంలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చట్టాలున్నా.. ప్రజలకు అవగాహన ఉన్నా.. 40 ఏళ్లుగా పార్టీ ఫిరాయంపులు జరుగుతూనే ఉన్నాయని… చట్టసభల సభ్యుల పదవీకాలం ముగిసే వరకు ఒక్క కేసూ రుజువు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం, ప్రాంత వైషమ్యాలు వదిలి యువత స్పందించినప్పుడే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. సమాజంలో ఏమి జరిగినా ప్రజలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి కనిపించటం లేదని అన్నారు. సీబీఐ లాంటి సంస్థలకు చట్టబద్దత లేదని పాట్నా హైకోర్టు తీర్పు చెప్పిందన్న చలమేశ్వర్…. పదేళ్లుగా ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. అంతిమంగా ఎలాంటి సమాజాన్ని నిర్మించుకోవాలన్న అందుకు ప్రజలు ముఖ్యంగా యువతే నిర్మాతలని వివరించారు.
ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే పోలీసు సంస్కరణలు అనివార్యమని.. పుస్తక రచయిత, విశ్రాంత డీజీపీ ప్రకాశ్ సింగ్ అన్నారు. దేశంలో అవినీతి, అంతర్గత సమస్యల వల్ల ఏటా ఐదు శాతం జీడీపీ కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాను 25ఏళ్లుగా పోలీసు విభాగాల్లో సంస్కరణల కోసం చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. రాజకీయ నాయకుల పోలీసు నుంచి ప్రజల పోలీసుగా మారనంత కాలం వ్యవస్థలో చెప్పుకోదగ్గ మార్పు రాదని అన్నారు. పోలీసు సంస్కరణల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారే తప్ప…. ఏ ఒక్కరూ హృదయపూర్వకంగా సహకరించలేదని వివరించారు. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ సంస్కరణలను కేవలం కాగితాలపైనే చూపుతున్నారని అన్నారు. ప్రజలకు పోలీసులు జవాబుదారిగా ఉండాలన్న ఆయన… ప్రజలకు ప్రతి విషయం పట్ల అవగాహన ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. న్యాయవ్యవస్థ, కొన్ని ప్రభుత్వాల చొరవ వల్ల కాస్త ముందుకు సాగినా…. సంస్కరణలు అమలుకు నోచుకోవటం లేదన్నారు.
ఆధునిక భారత నిర్మాణానికి పోలీసు సంస్కరణలు అవశ్యమని తెలంగాణ టుడే ఎడిటర్ కె.శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రకాశ్ రెడ్డి రాసిన ఈ పుస్తకం భవిష్యత్తు తరాలకు ఓ పరిశోధన గ్రంథం కాగలదని చెప్పారు. 1996 నుంచి మొదలు నేటి వరకు ప్రకాశ్ సింగ్ గారు పోలీసు సంస్కరణల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా…. సాకారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకం పేరు ది స్ట్రగుల్ ఫర్ పోలీస్ రీఫార్మ్స్ బదులుగా… ప్రొట్రాక్టెడ్ స్ట్రగుల్ అని ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. తీవ్రవాద, ఉగ్రవాదం సహా ఎన్నో సమస్యలకు అదనంగా…. సైబర్ క్రైమ్ కోరలు చాస్తోందన్న ఆయన.. పోలీసు సంస్కరణల కోసం ఇక ప్రజలే నినదించాలని పిలుపునిచ్చారు.
43శాతం ఎంపీలు 30శాతం ఎమ్మెల్యేలు నేరచరిత్రకలిగిన వారు ప్రజలకు నేతృత్వం వహిస్తున్నారని అనేక కమిటీల్లో సభ్యుడిగా ఉన్న మజీర్ హుస్సేన్ అన్నారు. ఒక్క జార్ఖండ్ రాష్ట్రంలోనే 74శాతం ఎమ్మెల్యేలకు నేరచరిత్ర ఉందని గుర్తు చేశారు. పోలీసులను కేవలం పావుగా వాడుకుంటున్నారే తప్ప… వారికి పూర్తి స్థాయి స్వేచ్చ లేదని చెప్పారు. పోలీసు వ్యవస్థను రాజకీయ వ్యవస్థ దుర్వినియోగం చేస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రేటర్డ్ డీజీ కమల్.కుమార్ పాల్గొన్నారు.