Friday, May 31, 2024
HomeTrending Newsకేసిఆర్ జాదూ: రేవంత్ ఆరోపణ

కేసిఆర్ జాదూ: రేవంత్ ఆరోపణ

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్ పెద్ద జాదూ అని తెలంగాణా పిసిసి సారధి రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. నీళ్ళ నుంచి ఓట్లు సృష్టించగలదని, నోట్లు కొల్లగొట్టగలడని, నీళ్ళలో నిప్పులు రాజేసి రావణ కాష్టంగా మలిచి చలి కాచుకోగలడని వ్యాఖ్యానించారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు కూడా రెచ్చగొట్టగలడని దుయ్యబట్టారు. ఏపి ప్రభుత్వం ఇచ్చిన జివో 203  ప్రగతిభవన్ లోనే తయారైందని ఆరోపించిన రేవంత్, ఎమ్మెల్యే రోజా ఇంటికెళ్ళి రాయలసీమను రతనాలసీమగా చేస్తామని కేసియార్ చెప్పారని గుర్తు చేశారు.

గోదావరి జలాలపై ప్రాజెక్టులు శరవేగంగా కట్టానని చెబుతున్న కెసియార్ కృష్ణా నదిపై ఎందుకు కట్టలేదని సూటిగా ప్రశ్నించారు. కృష్ణా పరివాహక ప్రాంత రైతుల హక్కులకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు.  రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం 7,045 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఏపి సిఎం జగన్ ప్రభుత్వం జిఓ 203 జారీ చేసినప్పుడే రాయలసీమ ప్రాంతానికి అక్రమంగా నీరు తరలించుకుపోతున్న విషయాన్ని తాము చెప్పామని అప్పుడు ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. విభజన చట్టంలోనే నీటి పంపకాలపై స్పష్టమైన విధానం ఉందని, కర్నాటక, మహారాష్ట్ర నీటి దోపిడీపై ఏనాడూ మాట్లాడని కెసియార్ ఇప్పుడు కేవలం ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం కోసమే హడావుడి చేస్తున్నారని రేవంత్ అన్నారు.

ఈ నెల 9న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంటే దాన్ని 20కి వాయిదా వేయాలని సిఎం కోరుతున్నారని, దీనిపై తెలంగాణా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెసియార్ వెళ్ళకపోతే జగన్ మోహన్ రెడ్డికి లొంగిపోయినట్లే భావించాల్సి వస్తుందన్నారు. సిఎం బిజీగా ఉంటే కడియం శ్రీహరినో, తుమ్మల నాగేశ్వర రావునో పంపాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా రెండుసార్లు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాయిదా వేయించారని రేవంత్ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్