Friday, March 29, 2024
HomeTrending Newsనేతన్నలకూ బీమా : సిఎం కేసిఆర్

నేతన్నలకూ బీమా : సిఎం కేసిఆర్

రైతులకు ఇస్తున్న బీమా పథకాన్ని చేనేత కార్మికులకూ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కేసీయార్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం ఇస్తున్నామని, నేతన్నలకూ అదే విధంగా సాయం ఇస్తామని చెప్పారు. నర్సింగ్ విద్యార్ధుల స్టైఫండ్ పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం మొదటి, రెండవ, మూడవ సంవత్సరం విద్యార్ధులకు వరుసగా రూ. 1500, 1700,1900 స్తైఫండ్ ఇస్తున్నారని, దాన్ని 5,000, 6,000, 7,000 రూపాయలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతోందని, దానిలో లెక్కలు తయారు చేసి వచ్చే నెల నుంచి 57  ఏళ్ళు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని ప్రకటించారు.

కాళేశ్వరం అయ్యేదా పొయ్యేదా అని మాట్లాడుకున్నారని, కానీ ప్రాజెక్టు పూర్తి చేసి చూపెట్టామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం రికార్డు సాధించిందని సిఎం వివరించారు, మన ప్రాంతీయ ఛానెల్స్ చూపించకపోయినా డిస్కవరీలో కాళేశ్వరం గొప్పదనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపారని అన్నారు.

సిరిసిల్లకు మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే ఈ ఏడాది ఏడు కాలేజీలు ఇచ్చామని, వచ్చేసారి సిరిసిల్లకు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 10  వేల కోట్ల రూపాయలతో వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.

చిత్తశుద్ధి, లక్ష్య శుద్ధి, వాక్ శుద్ధి ఉంటే ఏదైనా వంద శాతం సాధ్యమే అవుతుందని, అలా పట్టుబట్టి పోరాడి  ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని కేసియార్ గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత లక్ష్యం దిశగా వెళ్తున్నామని… ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయని సిఎం వెల్లడించారు. ఆరేళ్లలో వ్యవసాయంలో అద్భుతాలు జరిగాయని, 92 లక్షల ధాన్యాన్ని ఎఫ్.సి.ఐ.కు ఇస్తున్నామని, వలసపోయిన వారు మళ్ళీ తిరిగి వస్తున్నారని వివరించారు.

కాళేశ్వరం ప్రాజేకు విద్యుత్ బిల్లులపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, రైతుల కోసం 10వేల కోట్ల రూపాయలు బిల్లు అయినా భరిస్తామని కేసిఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ రాక ముందే మిషన్ కాకతీయకు, రూపకల్పన చేశామని, ఎత్తైన ప్రాంతాలకు కూడా సాగునీరు సరఫరా చేయాలని ప్రణాళికలు రచించామని వెల్లడించారు. మిషన్ భగీరథ ఒక అద్భుతమని, 11 రాష్ట్రాల నుంచి అధికారులు, మంత్రులు ఈ పథకం గురించి తెలుసుకోవడానికి వచ్చారని సిఎం చెప్పారు.

అంతకుముందు నర్సింగ్ కళాశాల, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ప్రారంభోత్సవంలో సిఎం పాల్గొన్నారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో  సిఎం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటియార్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్