Thursday, April 18, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సిఎంల చర్చలు అవాస్తవం : రోజా

సిఎంల చర్చలు అవాస్తవం : రోజా

రేవంత్ రెడ్డి కోవర్ట్ రెడ్డిగా మారిపోయారని నగరి ఎమ్మెల్యే, ఏపీఏఐఐసి చైర్ పర్సన్ ఆర్కే రోజా విమర్శించారు. తన ఇంట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు జగన్, కెసియార్ లు మంతనాలు జరిపారని రేవంత్ చెప్పడంపై ఆమె మండిపడ్డారు. దైవదర్శనానికి వెళుతూ కేసియార్ తన ఇంట్లో కాసేపు ఆగారని, వైఎస్ జగన్ తన ఇంటికి రాలేదని ఆమె వెల్లడించారు. ఇద్దరు సిఎంలు తన ఇంట్లో చర్చలు జరిపారన్నది అవాస్తవమని రోజా కొట్టిపారేశారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే కాబట్టి సిఎం జగన్ ప్రధానమంత్రికి, జల శక్తి మంత్రికి లేఖలు రాశారని చెప్పారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు రాకుండా తెలంగాణా ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తోందని ఆరోపించిన రోజా, సీమ హక్కులను కేంద్రం పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని దివంగత నేత వైఎస్ నమ్మారని, అయన బాటలోనే నేడు జగన్ మోహన్ రెడ్డి కూడా నడుస్తున్నారని రోజా అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ అగ్రి ల్యాబ్ లతో వ్యవసాయ సేవలను రైతు ముంగిట్లోకే తీసుకు వచ్చారని చెప్పారు. నీటి వివాదాలపై చంద్రబాబు, లోకేష్ లవి దిగజారుడు రాజకీయాలని, తన తండ్రి సిఎంగా ఉన్నప్పుడు నీటి గొడవలు లేవని లోకేష్ చెప్పడం హాస్యాస్పదమని రోజా వ్యాఖానించారు.  రైతులను దగా చేసింది టిడిపి అని అందరికీ తెలుసనీ, 14  ఏళ్ళు సిఎంగా ఉన్న చంద్రబాబు రైతుల సంక్షేమం కోసం ఒక్క పథకమైనా ప్రవేశ పెట్టారా అని రోజా ప్రశ్నించారు. నేటి ఉదయం తన అన్న కుమార్ స్వామి రెడ్డి  కుటుంబంతో కలిసి తిరుమల లో శ్రీవారి దర్శనం చేసుకున్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్