బిజెపి – కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బిజెపి మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రిజర్వేషన్ల రద్దు కోసమే అబ్ కి బార్ చార్ సౌ పార్ అని నినాదం ఎత్తుకున్నారని కాంగ్రెస్ అగ్రనేతలు విమర్శలు చేస్తున్నారు. ఇండియా కూటమి నేతలు కొద్ది రోజులుగా అన్ని రాష్ట్రాల్లో ఇదే ఏకరువు పెట్టారు.
ప్రచారం క్రమంగా ఉదృతం కావటంతో బిజెపి సరిదిద్దే పనికి పూనుకుంది. రిజర్వేషన్లు రద్దు చేసే ఉద్దేశం బిజెపికి లేదని ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే వివరణ ఇచ్చారు. తాజాగా ఆర్.ఎస్.ఎస్ కూడా దీనిపై స్పందించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘ్ పరివార్ తొలి నుంచి రాజ్యాంగం నిర్ధేశించిన అన్ని రిజర్వేషన్లకు మద్దుతగా నిలుస్తోందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భగవత్ .. ఆరెస్సెస్ రిజర్వేషన్లకు అనుకూలమైనా కొందరు సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలతో దుష్ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు.
ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఓ వీడియోను కొందరు వైరల్ చేస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తమని తోసిపుచ్చారు. రాజ్యాంగం ప్రకారం అమల్లో ఉన్న రిజర్వేషన్లకు తామెన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని మోహన్ భగవత్ పేర్కొన్నారు. అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. కృత్రిమ మేధ సాయంతో ఫేక్ వీడియోలు తయారుచేసి, వాటిని సోషల్ మీడియాలో ప్రచారంలో పెడుతున్నారని మండిపడ్డారు.
ఇండియా కూటమి నేతల ప్రచారం ప్రజల్లోకి వెళితే దళిత, బహుజనుల ఓటర్లు కమలం పార్టీని దూరం పెట్టే ప్రమాదం ఉంది. బిజెపిని ఎదుర్కోలేక సంఘ్ పరివార్ పై తప్పుడు ఆరోపణలు చేసి ప్రచారం చేస్తున్నారని బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అబ్ కి బార్ చార్ సౌ పార్ నినాదం బిజెపికి గుదిబండగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఇండియా షైనింగ్ నినాదంతో అటల్ బిహారీ వాజపాయి హయంలో బిజెపి ఓటమి చవిచూసింది. ఇప్పుడు చార్ సౌ పార్ నినాదం ప్రతికూలంగా మారుతోందని అంటున్నారు.
-దేశవేని భాస్కర్