Sculptor of Literature: దాదాపు 350 ఏళ్ల పాటు అన్నమయ్య కీర్తనల రాగిరేకులు తిరుమల గుడి గోపురం గూట్లో మట్టికొట్టుకుని ఉండిపోయాయి. 32 వేల కీర్తనల్లో దొరికినవి కేవలం 14,800 మాత్రమే. “రాగం తెలియని జాతి రాగి రేకులను కరిగించుకు తిన్నది” అని ఒక రచయిత గుండెలు బాదుకున్నాడు. 1922లో రాగిరేకుల నుండి అన్నమయ్య కీర్తనలను ఎత్తి రాసి, ప్రచురణకు వీలుగా పరిష్కరించే మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టినవారు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన పని మొదలు పెట్టిన నాటికి టీ టీ డి పుట్టనే లేదు. (ఈస్ట్ ఇండియా కంపెనీ తిరుమల ఆలయ నిర్వహణను హథీరాం మఠం- మహంతుల చేతిలో పెట్టింది. 1933లో టీ టీ డి ఏర్పడేవరకు ఆలయ బాధ్యతలు వారే చూసుకున్నారు) ఆయన వేసిన తోవలో నడిచినవారు వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ.
సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 41వ వర్ధంతి, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ 101వ జయంతిని టీ టీ డి ఘనంగా నిర్వహించింది. గౌరిపెద్ది వారి సాహిత్య సేవ గురించి మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా టీ టీ డి నన్ను ఆహ్వానిస్తే వెళ్లాను. అష్టావధాని, వ్యాకరణ పండితుడు అయిన మా నాన్న పమిడికాల్వ చెంచు సుబ్బయ్యకు గౌరిపెద్దివారు కాలేజీలో గురువు. మా నాన్నకు అవధాన విద్య నేర్పింది ఆయనే. తిరుపతిలో, లేపాక్షిలో ఆయన్ను చిన్నప్పుడు చాలాసార్లు చూశాను. ఆయన గురించి మా నాన్న మైమరచి చెప్పిన ఎన్నో విషయాలను మననం చేసుకుంటూ గతంలో నేను రాసిన నాలుగు మాటలు ఇవి:-
ఆయన గురించి నా శక్తిమేర తయారు చేసిన వీడియో డాక్యుమెంటరీ ఇది:-
సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గురించి ఇప్పటి తరం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆయన పరమ సాత్వికుడు. 1919లో చిరు ఉద్యోగిగా ఆలయంలో అడుగు పెట్టారు. అప్పటికి టీ టీ డి లేదు. మహంతుల చేతిలో ఉంది ఆలయం. ఉదయం మెట్లెక్కి కొండ మీదికి వెళ్లడం…రోజంతా శాసనాలు రాసుకోవడం…రాత్రికి కిందికి దిగి…చమురు దీపాల వెలుగులో వాటిని ఎత్తి రాసుకోవడం...అన్నమయ్య రాగి రేకులను 1922లో వెలికి తీయించింది ఆయనే. కొన్ని పీఠాలు, యూనివర్సిటీలు కలిసి చేయాల్సినంత పనిని ఆయన ఒక్కడుగా చేశారు. పాతికేళ్లపాటు ఆలయంలో, పదవీ విరమణ తరువాత బయట ఆయన కృషి అనన్యసామాన్యం.
ఆయన చరిత్రకారుడు. శాసనాల పరిష్కర్త. పురాణ పండితుడు. భాషాభిమాని. భక్తితత్పరుడు. ప్రతిఫలాపేక్ష లేకుండా తుది శ్వాస వరకు తన ప్రతిభను, శక్తి సామర్థ్యాలను చరిత్ర అన్వేషణకు, ఆధ్యాత్మిక సాహిత్య సేవకే వినియోగించారు.
క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నాటికే తిరుమల ఆలయం వైభవోపేతంగా ఉందన్న శాసనాధారాన్ని వెలికి తీశారు. తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని అనేక పురాణాలు, తెలుగు, తమిళ ఆధ్యాత్మిక గ్రంథాల ఆధారంగా సాధికారికంగా రూపొందించారు. తిరుపతితో పాటు చుట్టుపక్కల అనేక ఆలయాల చరిత్రను లిఖించారు. భాండాగారంలోని అన్నమయ్య రాగి రేకులను తొలిసారి వెలికి తీశారు. తనకున్న శాసన భాషా పరిజ్ఞానంతో అన్నమయ్య కీర్తనల భాషను ఎత్తి రాశారు. దాంతో తరువాత పండితులు, సంగీతజ్ఞుల పని సులభమయ్యింది. 1167 రాగి రేకుల సమాచారాన్ని పరిష్కరించడానికి ఆయన పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు.
1981లో తుది శ్వాస వదిలిన సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి సేవలకు గుర్తింపుగా తిరుపతి ఎస్ వీ యూనివర్సిటీ మెయిన్ గేటు ముందు ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది టీ టీ డి. ఏటా ఆయన జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తూ ఆయనను స్మరించుకుంటోంది.
“దాచుకో నీపాదాలకు – దగ నే జేసినపూజ లివి
పూచి నీకీరీతిరూప – పుష్పము లివి యయ్యా…
వొక్కసంకీర్తనే చాలు – వొద్దికైమమ్ము రక్షించగ
తక్కినవి భాండారాన – దాచి వుండనీ…”
అని అన్నమయ్య అననే అన్నాడు. నేనల్లిన పదాలు నీ పాదాలకు పూజా పుష్పాలు. ఒక్క సంకీర్తన చాలు మమ్మల్ను రక్షించడానికి. మిగిలినవి నీ భాండాగారంలో దాగి ఉండనీ– ఆయన అన్నట్లే జరిగింది. కారణజన్ముడి వాక్కు మరి. ఆ భాండాగారంలో దాగిన అం అన్నమయ్య కీర్తనలు వెలుగులోకి రావడానికి కారణజన్ముల కోసం నిరీక్షించవా మరి!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018