Saturday, April 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతిరుపతిలో గౌరిపెద్ది విగ్రహావిష్కరణ

తిరుపతిలో గౌరిపెద్ది విగ్రహావిష్కరణ

In the Service of Annamayya Literature: తెలుగు భాషకు అన్నమయ్య చేసిన మహోపకారం గురించి రోజూ తలచుకోవాలి. సామాన్య జనం మాట్లాడుకునే మాండలిక భాషకు మంత్రస్థాయి కలిగించి, వాటిలో బీజాక్షరాలను బంధించి…వాటిని వెంకన్నకే ముప్పొద్దులా పద నైవేద్యంగా సమర్పించాడు అన్నమయ్య.  “తన కాలంలో సాటి కవుల్లా అన్నమయ్య కూడా ప్రబంధ పద్య కావ్యాలు రాస్తూ కూర్చుని ఉంటే తెలుగు భాషకు ఉపయోగం ఉండేదో? లేదో? కానీ…ఆయన పద సాహిత్యాన్ని భుజానికెత్తుకోవడం తెలుగు భాష చేసుకున్న అదృష్టం” అన్నారు సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు. అప్పటికే జనం నోళ్ళల్లో నానుతున్న మరాఠీ, కన్నడ అభంగాలు, భజనలు అన్నమయ్యను బాగా ప్రభావితం చేసి ఉంటాయని పుట్టపర్తివారి ఊహ.

“నీవలన నాకు పుణ్యము;
నావలన నీకు కీరితి”
అని అన్నమయ్య సాక్షాత్తు వెంకన్నకే చెప్పుకున్నాడు. నిజమే వెంకన్న కీర్తి కిరీటంలో అన్నమయ్య కలికి తురాయి. ఇంకెన్ని యుగాలయినా వెంకన్నకు అన్నమయ్యలాంటి పి ఆర్ ఓ దొరకడు. ఇంకెన్ని యుగాలయినా రక్తమాంసాలతో మనిషిగా పుట్టినవాడెవడూ ఒక జీవితకాలంలో అన్నమయ్య సృష్టించినంత అంతులేని సాహిత్యామృతధార సృష్టించలేడు.

“శ్రుతులై శాస్త్రములై పురాణకథలై సుజ్ఞానసారంబులై
యతిలోకాగమ వీధులై విపుల మంత్రార్థంబులై నీతులై
కృతులై వేంకటశైల వల్లభు రతిక్రీడా రహస్యంబులై
నుతులై తాళులపాక అన్నయవచోనూత్న క్రియల్ చెన్నగున్”

అని అన్నమయ్య మనవడు చిన తిరుమలాచార్యులు చెప్పినట్లు ఒక్కో అన్నమయ్య కీర్తన ఒక్కో కావ్యంతో సమానం. వేదసారం. పురాణ కథ. సుజ్ఞానసారం. మంత్రార్థం. సామాన్యుల స్తోత్రాలు. భజనలు. మాటలకందని నూత్న పద చిత్రాలు.

తాళ్లపాక కవుల్లో అన్నమయ్యతో సమానమయిన కవులు చాలామందే ఉన్నారు. స్వయంగా అన్నమయ్య భార్య గొప్ప కవయిత్రి. పెద్ద కొడుకు పెద తిరుమలాచార్యులు, ఆయన కొడుకు అంటే అన్నమయ్య మనవడు చిన తిరుమలాచార్యులు అనన్యసామాన్యమయిన కవులు. వీరి కీర్తనలు కూడా అన్నమయ్య కీర్తనలుగానే లోకంలో ప్రచారంలో ఉన్నాయి. తాళ్ళపాక వంశం వారు తెలుగు ప్రపంచానికి ఇచ్చిన సాహిత్యంలో మనకు దొరికి…మిగిలింది ఆవగింజంత. తాళపత్ర గ్రంథాల్లో కాలగర్భంలో కలిసిపోయింది సముద్రమంత.

అన్నమయ్య 32 వేల కీర్తనలను ఆయన మనవడు రాగిరేకుల మీద రాయించి, భద్రపరిస్తే…వాటిలో మహా అయితే 14 వేలు మాత్రమే కాలానికి దక్కాయి. దొంగలు దొంగిలించినవి కొన్ని, అవేమిటో తెలియక రాగిరేకులను కరిగించి సొమ్ము చేసుకున్నవి కొన్ని. పోయినవాటి గురించి ఏడ్చి లాభం లేదు.

ఉన్నవాటి గురించి లోకానికి తెలియడానికి మాత్రం దాదాపు 350 ఏళ్లు పట్టింది. తిరుమల గోపురం గూట్లో మూడున్నర శతాబ్దాల పాటు మట్టిలో మట్టిగా దుమ్ముకొట్టుకుపోయిన అన్నమయ్య కీర్తనలను వెలికి తీసి, పరిష్కరించి, అప్పటి తెలుగు లిపిని అర్థం చేసుకుని…ఇప్పటి తెలుగు లిపిలోకి వాటిని ఎత్తి రాసి, రాగాలను నిర్ణయించిన మహానుభావుల గురించి తెలుసుకోకపోతే చరిత్ర మనల్ను క్షమించదు.

ఇప్పుడు సా…పా…సా… అని అనగలిగిన ప్రతి గాయకుడూ అన్నమయ్యకు రాగాలు బోధించగలుగుతున్నారు. అక్షరాలు కలిపి చదవడం వచ్చిన ప్రతివారూ అంతర్యామి ఎందుకు అలసిపోయాడో? వివరించి చెప్పగలుగుతున్నారు.

అటకెక్కిన అన్నమయ్యను రాగిరేకుల మీదినుండి కిందికి దించి, బూజు దులిపి, అక్షరమక్షరం చదివి, సంగీత సాహిత్యాలకు భంగం కలుగకుండా ఎత్తి రాసి లోకానికి ప్రసాదించినవారిలో సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ అగ్రగణ్యులు.

గౌరిపెద్ది రామసుబ్బ శర్మగారి శతజయంతి సందర్భంగా 2022 సెప్టెంబర్ పదో తేదీ తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహం ఆవిష్కరించనున్నారు.

అన్నమయ్య కీర్తనల్లో ఏయే కీర్తనలను గౌరిపెద్దివారు పరిష్కరించారో, సాధారణ వ్యాకరణ సూత్రాలను అన్నమయ్య ఎక్కడెక్కడ ఎందుకు పట్టించుకోలేదో అన్న విషయాలను గౌరిపెద్దివారు మనకు ఎట్లా పట్టి చూపారో తరువాత ఎప్పుడయినా విడిగా చర్చించుకుందాం.

యాభై ఏళ్లు వెనక్కు, యాభై ఏళ్లు ముందుకు ఒక డేట్ చెప్పి తిథి వార నక్షత్రాలు చెప్పమంటే గౌరిపెద్దివారు టక్కుమని తడుముకోకుండా చెప్పేవారట. మా నాన్నకు ఆయన గురువు. నాకు పరమ గురువు. మా నాన్నను ముద్దుగా పెద్ద కొడుకుగా పిలిచేవారని వారి అబ్బాయి గౌరిపెద్ది భగవాన్ నాకు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.

తిరుపతిలో తండ్రి విగ్రహావిష్కరణ పనుల్లో తలమునకలుగా ఉన్నా…మా నాన్న అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి తనకు తానే చేసిన సౌజన్యమూర్తి భగవాన్. మా నాన్న అవధానంలో, నా అక్షరాల్లో గౌరిపెద్దివారు దండలో దారంలా ఉంటారు. అటువంటి గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారి విగ్రహావిష్కరణ వేళ నాలుగు మాటలు రాయకపోతే బాగోదు. నిజానికి వారి గురించి అందరికీ తెలిసేలా వీడియో చేసేస్తానని భగవాన్ గారికి మాటిచ్చాను. ఈలోపు మా నాన్నగారు కాలం చేయడంతో కుదరలేదు. కొంత కుదుటపడిన తరువాత గౌరిపెద్దివారి సాహితీసేవ, ప్రతిభా విశేషాల గురించి కొండను అద్దంలో చూపినట్లు ఒక ప్రత్యేక వ్యాసం రాసి, వీడియో చేసి పెడతాను.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

“వెన్న కృష్ణుడి”తో ఆమె అనుబంధం

RELATED ARTICLES

Most Popular

న్యూస్