తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో ముఖ్యమంత్రి వైయస్.జగన్ పేరును ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ భారీ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందని, అసలు ఈ కుట్ర పై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ విపరీత ధోరణికి, సెన్సేషనలైజేషన్‌కు ఇది నిదర్శనమని , సిబీఐ దిగజారిపోయి వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
వివేకా హత్య కేసులో అవినాష్‌ను, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ను టార్గెట్ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ఎల్లోమీడియా ప్రచారం చేసుకుంటూ వస్తోందని, ఒక స్క్రిప్టు రాసుకుని.. దాని విస్తృతంగా ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నామని, ఈ ప్రచారం ఆధారంగానే దర్యాప్తు జరుగుతోందన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా చవకబారు ఆరోపణలు చేస్తున్నారని. కేవలం సెన్షేషనలైజేషన్‌కోసమే ఇవన్నీ చేస్తున్నారని సజ్జల అభిప్రాయపడ్డారు. సీబీఐ ఏం చేయాలనుకుంటుందో ఈ ఎల్లోమీడియాకు ఎలా ముందుతెలుస్తోందని ప్రశ్నించారు. ఎల్లోమీడియా స్క్రిప్టు తయారుచేస్తుంటే.. దాన్ని సీబీఐ మెన్షన్ చేస్తోందని … దర్యాప్తు సంస్థ ఏదైనా మెన్షన్ చేస్తే దానికి ఆధారాలు చూపిస్తుందని కాని ఇక్కడ అదేమీ జరగలేదని విస్మయం వ్యక్తం చేశారు. ముందే అనుకుని అవినాష్‌రెడ్డి అరెస్టులకు ఏం కావాలో రాస్తున్నారని విమర్శించారు.